NTR's Direction

ఎన్టీఆర్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం!

-రవికాంత్‌తో కలిసి సీతారామ కళ్యాణం

Date: 06/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

సంక్రాంతి చిత్రంగా జనవరి 6, 1961లో విడుదలైన ఎన్టీఆర్ సినిమా ‘సీతారామ కళ్యాణం’. ఎన్ఏటి పిక్చర్స్ పతాకంపై నందమూరి సోదరులు సొంతంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎన్టీఆర్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. అయితే దర్శకునిగా తన పేరును వేయడానికి బదులుగా ఈ చిత్రం ‘మా తల్లిదండ్రులకు అంకితం’ అంటూ తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకట్రావమ్మలకు ఎన్టీఆర్, త్రివిక్రమరావులు పాదపూజ చేస్తున్నట్టుగా వేశారు. దర్శకుడు కేవీరెడ్డి వద్ద నటిస్తూ తాను తెలుసుకున్న దర్శకత్వ మెళకువలను ఈ చిత్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ కనబరిచారని అంటారు. ఎన్టీఆర్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం ఏంటంటే కథాపరంగా ముల్లోకాలను చూపించినా, రావణుడు పుష్పక విమానంపై గగన విహారం చేసినా స్టూడియో దాటి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదు. విజయ-వాహినీ వారి స్టూడియోలోనే అన్ని సెట్లను వేయించి చిత్రీకరించారు ఎన్టీఆర్. నాటి ప్రఖ్యాత కళాదర్శకుడు టీవీఎస్ శర్మ ఈ విషయాన్ని ఒక ఘనతగా చెప్పుకునేవారు. ఇకపోతే రవికాంత్ నగాయిచ్ ఈ సినిమాకు ఛాయాగ్రాహకునిగా పనిచేశారు. ఆయనకు ఇది తొలిసినిమా. తన గురువు బాలీవుడ్‌లో ట్రిక్ ఫొటోగ్రఫీకి పేరుగాంచిన బాబు భాయ్ మిశ్రా వద్ద తాను నేర్చుకున్న పనితనాన్నంతా ఈ సినిమాలో చూపించారు రవికాంత్. ముఖ్యముగా రావణుడు కైలాస పర్వతాన్ని తలపై ఎత్తుకుని ఆ భారాన్ని మోయడానికి తన పది తలలను ఉపయోగిస్తాడు. బరువు ఎక్కువ అవుతున్నకొద్దీ ‘ఓం నమః శివాయ’ అంటూ ఒక్కో తలను రప్పిస్తాడు. మామూలుగా అయితే ఇలాంటి దృశ్యాలలో అప్పటివరకు డమ్మీ బొమ్మ తలలను ఉపయోగించేవారు. కానీ రవికాంత్ మాత్రం తన ట్రిక్ ఫోటోగ్రఫీతో రావణుడి ఒక్కో తలను ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా చిత్రీకరించారు. అయితే ఇలా చిత్రీకరించడానికి నటుడిగా ఎన్టీఆర్ ఎంతో ఓపికతో చాలాసేపు పనిచేయాల్సి వచ్చింది. ఆ కష్టానికి ఫలితంగా రావణుడి పాత్రలో ఎన్టీఆర్ నటనకు జేజేలు కొట్టారు సినీ ప్రియులు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడంటూ పిలుచుకున్నారు అభిమానులు. అంతేకాదు ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. హరనాథ్, గీతాంజలి శ్రీరామ, సీత పాత్రలు ధరించారు. నారద పాత్రను కాంతారావు పోషించారు. ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా రావణుడు, శూర్పణఖలు సీత, రాముల్ని సీతా స్వయంవరం కన్నా ముందే మోహించడం ఇందులో చూపించారు. ఇందుకు ఎన్టీఆర్ ఆశ్చ్యర్య రామాయణం, విచిత్ర రామాయణం వంటి గ్రంథాలను పరిశీలించారని అంటారు. ఈ పరంగా ఎన్టీఆర్ విమర్శలను ఎదుర్కొన్నా ఆయన దర్శకత్వ ప్రతిభకు, నటనకు ఆబాలగోపాలం ముగ్దులై చిత్రాన్ని విజయవంతం చేశారు.

Tags: NTR’s Direction

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *