మొక్కల నాటారే సరే…సంరక్షణ ఏదీ…

Date:14/02/2018
మెదక్ ముచ్చట్లు:
హరితహారంలో భాగంగా జహీరాబాద్‌ నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ వాటి సంరక్షణకు ఏర్పాట్లు కరువయ్యాయి.  ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ కూడళ్లు, కాలనీలతోపాటు, ప్రయివేటు ఖాళీ స్థలాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో గుంతలు తవ్వించి మొక్కలు నాటిస్తున్నారు. ఈజీఎస్‌ అధికారులు, గ్రామ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులతో అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ లక్ష్యం చేరేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికీ 19.80 లక్షల మొక్కలు మాత్రమే నాటించారు. నియోజకవర్గంలోని జహీరాబాద్‌ పట్టణం, మండలంతోపాటు ఝరాసంగం, న్యాల్‌కల్‌, కోహీర్‌ మండలాల్లో కలిపి మొత్తం 23.90 లక్షల మొక్కలు నాటించాలన్నది లక్ష్యం. జహీరాబాద్‌ మండలంలో 7.15 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యముండగా 6.50 లక్షల మొక్కలు నాటారు. న్యాల్‌కల్‌లో లక్ష్యం 6.34 లక్షల మొక్కలు ఉండగా 3.50 మాత్రమే నాటారు. ఝరాసంగంలో 5 లక్షల మొక్కల లక్ష్యం ఉండగా 2 లక్షలు నాటారు. కోహీర్‌లో 5.44 లక్షల మొక్కల లక్ష్యం ఉండగా 3.60 లక్షల మొక్కలు మాత్రమే నాటారు. అయితే నాటిన ప్రతి మొక్కకు కంచె ఏర్పాటు చేయకపోవడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కావున ఇప్పటికైన హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ప్రజలు అంటున్నారు. సాగుకు యోగ్యంగా లేని భూములున్న రైతులు మొక్కలు నాటుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒక్కో రైతుకు వెయ్యి చొప్పున అయిదెకరాల్లో నాటుకునేందుకు ఉచితంగా మొక్కలు అందజేస్తున్నారు. ఝరాసంగం మండలంలో టేకు మొక్కల పెంపకానికి గిరాకీ ఉంది. అయితే నర్సరీల్లో మొక్కలు లేకపోవడంతో సంబంధిత అధికారులు లక్ష టేకు అంట్లు తెప్పించి క్షేత్ర సహాయకులకు అందజేస్తున్నారు. నియోజకవర్గంలో ఈజీఎస్‌, అటవీ శాఖ ఆధీనంతో 22 నర్సరీల్లో ఉన్న మొక్కల్ని 112 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలతోపాటు పట్టణంలోని వివిధ వార్డుల్లో నాటిస్తున్నారు.
Tags: No plant protection … no care …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *