nagashourya Rashmika Mandanna chalo pre release event Chiranjeevi

అప్పుడు నా ఫంక్షన్‌ తూతూ మంత్రంగా జరిగింది– చిరంజీవి

సాక్షి

Date :26/01/2018

‘నాగశౌర్య సినిమాలు బిగ్‌ స్క్రీన్‌పై చూడలేదు. తను మా నిహారికతో చేసిన ‘ఒక మనసు’ చిత్రం టీవీలో చూశా. హ్యాండ్సమ్‌గా, మంచి పర్సనాలిటీతో ఉన్నాడు. ఇలాంటి హీరోలు ఇండస్ట్రీకి కావాలి, రావాలి. అప్పుడే కొత్త ఉత్సాహం వచ్చినట్టుగా ఉంటుంది’’ అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛలో’. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ –రిలీజ్‌ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ పరిచయం ఉందని నాగశౌర్య ఫంక్షన్‌కి చిరంజీవి వచ్చాడు అనుకుంటున్నారా? నన్ను కలవాలని నాగశౌర్య తన తల్లి ఉషగారితో మా ఇంటికొచ్చాడు. ‘మా ‘ఛలో’ ప్రీ–రిలీజ్‌ వేడుక మీ సమక్షంలో జరగాలి’ అని కోరితే ఆలోచించకుండా వస్తానన్నాను. అలా అనడానికి కారణం ఉంది. నా తొలినాళ్లలో నా సినిమా వంద రోజుల ఫంక్షన్‌కి నేను అభిమానించే ఓ పెద్ద స్టార్‌ని రమ్మని పిలిచాం.

ఆయన వస్తే ఆ ఉత్సాహం.. ప్రోత్సాహం బాగుంటుందని. ఆయన బిజీగా ఉండి రాలేకపోయారు. ఆ రోజు ఫంక్షన్‌ తూతూ మంత్రంగా జరుపుకున్నాం. అప్పుడు చాలా నిరుత్సాహపడ్డా. ఇప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నా. నాలాంటి వాళ్లు వెళితే తనకి ఇచ్చే ప్రోత్సాహం.. ఉత్సాహం వేరు. అందుకే వస్తానన్నా. రెండు మూడేళ్లుగా టాలీవుడ్‌లో పెద్ద స్టార్ల సినిమాలు ఎంత హిట్‌ అయ్యాయో.. యంగ్‌స్టార్స్‌ సినిమాలూ అంతే హిట్‌ అయ్యాయి. ‘ఉయ్యాల జంపాల, పెళ్ళిచూపులు, ఊహలు గుసగుసలాడే, శతమానం భవతి, ఫిదా, అర్జున్‌రెడ్డి, హలో’ వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి.

‘ఛలో’ మంచి విజయం సాధించి, శౌర్య కెరీర్‌లో బెస్ట్‌ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నా. ట్రైలర్‌ చూడగానే సినిమా ఎంత త్వరగా చూడాలా అనిపించింది. వెంకీ నాకు ఓ డైరెక్టర్‌లా అనిపించలేదు. మీలో ఒక్కడిగా అనిపించాడు. నా అభిమాని డైరెక్టర్‌ అయ్యాడంటే సంతోషంగా ఉంది. రేపు మీలో ఎవరైనా ఈ స్థాయికొస్తే ఆశీర్వదించేవాళ్లలో తొలి వ్యక్తి నేనే. మణిశర్మ అబ్బాయి సాగర్‌ పాటలు చాలా బాగున్నాయి. ఇలాంటి సినిమాల విజయం ఈ పరిశ్రమకు అవసరం. మీరందరూ ఈ సినిమాని ఆశీర్వదించాలి’’ అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘చిరంజీవి సార్‌.. పదేళ్లు ఎక్కడికి వెళ్లిపోయారు? ఇలాంటి ఆడియో ఫంక్షన్స్‌.. ఇంతమంది జనాలు.. ఇండస్ట్రీలో మీరు లేకపోవడంతో ఆడియో రిలీజ్‌లు హోటల్స్‌లో చేసుకోవాల్సి వస్తోంది సార్‌. అది ఆడియో రిలీజా? రిసెప్షనా? అని అర్థం కాకుండా జరుపుకుంటున్నాం. మళ్లీ మెగాస్టార్‌ వచ్చారు. ఆడియో రిలీజ్‌ అంటే ఏంటో చూపించారు. చిరంజీవిగారు నటిస్తున్న రోజుల్లో 1,2,3,4.. అంటూ నాలుగు కుర్చీలుండేవి. ఆయన వెళ్లిపోయాక కుర్చీలు లేవు. అందరూ నిల్చోవడమే. మళ్లీ ఆయన వచ్చారు.. కుర్చీ తెచ్చుకున్నారు.. కూర్చున్నారు.

ఇంకెవరూ రారు.. రాలేరు.. కూర్చోలేరు.. ఆ కుర్చీ ఆయనది కాదు. ఆయనకోసమే కుర్చీ పుట్టింది. మరో జన్మంటూ ఉంటే మళ్లీ మా అమ్మనాన్నలకు కొడుకుగా.. మెగాస్టార్‌ అభిమానిగానే పుడతా’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘చిరంజీవి సార్‌.. మీ ఫ్యాన్స్, ఫాలోయర్స్‌ లిస్టులో నేనూ ఒకడిని. ‘ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్‌’ సినిమాలకు బట్టలు చింపుకుని మరీ కటౌట్లు కట్టాను. మిమ్మల్ని లైఫ్‌లో ఒక్కసారి కలవాలనుకున్నా. కానీ మా సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుకలో కలుస్తానని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు. కెమెరామెన్‌ సాయి శ్రీరామ్, నిర్మాత సి.కల్యాణ్, దర్శకులు వంశీ పైడిపల్లి, నందినీరెడ్డి, ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పాటల రచయిత భాస్కరభట్ల, ‘ఆదిత్య’ మ్యూజిక్‌ నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *