సిండికేట్ గా మారుతున్న మిల్లర్లు

Date:14/04/2018
నల్గొండ ముచ్చట్లు:
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు దోచుకుంటున్నారు. మట్టిబిడ్డలను మాయచేసి తక్కువ ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రబీ సీజన్ ఆరంభంలో అధికంగా ధరలు ఉన్నట్లు ఆశ చూపించి ధాన్యంను ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తున్న సమయంలో మిల్లర్లు సిండికేట్లుగా మారి ధరలను భారీగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. రైతులు రబీలో సన్నరకాల హెచ్‌ఎంటీ, పూజ రకం వరివంగడాలను సేద్యం చేస్తే ధర అధికంగా వస్తుందని ఆశతో పంటను సేద్యం చేసి పండించారు. అయితే సీజన్ ఆరంభంలో సన్నరకాలకు క్వింటాలుకు 1900 నుండి 2000 వరకు కొనుగోలు చేశారు. ఆ తరువాత క్వింటాలుకు 1650 నుండి 1750కి కొనుగోలు చేయడంతో ఆగ్రహించిన రైతులు గత నెలలో రెండు పర్యాయాలు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ధర్నాలు చేశారు. అయితే, ఆర్డీఓ గోపాల్‌రావు, డీఎస్పీ శ్రీనివాస్‌రావు రైతులతో మాట్లాడి గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మిల్లర్లతో చర్చించి క్వింటాలుకు రూ. 1800 రూపాయలకు కొనుగోలు చేయాలని సూచించారు. అయితే, గత మూడు రోజులుగా సన్నరకం ధాన్యాలను మిల్లర్లు మరోసారి సిండికేట్‌గా మారి భారీగా తగ్గించి క్వింటాలుకు 1550నుండి 1700 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే ధాన్యాన్ని మిల్లుకు తీసుకువచ్చే రైతుల పట్ల మిల్లర్లు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ వారికి ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు ఎంతో ఆశతో ఆరుగాలం కష్టపడి వేలాదిరూపాయల పెట్టుబడి పెట్టి పంటను సేద్యం చేయగా తీరా చేతికి అందే దశలో ఉసతిరుగుడు రోగం ఆశించడంతో పలుమార్లు మందులను పిచికారి చేసి రక్షించుకున్నారు. రక్షించుకున్న పంటలను నూర్పిడి చేసి విక్రయించేందుకు రైస్‌మిల్లులకు తీసుకుపోతే మిల్లర్లు మాత్రం తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో పెట్టిన పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే రైతులను మిల్లర్లు దోచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Tags: Millers changing to Syndicate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *