యథేచ్ఛగా కబ్జా!

Date:15/02/2018
కడప ముచ్చట్లు:
కడప జిల్లాలో భూకబ్జాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాక  పట్టణాల్లోనూ ప్రభుత్వ స్థలాలను పలువురు ఆక్రమించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతుండడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్రమార్కులు అందిస్తున్న మామూళ్లకు ఆశపడి విలువైన భూములను పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగం కబ్జా దందాపై చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. ప్రాంతీయంగా సాగి భూ కబ్జాలు చూసి రెవెన్యూ సిబ్బందే ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది. కడపతో పాటూ రాయచోటి, మదనపల్లి ప్రాంతంలోనూ కబ్జాలు జోరుగా వెలుగుచూస్తున్నాయి. పట్టాదారుల నుంచి స్థిరాస్తి వ్యాపారుల చేతిలోకి భూములు చేరడంతో వాటికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు ఇరువైపులా ఆక్రమించేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే పట్టణ సమీపంలోని కొన్ని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేసి దర్జాగా ఇళ్లు నిర్మించుకున్నారని చెప్తున్నారు.రాయచోటి పట్టణ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇటీవల రాయచోటి వచ్చిన కడప ఆర్డీఓ ఆక్రమిత ప్రాంతాలను చూసి షాకయ్యారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఆక్రమిత స్థలాలను గుర్తించాలని చెప్పారు. ఇలా గుర్తించిన స్థలాల్లో సర్వే నెంబర్లతో కూడిన ప్లేకార్డులను ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటు చేస్తే డ్రోన్‌ సహాయంతో సర్వే చేయిస్తామని వెల్లడించారు. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా ప్రాంతీయంగా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాల గుర్తింపు నత్తనడక సాగుతున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు, గాలివీడు, చెన్నముక్కపల్లి మార్గాలలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించాల్సి ఉన్నా ఆ పని జోరందుకోలేదని స్థానికులు అంటున్నారు. కేవలం స్థిరాస్తి వ్యాపారం జోరందుకున్న ప్రాంతాలపైనే దృష్టి సారించి కొంత భాగంలోనే ఆక్రమణలను తొలగించారని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags: Obviously Kabja!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *