కాసులు కురిపిస్తున్న మాస్టర్ ప్లాన్.

తిరుపతి ముచ్చట్లు:
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతికి ఈ సీన్‌ అతికినట్టు సరిపోతుంది. మున్సిపల్‌, చిత్తూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలోని కొందరు అధికారులకు మాస్టర్‌ప్లాన్‌ కాసులు కురిపిస్తోంది. ప్లాన్‌పై అభ్యంతరాలు చెప్పే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు అక్కడి మాయగాళ్లు. మీరు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తాం.. అయితే మాకేంటి..? అని సిగ్గులేకుండా అడిగేస్తున్నట్టు చెబుతున్నారు బాధితులు.రాబోయే రెండు దశాబ్దాల్లో చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌ 2041 రూపొందించారు. ఆ ప్లాన్‌ ముసాయిదాను గత ఏడాది అక్టోబర్ 11న ప్రచురించారు. గృహ అవసరాలు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల ఏర్పాటు, బఫర్‌ జోన్‌, మిక్స్డ్‌ జోన్‌ ఎక్కడ ఉండాలో ప్లాన్‌లో పొందుపర్చారు. నగరంలోని 50 డివిజన్లలో జోన్ల వారీగా ఉన్న ప్రాంతాలను ప్రస్తావించి.. ప్రజల అభ్యంతరాలను కోరారు అధికారులు.ముసాయిదాపై కార్పొరేషన్‌కు 117, చుడాకు 145 అభ్యంతరాలు వచ్చాయి. నివాసిత ప్రాంతంలో రోడ్డు ప్రతిపాదించారని కొందరు.. పంట పొలాల్లో రింగు రోడ్డు చూపించారని మరికొందరు రాతపూర్వకంగా అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన కొందరు అధికారులు వసూళ్ల పర్వం చేపట్టారని ఆరోపణ. మీ స్థలంలో రోడ్డు రాకుండా ఉండాలంటే.. ఎంత సమర్పించుకోవాలో మొహమాటం లేకుండా అడిగేస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా భారీ మొత్తంలోనే వెనకేసుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు జనం.అవినీతి అధికారుల బేరసారాలను కొందరు బాధితులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులైన అధికారులను ఆయన హెచ్చరించినట్టు సమాచారం. కానీ.. ఎమ్మెల్యే వార్నింగ్స్‌ చెల్లుబాటు కావడం లేదని తెలుస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి నుంచి ఓ రేంజ్‌లో పిండేస్తున్నట్టు టాక్‌. ఇప్పుడీ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లినట్టు చెబుతున్నారు. మరి.. వారైనా పరిస్థితిని చక్కదిద్దుతారో లేక.. వసూలు చేసిన దాంట్లో వాటా అడుగుతారో చూడాలి.
Tags:Master plan for pouring cassava

Natyam ad