నేర రహిత రాజకీయాలు సాధ్యమేనా(విశ్లేషణ)

Date:15/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
పార్టీ అభ్యర్థుల గుణగణాలకు స్థానం లేకుండాపోయింది. రాజకీయపార్టీలు సిద్ధాంతాలు, విలువలకు తిలోదకాలిచ్చి ధనబలం, కండబలానికి పెద్ద పీట వేయటంతోనే ఈ దుస్థితి వచ్చింది. మతం, కులం, వర్గానికి పెద్దపీట వేస్తున్న పార్టీలు గెలుపు గుర్రాలకు పెద్దపీట వేస్తున్నాయి. ఈ క్రమం లో పార్టీ అభ్యర్థుల గుణగణాలకు స్థానం లేకుండాపోయింది. జనజీవితంలో బయట చేతులు కలుపటానికే సంకోచించే, సిగ్గుపడే వ్యక్తులతో రాజకీయనేతలు భుజంభుజం రాసుకుని తిరుగుతూ నేరగాళ్లతో అంటకాగటం ప్రజాస్వామ్యానికే హానికరం. నేర నిరూపణ జరిగి ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించబడిన వ్యక్తులు పార్టీలను నడిపిస్తూ, ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తుల ఎంపిక ప్రక్రియను చేపట్టడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. నిబంధనల ప్రకారం దోషిగా తేలిన వ్యక్తి ఎన్నికల్లో పాల్గొనకూడదు. అయితే, అదే వ్యక్తి పార్టీ పదవిలో ఉంటూ తన ప్రతినిధులను పోటీకి దించుతాడు. అంటే వ్యక్తిగా తాను చేయకూడని పనిని సమిష్టిగాతన ప్రతినిధులతో చేయించగలడు. ఇది పవిత్రమైన ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అంశంఅని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం అనర్హతగా ప్రకటించిన కాలం వరకు అయినా రాజకీయాలకు, పార్టీలకు దూరంగా ఉండాలని సూచించింది. నేరమయ రాజకీయాల పట్ల సుప్రీంకోర్టు స్పందన ఇదే మొదటిసారి కాదు. దశాబ్దకాలంగా నేరమయ రాజకీయాల ప్రక్షాళనా బాధ్యతను న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ భుజాన వేసుకున్నాయి. సందర్భానుసారంగా నేరస్థ రాజకీయాల పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, రాజకీయ ప్రక్షాళనకు నడుంకట్టాయి. చట్టసభల్లో ప్రవేశించిన వారిపై నమోదైన కేసుల విచారణలో జాప్యాన్ని అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించి చాలా కాలమేమీ కాలేదు. ఇప్పుడు తాజా వ్యాఖ్య ద్వారా నేరమయ రాజకీయాల ప్రక్షాళన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.స్వరాజ్యాన్ని సురాజ్యంగా మలుచుకునే క్రమంలో ఎంతమేరకు పురోగతి సాధించామో కానీ, నేరమయ రాజకీయాల్లో మాత్రం చాలానే పురోగతి ఉన్నది. ఆర్థిక పురోగతి, పారిశ్రామికీకరణ, అక్షరాస్యత, పేదరిక నిర్మూలన, ప్రజారోగ్యం, జీవన ప్రమాణాల పెరుగుదలలో మనం ఆశించిన దానికి ఆమడ దూరంలో ఉన్నాం. కానీ రాజకీయాల్లో మాత్రం నానాటికీ నేరస్తుల సంఖ్య పెరుగుతున్నది. సమాజాన్ని నేరా ల నుంచి విముక్తి కలిగించాల్సిన రాజకీయ వ్యవస్థ తానే నేరమయం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలోంచే భారతీయ ఎన్నికల వ్యవస్థను, రాజకీయపార్టీల అభ్యర్థుల తీరుతెన్నులు, గుణగణాలపై అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రైట్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) అధ్యయ నం చేశాయి. పదేండ్ల కాలాన్ని ప్రామాణికంగా చేసుకుని పరిశోధన చేసిన ఈ స్వచ్ఛంద, పౌరసంస్థలు చట్టసభల్లో తిష్టవేసిన ప్రజాప్రతినిధుల నేర చరిత్రను విప్పిచెప్పాయి. మన రాజకీయ పార్టీల డొల్లతనాన్ని బయటపెట్టాయి. 2004లో దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన 62,8 47మందిలో 11,063 మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించుకున్నారు. ఇదేకాలంలో గెలిచిన వారిలో కూడా 8,790మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 5,253 మందిపై తీవ్రమైన కిడ్నాప్, హత్య, దోపిడీ లాంటి నేరారోపణలున్నాయి. తీవ్రమైన నేరాలం టే ఐదేండ్లకంటే ఎక్కువ శిక్షపడటానికి అవకాశం ఉన్న కేసులు అని అర్థం. ఇక 543మంది లోక్‌సభ సభ్యుల్లో 162మందిపై క్రిమినల్ కేసులుండగా అందులో 7 6మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. 40 మంది రాజ్యసభ సభ్యులపై నేరాభియోగాలుండగా, 16మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. దేశవ్యాప్తంగా 4032మంది ఎమ్మెల్యేల్లో 1258మందిపై నేరారోపణలుండగా, 15 శాతం మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఈ ఎంపీ, ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ వారు ఎనిమిది శాతం ఉంటే, బీజేపీ వారు 13శాతం ఉన్నారు బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు రాజ్యాంగ సంస్థల బలోపేతమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు పటిష్ఠ సంస్కరణలు చేపడుతున్నాయి. ఈ ప్రేరణతోనే దశాబ్దకాలంగా ఎన్నికల కమిషన్, అత్యున్నత న్యాయస్థానం రాజకీయాల ప్రక్షాళనకు పూనుకోవటం ఆహ్వానించదగినది. అవినీతి అక్రమాలకు తావులేకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితేనే నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడవుతుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దీనికోసం రాజ్యాంగ వ్యవస్థలు చేస్తున్న కృషి అభినందనీయం.
Tags: Non-criminal politics is possible (analysis)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *