చైనా పంచన చేరుతున్న పాకిస్థాన్‌!

-పాక్ గడ్డపై నుండి భారత్‌పై దాడులకు ఉగ్ర సంస్థల వ్యూహరచన
– ప్రమాదమని నిఘా సంస్థల హెచ్చరిక
Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
పాకిస్థాన్ క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనా పంచన చేరుతోందని పలు నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ ధోరణి అమెరికా ప్రయోజనాలకు ముప్పని హెచ్చరించాయి. “2019లో అమెరికా ప్రభావం నుండి పాకిస్థాన్ క్రమంగా బయటపడుతూ చైనాకి దగ్గరవుతుంది. తద్వారా ఆ దేశం దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తుంది” అని పాకిస్థాన్ దినపత్రిక ‘డాన్’ పేర్కొంది. అధునాతన అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకోవడం, ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించడం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సహకారాన్ని అడ్డుకోవడం, చైనాకి చేరువకావడం ద్వారా అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పాకిస్థాన్ పరిణమించనుందని అవి హెచ్చరించాయి. సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) సహా మొత్తం 17 నిఘా సంస్థలు ఈ మేరకు ట్రంప్ యంత్రాంగాన్ని హెచ్చరించాయి. మరోవైపు ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయమేర్పరుచుకుని భారత్, ఆఫ్గనిస్థాన్ దేశాలపై దాడులకు వ్యూహరచన చేస్తాయని డాన్ పేర్కొంది. అలాగే భారత్‌లో ఒకవేళ మరో భారీ ఉగ్రదాడి గనుక జరిగితే భారత్-పాకిస్థాన్ దేశాల నియంత్రణ రేఖ వెంట హింస కొనసాగుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటాయని తెలిపింది. చైనాతోనూ భారతదేశ సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటాయని, కొన్నిసందర్భాల్లో మరింత దెబ్బతినే అవకాశముందని నిఘా సంస్థలు హెచ్చరించినట్లు ‘డాన్’ తెలిపింది. పాకిస్థాన్‌పై ఏదైనా ఏకపక్ష చర్యకు దిగడం సరికాదని, అలా చేస్తే దానికి తాము తగు విధంగా స్పందించాల్సి ఉంటుందని ఆ దేశ హోం శాఖ మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్ సీఎన్ఎన్‌తో అన్నారు. తమ దేశం ఇప్పటివరకు దాదాపు 60వేల మందిని కోల్పోయిందని, తమ ఆర్థిక వ్యవస్థకు సుమారు 25 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆయన గుర్తు చేశారు. కాగా, అమెరికా నుండి ఒత్తిళ్ల నేపథ్యంలో గతవారం ఉగ్రవాది సయీద్‌కి చెందిన జుద్ సహా 27 ఉగ్ర సంస్థలపై నిషేధం విధిస్తూ పాకిస్థాన్ ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Tags: Pakistan reaches Pakistan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *