మెడికల్ మాఫియా  విజృంభణ

Date: 17/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నకిలీ మందుల మాఫియా విజృంభిస్తుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ మాఫియా కోరలు పీకాలంటూ సర్వత్రా డిమాండ్‌ వ్యక్తమవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం దుర్మార్గం. నొప్పుల నివారణకు వాడాల్సిన లైసెన్సు పొందిన ఆల్ట్రాసెట్‌ స్థానంలో అచ్చం అలాంటి ప్యాకులలోనే నకిలీ మందు బిళ్లలు విక్రయిస్తున్న వైనం, వాటిని తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అవ్వడం గతేడాది ఆఖరులో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇటు రాష్ట్రంలోనూ, అటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాకటల్లోనూ రెండేళ్లుగా ఈ నకిలీ ముఠాలు కలకలం రేపుతున్నా పాలకులు కళ్లు తెరవడం లేదు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ తయారు చేసే లైసెన్స్‌డ్‌ మందులకు బదులు అల్ట్రాసెట్‌ పాంటాసిడ్‌-40 ఎంజి, పాంటాసిడ్‌ డిఎస్‌ఆర్‌, కైమోరాల్‌ఫోర్ట్‌, స్కిన్‌లైట్‌క్రీమ్‌, మేలకేర్‌ అయింట్‌మెంట్‌ వంటి నకిలీ మందులు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయని ఔషద నియంత్రణాధికారుల సోదాల్లో తేలింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తన మందుల అమ్మకాలు అనూహ్యంగా పడిపోవడంతో అనుమానంతో ఫిర్యాదు చేసే వరకు నకిలీ ముఠా సంగతి అధికారయంత్రాంగానికి తెలియలేదంటే రాష్ట్రంలో ఔషద నియంత్రణ వ్యవస్థ ఎంతటి నిద్రాణ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
లైసెన్సుడ్‌ మందుల విక్రయాల ద్వారా లాభాలు పరిమితంగా ఉంటాయనీ, నకిలీ మందుల విక్రయాలతో కనీసం 60 శాతానికి పైగా లాభాలు దండుకోవచ్చంటూ నకిలీ మందుల ముఠా ఈ దారుణానికి పాల్పడుతోంది. నకిలీ మందుల రాక్షసి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశమంతా, ప్రపంచ వ్యాపితంగా కూడా విస్తరించి ఉంది. వర్ధమాన దేశాల్లో 25 శాతం మందులు నకిలీవే అమ్ముతున్నారని ప్రపంచ ఆరోద్య సంస్థ పరిశీలనలో తేలింది. నకిలీల తయారీ దారులు ఖరీదైన మందులపై కేంద్రీకరిస్తున్నారు. క్యాన్సర్‌ నివారణ మందులు, హార్మోన్లు, స్టిరాయిడ్లు, యాంటీహిస్టామిన్‌ ఔషదాలు, మానసిక వ్యాధికి సంబంధించిన మందులకు మార్కెట్‌లో పెద్ద ఎత్తున నకిలీలు దిగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దాదాపు 8 రకాల లైసెన్సుడ్‌ కంపెనీలను పోలిన నకిలీ మందులు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి రాని ప్రమాదకర మందులు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉండవచ్చని వైద్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది, డ్రగ్స్‌ ఇన్స్‌పెక్టర్ల పర్యవేక్షణ కూడా ఉండే మందుల ఏజెన్సీలు, దుకాణాల్లోనే నకిలీ మాఫియా తిష్టవేసే దుస్థితి ఉందంటే ఇక పర్యవేక్షణ లేని ఆస్పత్రుల ఫార్మసీలలో అవకతవకలు ఇంకెంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉంటాయో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మందుల దుకాణాలపైనా, వాటిని సరఫరా చేసే డీలర్లపైనా పర్యవేక్షణ, తనిఖీల వ్యవస్థను మరింత పటిష్టం చేసి నాణ్యమైన మందులు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలకు ఆరోగ్యం పొందే హక్కులో నాణ్యమైన ఔషదాలు పొందే హక్కు కూడా అంతర్భాగం. అందువల్ల పౌరులకు నాణ్యమైన మందులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.కానీ రాష్ట్రంలో సమగ్ర ఔషద నియంత్రణ వ్యవస్థ (సిడిఎంఎస్‌)ను తీసుకొచ్చామని, నకిలీ మందుల గుర్తింపునకు కొత్త సాఫ్ట్‌వేర్‌ తీసుకొచ్చామని ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందే తప్ప నిర్మాణాత్మకంగా నకిలీ మందుల ముఠా నియంత్రణకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి 200 దుకాణాలకు ఒక డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుతం 600 దుకాణాలకు ఒక అధికారి ఉన్నారు. దీనివల్ల పూర్తిస్థాయి తనిఖీలకు వీల్లేకుండా పోతోందని అధికారులే వాపోతున్నారు. నకిలీ ముఠాలు రెచ్చిపోతున్న నేపథ్యంలో నకిలీ మందుల పట్ల అవగాహన కల్పిస్తూ ఆ దిశగా ప్రజలను చైతన్యపర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటీవ్స్‌ యూనియన్‌, ప్రజారోగ్య వేదిక వంటి సంస్థలు స్వచ్ఛందంగా ప్రచారకార్యక్రమాలు చేపట్టడం ఎంతైనా ముదావహం. ప్రజలందరికీ అందుబాటులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జన ఔషది మందుల దుకాణాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మందు బిళ్లలు, టీకాలు తయారీ వంటి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించాలి. ఇందుకోసం బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించాలి. కానీ పాలకులు ఆ పని చేయడం లేదు. ప్రయివేటు, బహుళజాతి కంపెనీల ఆధిపత్యానికి కళ్లెం వేయడం, తనిఖీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, అనైతిక వ్యాపార, మార్కెటింగ్‌ విధానాలను కట్టడి చేయాలనే సూచనలు కూడా ఆచరణ సాధ్యాలే. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ, కల్తీ, నాసిరకం మందుల మాఫియాను అరికట్టేందుకు నడుం బిగించాలి.
Tags: Medical mafia boom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *