Natyam ad

మోదీకి కేసీఆర్ లేఖ..?

ఉక్రెయిన్ విద్యార్థులు ఇక్కడే చదివేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా దేశానికి తిరిగొచ్చిన వైద్యవిద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని ఇక్కడే కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మానవీయ కోణంలో ఆలోచించి ప్రత్యేక కేసుగా పరిగణించి విద్యార్థులు వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. “యుద్ధం కారణంగా దాదాపు 20వేలకు పైగా భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి వచ్చారు. వీరందరూ దేశ వ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలల్లో చదువుకునేలా నిబంధనలు సడలించి అవకాశం ఇవ్వాలి. విద్యార్థుల్లో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో తల్లిదండ్రులు వారి పిల్లలను వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ పంపించారు. వారి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులు భారత్లోనే వైద్యవిద్యను కొనసాగించేందుకు వీలుగా సరిపడా సీట్లను ఆయా వైద్యకళాశాలల్లో ఈ ఒకసారికి పెంచాలి. ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 700 మందికి పైగా ఉన్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసేందుకు వారికయ్యే ఖర్చును భరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో ఆలోచించి వీలైనంత త్వరగా విద్యార్థుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి” అని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు.