కొత్త మీటర్లు టెన్షన్…

హైదరాబాద్ ముచ్చట్లు:
మీటర్లు కాలిపోతే కొత్తమీటరు కొనాలనుకునే వారికి అధికభారం పడనుంది. ఆరేళ్ల కింద దేశంలో ప్రీపెయిడ్ మీటర్లకు డిమాండ్, ఉత్పత్తి లేదు. దీంతో తమకు అవసరమైన ప్రత్యేకత (స్పెసిఫికేషన్)లతో మీటర్లను ఉత్పత్తి చేయించుకోవడానికి అధికారులు ఆర్డర్ ఇచ్చారు. తమ లక్ష్యాలు, అవసరాలకు అనుగుణంగా పనిచేసేలా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ప్రత్యేకంగా తయారు చేయించి కొనుగోలు చేసేందుకు 2015లో టెండర్లను నిర్వహించారు. సింగిల్ ఫేజ్ మీటర్‌ను రూ.8,687, త్రీఫేజ్ మీటర్‌ను రూ.11,279కు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఇప్పటి ధరలతో పోల్చి తే చాలా ఎక్కువకావడంతో కొత్త మీటర్లు కొనేవారిపై అధిక భారం పడనుంది.రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలి. కరెంటు ఎంతకు కొంటున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, లాభ, నష్టాలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి నివేదిక మూడేళ్లుగా ఇవ్వడం లేదు. డిస్కంల పనితీరులో సంస్కరణలు తీసుకువచ్చి నష్టాలను తగ్గించండి. అప్పుడే రాష్ట్ర విద్యుత్ సంస్థలకు జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు మంజూరవుతాయి. -కేంద్ర విద్యుత్ శాఖ విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చేందుకు ముందుకు రాని రాష్ట్రాలకు రుణాలివ్వడం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్థలను ఆదేశించిన నేపథ్యంలో ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లను కచ్చితంగా వినియోగదారులు పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుత నేపథ్యంలో ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచే వాటి విలువను ఆరేళ్ల కింద ఉన్న ధరలతో వసూలు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్పీడిసిఎల్) నిర్ణయం తీసుకుంది. మీటర్ వ్యయాన్ని వినియోగదారుల నెలవారీ విద్యుత్ బిల్లులో కలిపి వసూలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ. 8,687, త్రీఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.11,279 వ్యయాన్ని జీఎస్టీతో కలిపి వసూలు చేయాలని అన్ని సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ కావడంతో వినియోగదారులపై ఈధరల ప్రభావం కచ్చితంగా పడనుందని అధికారులు పేర్కొంటున్నారు.కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. 2017 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) నిర్వహించిన టెండర్లలో రూ.2,503 కే సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్ విక్రయించడానికి ఐటీఐ లిమిటెడ్ అనే కంపెనీ ముందుకు వచ్చింది. అంతకుముందు విడతలో నిర్వహించిన టెండర్లలో రూ.2,722కే ఈ మీటర్‌ను విక్రయించడానికి ఎల్‌అండ్‌టీ సంస్థ బిడ్ దాఖలు చేసింది. దేశంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు కాలిపోయిన మీటర్ల వ్యయాన్ని వినియోగదారుల నుంచి ఆరేళ్ల క్రితం ఉన్న నాలుగురెట్ల అధిక ధరలతో వసూలు చేయాలని టిఎస్‌ఎస్పీడిసిఎల్ యాజమాన్యం నిర్ణయించడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
 
Tags:New meters tension

Natyam ad