ఒక్కసారిగా పెరిగిన మాంసం ధరలు

హైదరాబాద్ ముచ్చట్లు:
 
రాష్ట్రంలో మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రధానంగా గొర్రె మటన్ కంటే పొట్టేలు మటన్కు ధర మరింత పెరిగింది. గొర్రెలు, మేక మాంసం రికార్డు స్థాయిలో ఈ వారం రోజుల వ్యవధిలోనే కిలో రూ.800 నుంచి రూ.950కి అమ్ముడుపోయింది. మూడేళ్ల క్రితం కిలో ధర రూ.400-500 ఉండగా.. ఇప్పుడు అంతకన్నా వందశాతం అదనంగా పెరిగింది. మరోవైపు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 2 కోట్లను దాటిందని, దీనిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పశుసంవర్ధక శాఖ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ‘డిమాండు – సరఫరా’ సూత్రం ప్రకారం వస్తువుల ఉత్పత్తి పెరిగితే ధర పడిపోవాలి. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగినా.. ధర తగ్గాల్సింది పోయి, ఏకంగా రెట్టింపయింది. కారణాలేమైనా రాష్ట్రంలో మాంసం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా మాంసం ధరలను మరింత పెంచినట్లు వ్యాపారులు చెప్పుతున్నారు. గతంలో కేవలం పండుగలు, ఆదివారం రోజుల్లో మాత్రమే మటన్ విక్రయాలు ఎక్కువగా చేసేవారు. కానీ కొంతకాలంగా ప్రతిరోజూ మాంసం విక్రయాలు గరిష్టంగానే సాగుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే హైదరాబాద్‌లో 10వేల గొర్రెలు, మేకలకు పైగా కోసి మాంసం విక్రయించారని టోకు వ్యాపారులు చెప్పారు.
 
 
ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లారీలు, వ్యాన్లలో మేకలు, గొర్రెలను పెద్దసంఖ్యలో తెచ్చి విక్రయించారు. వాటి రవాణాకు కిరాయిలు పెరగడంతో పాటుగా గత ఏడాది నుంచి దాణా, పశుగ్రాసం ధరలు 30 శాతం పెరిగాయని వ్యాపారులు చెప్పుతున్నారు. దీంతో అధిక ధరలకు జీవాలను విక్రయించారని, అందుకే మాంసం ధరనూ పెంచినట్లు మాంసం వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. గొర్రెలు, మేకల ధరలను వాటి పెంపకందారులు పెంచుతున్నారని, తమకే టోకుగా కిలోకు రూ. 800 వరకు పడుతుందని, దీంతో చిల్లర వ్యాపారులకు అమ్మేసరికి ధరలు పెరుగుతున్నాయని చెప్పుతున్నారు.విదేశాలకు విక్రయించే ధరల కంటే రాష్ట్రంలోనే మాంసం ధరలు రెట్టింపుగా ఉన్నట్లు పలు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో మాంసం ధరలు మండిపోతున్నాయని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం అధ్యయనంలోతేల్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలలు గత జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ భారత్‌ నుంచి 4,903 టన్నుల గొర్రె, మేక మాంసాన్ని ఎగుమతి చేశారని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో మాంసం ధర రూ.514కి పలికిందని జాతీయ వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి (అపెడా) తాజా నివేదికలో ప్రకటించింది. ధర ఇంతకు మించితే విదేశీ మార్కెట్లలో భారత మాంసాన్ని కొనడం లేదని వెల్లడించారు. కానీ, హైదరాబాద్‌ మార్కెట్‌లో గొర్రె మాంసం ఏకంగా రూ. 750 నుంచి రూ. 800 ఉండగా.. పొట్టేలు మాంసం మాత్రం రూ. 850 నుంచి రూ. 950కి అమ్ముతున్నారని అదే నివేదికలో పేర్కొన్నారు. దాణా ఖర్చులు బాగా పెరగడంతో పాటు రాష్ట్రంలో జీవాల కొరత ఉన్నందున మాంసం ధరలు పెరుగుతున్నాయని రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
 
 
 
ఉచిత గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రంలో వాటి సంఖ్య పెరగడమే కాకుండా మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఏడాది సగటున రాష్ట్రంలో 26,839 మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. మాంసం ఉత్పత్తిలో 20 శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 2017 జూన్‌కు ముందు రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి రోజుకు దాదాపు 500 నుంచి 600 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 50లోపుకే పడిపోయింది. కానీ అదే సమయంలో పొట్టేళ్ల దిగుమతి పెరిగింది. పొట్టేళ్లు తక్కువగా ఉండటంతో ప్రతి వారం దాదాపు 100 నుంచి 200 లారీల పొట్టేలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో పొట్టేలు మాంసానికి రాష్ట్రంలో ధరలు పెరిగాయి.మాంసహారం తీసుకునేవారిలో సగటున ప్రతి వ్యకి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 87 శాతం మంది మాంసాహారులే ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వినియోగించాల్సి ఉంది. తెలంగాణ 7.5 కిలోలతో మొదటిస్థానంలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ 7.2 కిలోలు, తమిళనాడు 6.5 కిలోలు, కర్ణాటక 6 కిలోలు, కేరళ 5.5 కిలోలు చొప్పున వినియోగిస్తున్నాయి. మాంసం అధికంగా వినియోగించే రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం. కానీ వీటిలో మాంసం ధరల్లో మాత్రమే తెలంగాణ రాష్ట్రమే ముందు వరుసలోనూ నిలిచింది.
దాడులను అరికట్టాలి
Tags: Meat prices soared

Natyam ad