MLA balakrishna Chandrababu Naidu cm seat Lepakshi celebrations

సీటు మార్చిన బాలయ్య

సాక్షి

Date :24/01/2018

సాక్షి, విజయవాడ: ‘సాక్షి’ ఎఫెక్ట్‌తో హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ‘కుర్చీ’  మార్చారు. లేపాక్షి ఉత్సవాలపై ఆయన బుధవారం ఉదయం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం చంద్రబాబు కుర్చీలో కూర్చొని సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సాక్షిలో కథనాలు రావడంతో బాలయ్య మధ్యాహ్నం సీటు మారారు. ఉదయం సీఎం సీటులో…మధ్యాహ్నం పక్కసీటులో కూర్చున్నారు. మరోవైపు బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా అని మండిపడుతున్నారు. బామ్మర్ది అయితే సీఎం సీటులో కూర్చోవచ్చా?. ఎమ్మెల్యేకు ప్రొటోకాల్‌ విషయాలు తెలియదా? సీఎం కార్యాలయం బాలయ్య సొంత ఆస్తా…అంటూ విమర్శలు వస్తున్నాయి.

కాగా లేపాక్షి ఉత్సవాలపై బాలకృష్ణ మాట్లాడుతూ…‘2015 స్థాయిలో మరోసారి లేపాక్షి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఇంకా తేదీలు ఖరారు కాలేదు. ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో టూరిజం, సాంస్కృతిక శాఖలు పాల్గొన్నాయి. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తాం. నేను కళాకారుడిని. అందుకే లేపాక్షి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. ఈ ఉత్సవాలను మార్చి నెల లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. అదే నెలలో హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లాకు నీళ్లు తీసుకు వెళతాం.

అది నాన్నగారి కల. మా నియోజకవర్గంలో ఇప్పటివరకూ నాలుగు విద్యాసంస్థలు ఉన్నాయి. వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. మా నియోజకవర్గంలో అందరికీ ఫించన్లు ఇవ్వగా ..2వేల పింఛన్లు మిగిలిపోయాయి. ఇక అలనాటి సినీనటి కృష్ణకుమారి మృతి దురదృష్టకరం. నాన్నగారు సహా అనేకమంది గొప్పనటులతో ఆమె నటించారు. నేను బెంగళూరు వెళ్లినప్పుడల్లా ఆమెను కలిసేవాడిని. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని  అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *