గుంటూరు జిల్లాల్లో కొత్త ముఖాలే

Date:10/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
ఏపీలో అధికార టీడీపీలో కీలకమైన గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో చాలా కొత్త కొత్త ముఖాలు రాజకీయారంగ్రేటం చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. గుంటూరు జిల్లా టీడీపీ అంటేనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కాకుండా రెండు, రెండున్నర దశాబ్దాలుగా వారు వారి నియోజకవర్గాల్లో తిష్ట వేసిన తలపండిన రాజకీయ నాయకులు ఉన్నారు. గుంటూరు జిల్లా టీడీపీలో ఆరేడు నియోజకవర్గాల్లో గత నాలుగైదు ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తూ వస్తున్న సీనియర్లే అధికం. వచ్చే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు కాకుండా పలువురు కొత్త ముఖాల పేర్లు తెర మీదకు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు రాజకీయ వారసులు ఉంటే… మరి కొందరు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుంగా తొలిసారి ప్రత్య‌క్ష ఎన్నికల బరిలోకి దిగి అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.వచ్చే ఎన్నికల బరిలో టీడీపీ నుంచి తెర మీదకు వచ్చే కొత్త ముఖాల్లో సీనియర్‌ పార్లమెంటేరియ‌న్‌, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇప్పటికే ఐదు సార్లు లోక్‌సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించి… సుధీర్ఘ‌ కాలంగా గుంటూరు జిల్లా నుంచి పార్లమెంటుకు వెళ్లి రికార్డు క్రియేట్‌ చేసిన రాయపాటి వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యడం సందేహమే. ఈ క్రమంలోనే ఆయన వారసుడు పొలిటికల్‌ ఎంట్రీ దాదాపు ఖ‌రారు అయ్యినట్టే. అయితే రాయపాటి వారసుడు తన తండ్రి తప్పుకుంటున్న నరసారావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారా ? లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారా ? అన్నది తేలాల్సి ఉంది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ ఇంటిలిజన్స్‌ విభాగం చేయించిన సర్వేలో జిల్లాలో రంగారావు పేరును న‌ర‌సారావుపేట ఎంపీతో పాటు మ‌రో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సర్వే చేయించడం విశేషం.
ఇక గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న గుంటూరు జిల్లాలో కేంద్రంగా ఉన్న మరో లోక్‌సభ నియోజకవర్గం బాపట్ల. ఇక్కడ నుంచి ప్రముఖ సామాజికవేత్త, వేగేశన ఫౌండేషన్‌ అధినేత వేగేశన నరేంద్రవర్మ పేరు అసెంబ్లీకి ప్రముఖంగా వినిపిస్తోంది. బాపట్లలో గత ఎన్నికల్లో ఓడిన అన్నం సతీష్‌ ప్రభాకర్‌ ఎమ్మెల్సీగా ఉండడంతో ఇతర‌త్రా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఈ సారి బాపట్ల నుంచి నరేంద్రవర్మ పేరు ఖ‌రార‌య్యే ఛాన్సులే ఎక్కువ‌. త్వరలోనే ఆయనకు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పగ్గాలు అప్పగిస్తారని కూడా సమాచారం. గుంటూరు వెస్ట్‌ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన నగర టీడీపీ అధ్యక్షుడు చందు సాంబశివరావు పేరు చంద్రబాబు మదిలో ఉన్నట్టు తెలిసింది.
జిల్లాల్లో ఎక్కడో ఒక చోట కాపు సామాజికవర్గానికి ఒక సీటు సద్దుబాటు చెయ్యాల్సిన నేపథ్యంలో గుంటూరు వెస్ట్‌ నుంచి పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్న చందు సాంబశివరావు అయితేనే కరెక్టా అని కూడా బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి విధేయుడిగా ఉండడం… సామాజిక సమీకరణలు ఆయనకు కలిసి రానున్నాయి.అలాగే రాజధాని ఏరియాలో కీలకంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం ఈ సారి సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టే కేటాయించవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీ జిల్లాల్లో చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్‌, రేపల్లె నియోజకవర్గాలు బీసీల‌కు కేటాయించింది. ఈ క్రమంలోనే టీడీపీ బీసీలకు రెండు సీట్లు సద్దుబాటు చెయ్యాలనుకుంటే రేపల్లెతో పాటు మంగళగిరి సీటు ఇచ్చే అంశంపై కూడా పరిశీలన చేసింది. సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్‌ పేరు కృష్ణా జిల్లాలోని పెనమలూరుతో పాటు మంగళగిరి నుంచి కూడా పరిశీలిస్తున్నారు.
జిల్లాలో ఉన్న మూడు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు సీటు మార్చడం నూటికి నూరు శాతం పక్కా. ఇక్కడ నుంచి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌ పర్సన్‌ కూచిపుడి విజయ్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పేరు కూడా వినిపిస్తోంది.వేమూరులో మంత్రి నక్కా ఆనంద్‌ బాబును కంటిన్యూ చెయ్యడం గ్యారెంటీయే. ఇప్పటికే చంద్రబాబు ఆయన్ను పిలిచి వేమూరులో 2019లో పోటీకి రెడీగా ఉండమని చెప్పేశారు. నక్కా మాల సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో తాడికొండ, ప్రత్తిపాడులో ఒక సీటు మాదిగ సామాజికవర్గానికి ఇస్తే మరో సీటు మాల సామాజికవర్గానికి కేటాయించాల్సి ఉంది.
ఈ క్రమంలోనే తాడికొండలో స్థానిక కేడర్‌ నుంచి వ్యతిరేకత ఎదుర్కుంటున్న తెనాలి శ్రవణ్‌ కుమార్‌ను సైతం మారుస్తారా ? లేదా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతం గుంటూరు తూర్పు ఇన్‌చార్జ్‌గా ఉన్న మద్దాలి గిరిధర్‌ను మార్చనున్నారు. ఆ స్థానంలో మైనార్టీ వ‌ర్గానికి చెందిన వారి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. దివంగత మాజీ నేత లాల్‌జాన్‌ భాషా తనయుడు ఘ‌యాసుద్ధిన్‌ పేరు కూడా తెర మీదకు వస్తుంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా టీడీపీలో పలువురు కొత్త ముఖాలు తెర మీదకు రానున్నాయి. మరి ఫైన‌ల్‌గా వీరిలో ఎవరికి సీటు లక్కు చిక్కుతుందో ? చూడాల్సి ఉంది.
Tags:New faces in Guntur districts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *