ఫడ్నవిస్ పైనే ఎక్కువ కేసులు

Date:13/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
దేశంలో వందకోట్లకు పైగా సంపద కలిగిన ముఖ్యమంత్రులు ఇద్దరుంటే, పది నుంచి 50 కోట్ల మధ్య సంపద కలిగిన వారు ఆరుగురు, కోటి నుంచి 10 కోట్ల మధ్య ఆస్తులున్నవారు 17 మంది, కోటి రూపాయల లోపు కూడబెట్టుకున్న సీఎంలు ఆరుగురు ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ సంస్థ తన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఇక దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రికార్డు సృష్టించారు. చంద్రబాబు స్థిర, చరాస్తుల విలువ రూ.177 కోట్లని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ నివేదిక తెలియజేసింది. బాబుకు రూ.134,80,11,728 విలువైన చరాస్తులు, రూ.42,68,83,883 విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.ఆయన తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ నిలిచారు. అరుణాచల్ సీఎం ఆస్తుల విలువ రూ.129 కోట్లకు పైనే ఉందని తెలిపింది. రూ.48 కోట్ల సంపదతో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ మూడో స్థానంలోనూ, తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.15 కోట్ల విలువైన ఆస్తులతో నాలుగో స్థానంలో నిలిచారు. ఇందులో చరాస్తులు రూ.6,50,82,464, స్థిరాస్తి రూ. 8.65 కోట్లుగా ఏడీఆర్ నివేదిక పేర్కొంది.ఏడీఆర్ నివేదికలో అత్యంత పేద ముఖ్యమంత్రిగా త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ నిలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఉన్నారు. సీపీఎంకు చెందిన మాణిక్ సర్కార్ గత 20 ఏళ్ల నుంచి త్రిపుర సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.26,83,195 మాత్రమే. మమతా బెనర్జీ సంపద రూ.30 లక్షలు కాగా, మెహబూబా ముఫ్తీ సంపద రూ.55 లక్షలు నివేదిక తేటతెల్లం చేసింది. దీదీ మమతా వద్ద కనీసం రూపాయి విలువ చేసే స్థిరాస్తి కూడా లేకపోవడం విశేషం.దేశంలోని 11 రాష్ట్రాల సీఎంలపై వివిధ రకాల కేసులు ఉన్నాయి. ఈ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌‌వీస్‌పై అత్యధికంగా 22 కేసులు ఉన్నాయి. వీటిలో మూడు కేసులు అత్యంత తీవ్రమైనవి. ఈయన తర్వాతి స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్‌పై 11 క్రిమినల్ కేసులు నమోదు కాగా వీటిలో ఒకటి అత్యంత తీవ్రమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ జాబితాలో మూడోస్థానంలో ఉన్నారు. ఆయనపై 10 కేసులు ఉండగా, అందులో నాలుగు అత్యంత తీవ్రమైనవి కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల సీఎంల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడుపై 3, కేసీఆర్‌పై 2 కేసులు నమోదైంది. కేసీఆర్‌పై ఒకటి క్రిమినల్ కేసు. దేశంలోని మొత్తం 31 మంది సీఎంలలో 20 మందిపై ఎలాంటి కేసులు లేవు. 11 మందిపై క్రిమినల్ కేసులల్లో 8 అత్యంత తీవ్రమైనవి.దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు సీఎంలుగా ఉంటే, మిగతా 28 రాష్ట్రాల్లో పురుషులే ఉన్నారు. ఇక విద్యార్హతలు విషయంలో ముగ్గురు సీఎంలు ఇంటర్, 12 మంది సాధారణ డిగ్రీ, 10 మంది వృతివిద్యలో డిగ్రీ, 5 గురు పీజీ, ఒక్కరు పీహెచ్‌డీ చేసివారు ఉన్నారు. 35 ఏళ్ల అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖాండూ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడుగానూ, 74 ఏళ్ల పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అత్యంత పెద్ద వయస్కుడిగానూ రికార్డులకెక్కారు.
Tags: Most cases on Fadnavis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *