NTR 'Sammanudu' before Kejriwal

కేజ్రీవాల్‌ కంటే ముందే ఎన్టీఆర్‌ ‘సామాన్యుడు’

Date: 14/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కొత్త రాజకీయాలకు తెరలేపారు. ఎఎపి నేతలు అధికారంలో ఉన్నప్పటికీ భద్రతను తిరస్కరించడం, సొంత వాహనాలు లేదా బస్సులు, రైళ్లలో రావడం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం అయింది. అదే సమయంలో ఆప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎఎపి సంచలనాలకు మీడియా కూడా విశేష ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దీంతో ఎఎపి ప్రతిచర్య సంచలనం అవుతూ వచ్చింది. ఎఎపిని ‘సామాన్యుడి’ పార్టీగానే అందరూ చూడడం మొదలుపెట్టారు తొలినాళ్లలో. ఇప్పడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనుకోండి. ఈ కారణంగానే ఆ పార్టీ వైపు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు మొగ్గు చూపారు కూడా. అయితే, ఇలాంటి నిర్ణయాలను స్వర్గీయ నందమూరి తారకరామారావు నాడే అమలు చేసి చూపించారని గుర్తు చేసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎన్టీఆర్‌ తన హయాంలో అవినీతిపై కొరడా ఝుళిపించారు. తన సొంత వాహనంలో ఎస్కార్ట్‌ ఆర్భాటం లేకుండా ప్రయాణించేవారు. ఆయన స్వయంగా వాహనం నడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి అప్పట్లోనే ఆయన గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. అవినీతిని అరికట్టడం కోసం ఇప్పటి లోకాయుక్త వంటి వ్యవస్థను అప్పుడే ఏర్పాటు చేసి విస్తృత అధికారాలు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తే, నాటి ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేసింది. అవినీతి మంత్రులను తొలగించారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నంత కాలం ప్రభుత్వ భవనాలను తన నివాసానికి ఉపయోగించుకోలేదు. సొంతింట్లో ఉండేవారు. సీఎంగా ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకునే వారు. ముఖ్యమంత్రిగా తను వాడే సొంత వాహనాన్ని కుటుంబ సభ్యులు వాడటానికి కూడా ఎన్టీఆర్‌ అనుమతించేవారు కాదు.

Tags: NTR ‘Sammanudu’ before Kejriwal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *