డీజీపీని కలిసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు..?

పోలీసులు వివక్ష చూపడం దురదృష్టకరం..

హైదరాబాద్: దుబ్బాక నియోజకవర్గంలో పోలీసుల తీరుపై నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఒక శాసనసభ్యునిగా తనకు దక్కాల్సిన గౌరవ మర్యాదల విషయంలో పోలీసు అధికారుల తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య పోలీసులు వివక్ష చూపడం దురదృష్టకరమన్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా గురువారం నియోజకవర్గ పరిధిలోని గుడికందుల గ్రామంలో కూరగాయల మార్కెట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన తనకు భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీజీపీ దృష్టికి తెచ్చారు. సంఘ విద్రోహశక్తులు తనపై కుట్ర పన్ని దాడికి యత్నించగా… పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా వారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డీజీపీని కోరారు. ఈ విషయంలో డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఒకవేళ వారిపై చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రఘునందన్ స్పష్టం చేశారు.

Natyam ad