పాకాల…ప్రకృతి రమణీయత..

వరంగల్ ముచ్చట్లు:
 
ప్రకృతి రమణీయతను తనివితీరా అనుభవించాలా.. పక్షుల కిల కిల రావాలు, కుహు కుహు సోయగాలను కనులార చూడాలా..స్వచ్ఛమైన ప్రకృతి మధ్య సేద తీరాలా..మనసును ఆహ్లాదపరిచే వాతావరణంలో సమయం గడపాలనుకుంటున్నారా.. ఐతే పాకాల పర్యాటక ప్రాంతానికి విచ్చేయ్యాల్సిందే..ఆ అనుభూతిని ఆస్వాదించా ల్సిందే..పాకాల కేవలం పర్యాటక ప్రాంతమే కాదు.. కాకతీయ చరిత్రకి ఆనవాలుగా నిల్చింది. మరి పాకాల పర్యాటకంగా కేవలం మనష్యులకే ఆనందాన్ని వస్తుందనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే.. మనం కాకుండా పాకాల సరస్సును, అభయారణ్యంను ఇష్టపడే పర్యాటక అతిథులు వేరే ఉన్నారు.కాకతీయ పాలకుడు గణపతి దేవుడి కాలంలో క్రీ.శ.1213లో మానవ నిర్మితమైన పాకాల సరస్సు వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం లో కలదు. ఈ సరస్సు చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయ దృశ్యాలు, అభయారణ్య వాతావరణం పర్యాటకులను, చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. చెరువు మధ్యలో చిలకమ్మ గట్టు అనే చిన్న గుట్ట ఉంది. మధ్యాహ్న సమయంలో పాకాల సరస్సు కట్టపై నుంచి సరస్సు లోనికి చూసినట్లయితే చిలుకమ్మ గుట్ట ప్రతిబింబం నీటిలో పడి మగువ పెదవుల వలే ఒక దృశ్యం కనిపిస్తుంది. అది చూస్తే పాకాల సరస్సునే కాన్వాస్ పైన ప్రకృతి మాత సూర్యుడనే కుంచెను ఉపయోగించి గీసిన చిత్రపటంలా..సరస్సును ముద్దాడుతున్న పెదాలు కనిపిస్తాయి.పాకాల ప్రశస్తిని దశ దిశలా చాటేందుకు ఒక్కటేమిటి ఎన్నో రకాల జీవ వైవిధ్యం అంతా ఇక్కడే కలబోసి ఊపిరోసుకున్నట్టు ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే.. సుదూర తీరపు విహాంగపు నేస్తాలన్నీ జట్టు కట్టి జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పాకాల విహారయాత్రకు వస్తాయి. కొన్ని రోజుల పాటు ఇక్కడ సరస్సులో సేదతీరి ఇక్కడ పర్యాటకులకు ఆనందం పంచుతాయి.
 
 
సుమారు 70 రకాల పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. అందుకు గాను అటవీ శాఖ, పర్యాటక శాఖ వీటి కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ప్రకృతి ఆరాధకులైన ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్, అధ్యక్షుడు, ఇందారం నాగేశ్వర రావు తన ఫోటో గ్రఫి తో పాకాల అందాలను తన కెమెరాలో బంధించాడు.కాలుష్య రహిత శుద్ధ జలాలు కలిగిన సరస్సుల్లో పాకాల సరస్సు ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. భారతదేశంలో ద్వితీయ స్థానంలో కలదు. ఈ సరస్సులో బోటు విహారం సరదాగా ఉంటుంది. బోట్లపై సరస్సు మధ్యలో ఉన్న దీవి, చిలకలగుట్ట వరకు వెళ్లొచ్చు. దీవిలోని ప్రతి చెట్టు, పుట్ట, కొమ్మ పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. రంగు రంగుల పక్షులు, బారెడు ముక్కున్న విహంగాలు, పోట్లాడుకునే చిలకలు, ఇచ్చి కాలడు పిచ్చుకలు.. వలస పక్షులు అతిథులను కువకువ రాగాలతో స్వాగతిస్తాయి. ఇక్కడ చెరువులో మొసళ్లు ఉంటాయి. అందుకే సరస్సులోకి దిగడంపై నిషేధం విధించారు. దూర ప్రాంత పర్యాటకుల కోసం ఇక్కడ హరిత కాకతీయ రిసార్ట్స్ ను రాష్ట్ర పర్యాటక శాఖ నిర్మించడం జరిగింది. ఇక్కడ రెస్టారెంట్ లో మనకు కావాల్సిన ఆహారం, విశ్రాంతి గది సౌకర్యం ప్రభుత్వం నిర్దేశించిన ధరలలో అందుబాటులో ఉన్నాయి.
 
Tags: Pakala … the beauty of nature ..

Natyam ad