పాన్ గల్ కష్టాల్

Date:14/02/2018
వనపర్తి ముచ్చట్లు:
వనపర్తి జిల్లాలోని కొండల్లో కొలువైన పాన్ గల్ల్ కోటను పౌరుషానికి ప్రతీకగా స్థానికులు పేర్కొంటారు. వందల ఏళ్లనాటి చరిత్రను పొదివి పట్టుకున్న ఈ కోట నేపథ్యం పరికిస్తే వారి మాటల్లో అతిశయోక్తి లేదని తేలిపోతుంది. పచ్చదనం పరచుకున్న ప్రాంతంలో ఎత్తైన కొండపై నిర్మతమైన పాన్ గల్ కోటను 11, 12 శతాబ్ధాల మధ్య కళ్యాణి చాళుక్యులు నిర్మించినట్లుగా చరిత్రకారులు చెప్తారు. అత్యంత పటిష్ఠంగా, ప్రణాళికాబద్దంగా, శత్రదుర్భేధ్యంగా ఈ గిరిదుర్గాన్ని నిర్మించారు. కోట మొత్తం విలువైన గ్రానైట్‌ రాయితో నిర్మించబడటం విశేషం. కోట లోపలికి వెళ్ళడానికి ఏడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం కళా నైపుణ్యంతో తోణికిసలాడుతుంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల తర్వాత భారతదేశంలో అత్యధికంగా కోటలు, గుడులు, సంస్థానాలు నెలవైన రాష్ట్రం తెలంగాణ. అలనాటి రాజుల చరిత్రకు, గత కాలపు వైభవానికి, నాటి శిల్పుల నిర్మాణ కౌశలానికి, ప్రత్యక్ష సాక్షీ భూతంగా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వందల సంవత్సరాలలో సంభవించిన ఎన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని దర్పంగా, ఠీవిగా కళ్ళముందు కనబడుతున్నాయి.అసలే శిథిలావస్థకు చేరుకున్న పాన్ గల్ ఖిల్లా.. గుప్తునిధుల కోసం కొందరు సాగిస్తున్న తవ్వకాలతో మరింత కృంగిపోతోంది. రాజులు, నవాబులు ఇక్కడ బంగారం, వజ్రాభరణాలు దాచి ఉంటారన్న ఉద్దేశంతో పలువురు కోటలో వివిధ చోట్ల తవ్వకాలు సాగిస్తున్నారు. దీంతో ఖిల్లా స్వరూపం దెబ్బతింటోంది. పానగల్లు ఖిల్లాపై కొలువైన చారిత్రక సంపదను పరిరక్షిస్తే.. ఈ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుంది. పచ్చదనాన్ని కాపాడి.. కోటను పునరుద్ధరిస్తే.. స్థానికంగా పలువురికి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఈ విషయాన్ని 1997లోనే అప్పటి కలెక్టర్ గుర్తించి చర్యలు తీసుకున్న పెద్దగా ఫలితం లేకుండా పోయింది. పురావస్తు, పర్యాటక, అటవీ విభాగాలు ఈ ప్రాంతంపై పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాన్ గల్ అభివృద్ధికి ముందుకురావాలని అంతా కోరుతున్నారు.
Tags: Pan gul kalpal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *