రుణభాగ్యం లేని గిరిజనులు (ఆదిలాబాద్)

Date:18/06/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
పేదరికంలో మగ్గుతూ బతుకుదెరువు భారంగా మారిన ఆదివాసీ గిరిజనులకు ఆర్థికంగా చేయూతనిచ్చి ఉపాధి కల్పించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. గిరిపుత్రులకు ఆర్థిక సహాయ పథకాలను అందజేయడం కోసం ఏటా ఉట్నూరు ఐటీడీఏ ఘనమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. కానీ అమల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.28.77కోట్ల నిధులతో సిద్ధం చేసిన ప్రణాళికలను రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ ఆమోదంతోనే సరిపెట్టింది. ఏడాదైనా ఇప్పటివరకు రాయితీ నిధులు విడుదల చేయలేదు. దీంతో గిరి బిడ్డలకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారులకు మంజూరు చేసిన పథకాల్లో ఇప్పటికీ ఒక్కరికీ సాయం అందించలేకపోయారు.
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూరు పరిధిలోని ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న 2,781 మంది గిరిజనులకు వ్యవసాయ పనిముట్లు, ఎడ్లజతలు, గొర్రెలు, మేకల యూనిట్లు అందజేయడం, స్వయం ఉపాధి కోసం రుణసాయం మంజూరు చేయడం కోసం 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.28.77కోట్లతో అధికారులు ప్రణాళికలను రూపొందించారు. రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ ఈ ప్రణాళికను ఆమోదించింది. కానీ రాయితీ నిధులను మాత్రం విడుదల చేయలేదు. ఫలితంగా గిరిపుత్రులకు సహాయం అందడం లేదు.
వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న పెందూర్‌ గిర్జబాయి సొంతూరు గట్టేపల్లి, మండలం ఇంద్రవెల్లి. ఈమె మేకల పెంపకం యూనిట్‌ మంజూరు చేయాలని అధికారులను వేడుకోవడంతో సదరు మహిళకు రూ.1.25 లక్షలు రుణం మంజూరు చేశారు. కానీ రాయితీ నిధులు విడుదల కాకపోవడంతో ఆమెకు రుణసాయం అందలేదు. ఇవీ ఉదాహరణలు మాత్రమే. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వేలాది మంది గిరిజన లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
గిరిజన లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకాలు విషయంలో రాయితీ నిధులు విడుదలలో ఆలస్యం, ప్రణాళికల అమోదంలో, రుణాలు అందజేయడంలో బ్యాంకులలో తీవ్రజాప్యం చేస్తున్నాయని గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో జరిగిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో జిల్లా మంత్రుల సమక్షంలో సభ్యులు తీర్మానించారు. అయినా అధికారుల తీరులో మార్పు రాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇప్పటికీ రుణాల మంజూరు కోసం అవసరమైన రాయితీ నిధులు విడుదల కాకపోవడంతో ఆర్థిక సహాయ పథకాల లక్ష్యం నెరవేరడం లేదు.
Tags:Non-Loaned Tribes (Adilabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *