నిర్లక్ష్యం నీడన నిఘా!

Date:19/06/2018
కరీంనగర్‌ ముచ్చట్లు:
కరీంనగర్ లో భద్రత పెంచి.. ప్రజలందరికీ రక్షణ కల్పించే నిమిత్తం పోలీసులు సీసీ కెమేరాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చారు. పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున వేలాదిగా నిఘా కెమేరాలు బిగించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకూ భాగస్వామ్యం కల్పించారు. దీంతో కరీంనగర్ పరిధిలో ఇప్పటివరకూ 3వేల కెమేరాలు ఏర్పాటు సాగింది. వాస్తవానికి ఈ లక్ష్యం మరింత పెద్దది. కరీంనగర్‌లో 10 వేల సీసీ కెమెరాలు, కమిషనరేట్‌లో 50 వేల సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.  దీనికి నేను సైతం అనే పేరు పెట్టారు. వేలాదిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంవల్ల నేరాలు అదుపులోకి వస్తాయని భావించారు. అధికారుల ఆలోచన మంచిదే. ఇక వీరికి ప్రజల నుంచీ సహకారం లభించడం అభినందనీయం. అయితే.. ఇలా ఏర్పాటుచేసిన కెమేరాల నిర్వహణ సరిగా సాగడంలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ లోపంతో లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలో జరుగుతున్న రోడ్ల పనులతో సీసీ కెమెరాల వైర్లు తెగిపోతున్నట్లు చెప్తున్నారు. అంతేకాక స్థానికంగా కందకాల తవ్వకాలు, గాలిదుమారాలు, వర్షం లాంటి సమస్యల వల్ల కెమేరాలు మొరాయిస్తున్నాయని అంటున్నారు.సీసీ కెమేరాలు మొరాయిస్తే.. వాటిని బాగుచేయాలి. దీని కోసం.. కెమేరాలు ఏర్పాటుచేసిన సంస్థే తగిన చర్యలు తీసుకోవాలి. అయితే వెంటనే స్పందించాల్సిన కంపెనీ బాధ్యులు రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పలు వీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దిక్కులు మారిపోయాయని, మరికొన్ని ఆకాశంవైపు చూస్తున్నాయని అంటున్నారు. నేను సైతంలో భాగంగా ప్రధాన కూడళ్లు, రహదారుల్లో కెమేరాలు ఏర్పాటు చేశారు. వీటిని సంబంధిత పోలీస్‌స్టేషన్‌లలోని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు కనెక్ట్చేశారు. ఈ సీసీ కెమెరాల రికార్డింగ్‌, సీసీ కెమెరాల నిర్వహణకు స్థానికంగా కంట్రోల్‌రూం కూడా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎలాంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల్లో చూడంతో పాటు, నేరాలు జరిగితే వీటి పుటేజీ సాక్ష్యంగా ఉపయోగపడుతోంది. అయితే కొన్ని సీసీ కెమెరాల డీవీఆర్‌లో హార్డ్‌డిస్క్‌ తక్కువ జీబీ ఉండటంతో రెండు రోజుల పుటేజీ రికార్డు మాత్రమే లభిస్తోంది. సంఘటన జరిగిన వారం రోజుల తరువాత పుటేజీని పరిలిస్తే సీసీ కెమెరాల నుంచి సదరు దృశ్యాలు లభించని పరిస్థితి ఉంటోంది. ఈ సమస్యలన్నింటినీ దృష్టించి సంబంధిత అధికారయంత్రాంగం సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.
Tags; Neglected shadow surveillance!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *