గిరిపుత్రుల నాగోబా జాతర

-ఆదివాసుల ఆరాధ్యదైవం ఆదిశేషువు
 
అదిలాబాద్ ముచ్చట్లు:

 
అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా జాతరకు సిద్దమయింది. కుగ్రామంగా వున్న కేస్లాపూర్ కు లక్షలాది మంది గిరిజనులు, గిరిజనేతరులతో జనారణ్యంగా మారుతుంది. ప్రతియేడు పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని , శాంతి విరాజిల్లుతుందని , రోగాలు మటు మాయమవుతాయని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. నాగోబా అంటే శేషనారాయణమూర్తి. పుష్యమాసం అమావాస్య రోజు నాగోబా పురివిప్పి నాట్యమాడుతాడని వారి విశ్వాసం. ఆ రోజు సాయంత్రం నుంచి ఆర్ధరాత్రి మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ , వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు నమ్ముతారు.ఈ నాగోబా జాతరకు వందలాది ఏళ్ల చరిత్ర వుంది. పూర్వం గిరిజనుల మూల పురుషులు  ఏడుగురు మాత్రమే ఉండేవారు. మూల పురుషులు నాలుగు శాఖలుగా విడిపోయి ఈనాలుగు శాఖలలోని మొదటి శాఖలో మడావి , మర్సకోలా , కుడ్మేల్ , పూరు , పెందూర్ , వెడ్మ , మోస్త్రం అనే ఏడుగురు సోదరులుండేవారు.
 
 
ఈ ఏడుగురి వల్ల కాలానుగుణంగా అభివృద్ధి చెందిన గిరిజన సంతతికి పై ఏడుగురు అన్నదమ్ముల పేర్లే ఇంటి పేర్లుగా మారాయని అంటుంటారు.ఈ ఏడు ఇళ్ల పేర్లు గల గిరిజనులకు ఆరాధ్య దైవం ఆదిశేషుడు కావడం వల్ల అనాధిగా కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన వారి కులదైవం ‘నాగోబా పూజా ఇత్యాది కార్యక్రమాల నిర్వహణ బాధ్యత మోస్త్రంకు అప్పగించారు. కాగా పెద్దవాడన్న గౌరవంతో పుష్యమాస అమావాస్య రోజు జరిగే పూజను మడావికి అప్పగించారు. తరువాత పూజా కార్యక్రమాలు నిర్వహించే మోస్త్రం వంశం రెండుగా చీలిపోయింది. వాటిలో ఒకటి నాగ్‌భిడే మోస్త్రం , రెండవది భూయ్యాడే మోస్త్రం. ఈ రెండు శాఖల వారి వృత్తుల ఆధారంగా 17 శాఖలుగా చీలిపోయినారు. అయినా పూజలు నిర్వహించేది మాత్రం అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం మోస్త్రం వంశస్థులే. ముందుగా గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా శుద్ధి చేస్తారు. బాజా భజంత్రిలతో ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రల నుంచే కాక మహారాష్ట్ర , మధ్యప్రదేశ్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలనుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.
 
Tags: Nagoba Fair of the Giriputras

Natyam ad