Mute torture

మూగ రోదన 

 Date:15/09/2018
కర్నూలు ముచ్చట్లు:
మంత్రాలయంలోని గోపురం గోశాలలోని మూగజీవాలు ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం తినేందుకు గ్రాసం, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. గోశాలలో వివిధ జాతులైన 2 వేల గోవులున్నాయి. ఈ గోశాలను 30 ఎకరాల్లో విస్తరింపజేశారు. మఠాధిపతులు తుంగభద్ర నదీ తీరంలో 80 ఎకరాలు, గోశాల సమీపంలో వంద ఎకరాలు గడ్డి పెంపకానికి ఇచ్చారు.
180 ఎకరాలు అందుబాటులో ఉన్నా పచ్చగడ్డి ఊసే కరవైంది. ఎండు గడ్డి సైతం వందల ఎకరాల్లో కొనుగోలు చేశామని నిర్వాహకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. దీనిలో సంరక్షణ నిమిత్తం 51 మంది పనిచేస్తున్నారు. ఉదయం సమయంలో సుమారు వెయ్యికి పైగా ఆవులను మాత్రం బయటకు తోలుకెళ్లి మధ్యాహ్నం 2 గంటలకల్లా తీసుకొస్తున్నారు. పాలిచ్చే ఆవులను మాత్రం ఆవరణలో ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు తిరిగేలా ఏర్పాటు చేస్తున్నారు.
కానీ ఆవరణలో పచ్చగడ్డి ఊసే లేదు. మిగిలిన గోవులకు సైతం సరైన మేత అందక ఎక్కువ శాతం బక్కచిక్కిపోయాయి. వందల సంఖ్యలో గోవులు నడవలేని పరిస్థితుల్లో, కళ్లు కనిపించక, రకరకాల రోగాల బారిన పడ్డాయి.గోవులకు ఏర్పాటు చేసిన షెడ్లు చాలావరకు నిరుపయోగంగా మారాయి. ఒకే ప్రాంగణంలో వందల సంఖ్యలో ఆవులను వదిలివేయడంతో తొక్కిసలాట జరుగుతోంది.
రాత్రిళ్లు విద్యుత్తు దీపాల్లేక లేగ దూడలపై కుక్కలు దాడిచేసిన ఘటనలెన్నో. పంకాలు ఉన్నా పనిచేయని పరిస్థితి. దోమ తెరలు లేవు. మురుగు కాల్వలు సైతం అధ్వానంగా ఉన్నాయి. మేత, నీరు అందించే తొట్టెలు దాణా లేక దర్శనమిస్తున్నాయి. మరికొన్ని నిరుపయోగంగా ఉంచేశారు. కొన్ని షెడ్లకు ఏర్పాటుచేసిన రక్షణ కంచె పూర్తిగా దెబ్బతింది. వాన జల్లులు పడితే గోశాలలో కొన్ని దారులు బురదమయంగా మారుతున్నాయి.
శ్రీశైలంలోని గోశాలలో విబూది, ఇతర విక్రయాలు చేసి ఆ నగదుతో గోశాల అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నారు. అదే తరహా మంత్రాలయం గోపురంలో గో-ఆర్క్‌(గోమూత్రం), పేడ నుంచి సబ్బుల తయారీపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారే కానీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం గోపురంలో కొన్ని ఆవులు మాత్రం ప్రతి రోజూ 250 లీటర్ల పాలు ఇస్తున్నాయి. ఈ పాలను మఠంలో కేవలం పాలాభిషేకాలకే ఉపయోగిస్తున్నారు. గోవులకు సరైన పోషణ అందించి, గోమూత్రం, పేడ నుంచి ఆదాయ వనరులు సృష్టించుకుని మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుందని భక్తులు, సందర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
Tags:Mute torture

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *