Maoist plan for destroying the script

ధ్వంస రచనకు మావోయిస్టుల ప్లాన్‌?

– అన్నల మౌనానికి వెనుక అంతరంగం?

-పండుగపూటా అడవుల్లో ఆగని గాలింపు

-అనుమానితులపై పోలీసుల నిఘా

Date: 14/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

వరుస దెబ్బలతో దెబ్బతింటున్న మావోయిస్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వారు వ్యూహాలకు పదును పెడుతున్నారా? సరికొత్త ధ్వంస రచనకు ప్లాన్‌ చేస్తున్నారా? పోలీసులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? వారికి లభ్యమైన ఆధారాలేంటీ? పోలీసుల్ని ఎదుర్కోవడానికి మావోయిస్టులు కఠోర శిక్షణ పొందుతున్నారా? కూంబింగ్‌ కోసం భద్రతా సిబ్బంది ఉపయోగిస్తున్న హెలికాప్టర్ల కూల్చివేతపై మావోయిస్టులు దృష్టి సారించారా? ఇందుకోసం కేడర్‌కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారా? ఆర్మీ తరహాలో కఠోర సాధన చేస్తున్నారా? అంటే పరిస్థితులు ఔననే అనిపిస్తున్నాయి. ఇదేమీ అషామాషి వ్యవహారం కాదు. పక్కా ప్లానింగ్‌. ప్రతి అడుగులో, ప్రతి కదలికలో ప్లానింగ్‌ కనిపిస్తోంది. మెరికల్లాంటి సిబ్బందిని ఎంచుకొని వారికి షూటింగ్‌లో ట్రైనింగ్‌ ఇస్తున్నారట అన్నలు. ఎప్పుడు, ఎటు నుంచి హెలికాప్టర్‌ వచ్చినా క్షణాల్లో కూల్చేసేలా ట్రైనింగ్‌ సాగుతోందన్నది సమాచారం. రియల్‌ టైమ్‌లో రయ్‌ మంటూ దూసుకొచ్చే హెలికాప్టర్‌ను అటాక్‌ చేయడం, ఆ వెంటనే అందులో ఉన్నవారిపై బుల్లెట్ల వర్షం కురిపించడం, అంతా కమాండో తరహా ట్రైనింగ్‌. రెండు పొడవాటి చెట్ల మధ్య ఓ తాడుని కట్టి దానిపై నుంచి ఓ హెలికాప్టర్‌ నమూనా రయ్‌ మంటూ దూసుకొచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారట. దీని ద్వారా హెలికాప్టర్‌ ఎంత ఎత్తులో ఉన్నప్పుడు అటాక్‌ చేయాలి? ఎలా చేయాలనేదానిపై ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఈ సమాచారం ఇప్పటికే పోలీసుల వరకూ వెళ్లిందని, అందులో భాగంగానే వారిలో గుబులు మొదలైందనీ తెలుస్తోంది. ఒకవేళ ప్లాన్‌ ఫెయిల్‌ అయితే మరో కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారట నక్సలైట్లు. అంటే గాల్లో పేల్చేయడం మిస్‌ అయితే ల్యాండ్‌ అయిన వెంటనే అటాక్‌ చేయడం అన్నమాట. కమాండో తరహాలో మావోయిస్టులు శిక్షణ తీసుకుంటున్న ఓ పుటేజ్‌ ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా అటవీ ప్రాంతంలో ఆ మధ్య కూంబింగ్ పార్టీ చేతికి చిక్కింది. దాన్ని పోలీసులు చాకచక్యంగా సంపాదించే ఉంటారు. వీళ్ల ట్రైనింగ్‌ చూసి పోలీసులు కూడా ఖంగుతిన్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కువైనప్పుడు పోలీసులు కూంబింగ్‌తోపాటు వాయుమార్గంలో వారి జాడను పసిగట్టి మూకుమ్మడి దాడి చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇప్పటి వరకు పోలీసులదే పైచేయిగా ఉంటోంది. కానీ పరిస్థితులు మారిపోయాయి. మావోయిస్టులు పోలీసుల యాక్షన్‌ను తిప్పికొట్టేందుకు గట్టిగానే ప్రిపేర్‌ అవుతున్నారు. అందులో భాగమే ఈ హెలికాప్టర్ల కూల్చివేత ప్రాక్టీస్‌. హెలికాప్టర్‌ను కూల్చడంలో మావోయిస్టులు సక్సెస్‌ అయితే మున్ముందు పెను సవాళ్లు తప్పవని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. దేశభద్రత కోసం కఠోర శిక్షణ పొందిన సైన్యానికి మాత్రమే ఈ సాంకేతికత ఉంటుందని, మావోయిస్టులు సైతం దీన్ని తెలుసుకోగలిగితే అంతర్యుద్ధం తప్పదన్నారు. నిజానికి మావోయిస్టులను ఏరివేయడంలో పోలీసులు చాలా వరకు సక్సెస్‌ అయ్యారు. గతంతో పోలిస్తే వారి ప్రభావం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. అయితే మావోయిస్టులకు గట్టి పట్టున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఇదే భద్రతాదళాలకు సవాల్‌గా మారుతోంది. ఇంత వరకు పోలీసులు సుకుమా అటవీ ప్రాంతంపై పట్టు సాధించలేక పోయారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మావోయిస్టులు హెలికాప్టర్లను టార్గెట్‌ చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ చాలా సార్లు కాల్పులు జరిపారు. అయితే వాటిని కూల్చడంలో మాత్రం సక్సెస్‌ కాలేదు. అది అంత తేలికైన విషయం కాదు కూడా. ఆ టెక్నిక్‌ మావోయిస్టులకు లేదని పోలీసులు బలంగా విశ్వసించారు. ఆ నమ్మకంతోనే కూంబింగ్‌ కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గతంలో మావోయిస్టులు హెలికాప్టర్లపై దాడులకు పలుమార్లు విఫలయత్నం చేశారు. ఆగస్టు 30, 2007 దంతేవాడలోని చింతల్‌ నార్‌ రీజియన్‌లో మావోయిస్టులు హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు. అయితే ఎలాంటి నష్టం జరగలేదు. 14 నవంబర్‌ 2008 బీజాపూర్‌లో ఛాపర్‌పై కాల్పులు జరిపిన మావోయిస్టులు ఒక అధికారిని కాల్చిచంపారు. మరొకరు గాయపడ్డారు. 15 మే 2009 దంతేవాడలోని కిష్టారమ్‌ విలేజ్‌లో ల్యాండ్‌ అవుతున్న చాపర్‌పై కాల్పులు జరిపారు. అయితే జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. అలాగే మరో మూడు ఘటనల్లో మావోయిస్టులు కాల్పులు జరిపినప్పటికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో మావోయిస్టులు కాల్పులు జరిపారే తప్ప వాటిని కూల్చేప్రయత్నాలేమీ చేయలేదు. అయితే, ఇప్పుడు తాజాగా లభ్యమైన ఫుటేజ్‌ పోలీసుల్లో వణుకు పుట్టిస్తోంది. మావోయిస్టులు ఏకంగా ఛాపర్లను కూల్చడంలో సక్సెస్‌ అయితే ఇక వారిని ఎదుర్కోవడం కష్టమని తేల్చేస్తున్నారు.

Tags: Maoist plan for destroying the script

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *