ఫస్ట్‌లుక్‌లతో న్యూఇయర్‌ సంబరాలు..!

ఈనాడు.

Date :01/01/2018

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని అనుకుంటారు. ఇక సినీ సెలబ్రిటీలకు సినిమాలే ప్రపంచం కాబట్టి తమ సినిమాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లను అభిమానులతో పంచుకుంటూ ఈ న్యూఇయర్‌ను మరింత ప్రత్యేకం చేస్తుంటారు. 2018కి స్వాగతం పలుకుతూ సినీ తారలు పంచుకున్న కొన్ని ఫస్ట్‌లుక్‌లను చూద్దామా..!
* ‘భాగమతి’:టాలీవుడ్‌ ‘స్వీటీ’ అనుష్క టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భాగమతి’. అశోక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన మరో ప్రత్యేక పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పోస్టర్‌లో అనుష్క ఓపక్కకు చూస్తున్నట్లు కన్పించారు.
* ‘మారి 2’:
తమిళ నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మారి 2’. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. న్యూఇయర్‌ సందర్భంగా సినిమా లోగో లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 2015లో వచ్చిన ‘మారి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఎం.బాలాజీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
* ‘గాయత్రి’:
ప్రముఖ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. ఈ సినిమాలో మోహన్‌బాబుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఇటీవల విడుదలైంది. ‘ఆ రోజుల్లో రాముడు చేసింది తప్పే అయితే నేను చేసింది కూడా తప్పే’ అనే క్యాప్షన్‌తో ఆ లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పడు సినిమాలోని మంచు విష్ణు, శ్రియలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. లుక్‌లో గర్భిణి అయిన శ్రియకు.. విష్ణు జడ వేయడం చూడముచ్చటగా ఉంది. పోస్టర్‌పై ‘ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం’ అనే క్యాప్షన్‌ ఆకట్టుకుంటోంది.
* ‘తొలిప్రేమ’:
వరుణ్‌ తేజ్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. ఈ సినిమాలో వరుణ్‌, రాశీ జంటగా ఉన్న తొలి లుక్‌ను న్యూఇయర్‌ సందర్భంగా చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లుక్‌లో వరుణ్‌, రాశి ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *