Participate in public conscious culture:

ప్రజా చైతన్యం సంస్కృతిలో భాగం కావాలి: సీఎం

-3వరోజు ‘జన్మభూమి’లో ఉత్సాహంగా చంద్రబాబు

Date : 04/01/2018

విజయవాడ ముచ్చట్లు:

‘‘ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి జన్మభూమి కన్నా మెరుగైన వేదికలేదు, ఇంతకన్నా మెరుగైన అవకాశం లేదు. ప్రజలను చైతన్యపరచడం చాలా కష్టం, కానీ ఒకసారి అలవాటు అయితే చైతన్యం మన సంస్కృతిలో భాగం అవుతుంది. ప్రజా చైతన్యం మన సంస్కృతిలో ఒక భాగం కావాలి. ప్రజా చైతన్యంతోనే అద్భుత ఫలితాలు సాధ్యం’’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం తన నివాసం నుంచి 3వరోజు ‘జన్మభూమి-మావూరు’ నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘ఇదో వినూత్న కార్యక్రమం, 10 రోజుల నిరంతర ప్రక్రియ, 16 వేల గ్రామాలు, వార్డులలో జరిగే అభివృద్ధి యజ్ఞం. అంకితభావంతో, సేవా దృక్ఫథంతో జన్మభూమిలో అందరూ పాల్గొనాలి. సమాజం పట్లమనకున్న బాధ్యత నిర్వర్తించాలి’’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. జన్మభూమి గ్రామసభలు అభివృద్ది వేదికలే తప్ప రాజకీయ వేదికలు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రకరకాల వ్యక్తులు వేర్వేరు అజెండాలతో గ్రామసభలకు వస్తారంటూ, ఎవరు ఏ ఉద్దేశాలతో గ్రామసభలకు వచ్చినా బాధ్యతతో వ్యవహరించాలని, సంయమనం పాటించాలని అధికారులకు సూచించారు. 1,89,171 రేషన్ కార్డులు కొత్తగా అందిస్తున్నామని, గతంలో ఆమోదం పొంది పంపిణీ చేయని మరో 57వేల కార్డులు కూడా అందజేస్తున్నామంటూ, మొత్తం 2.46 లక్షల రేషన్ కార్డులు ప్రస్తుత జన్మభూమిలో పంపిణీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నియోజకవర్గానికి 2 వేల చొప్పున 4 లక్షల పెన్షన్లు కొత్తగా అందజేస్తున్నామని, పేదరికం, పెద్ద నియోజకవర్గాలను బట్టి మరో 50 వేలు అదనంగా ఇస్తామంటూ, వీటితో కలిపి రాష్ట్రంలో పెన్షన్ లబ్దిదారుల సంఖ్య 50 లక్షల 50 వేలకు చేరుతుందన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు సంతృప్త స్థాయికి వచ్చేదాకా అందజేస్తామన్నారు. ఇళ్ల స్థలాల కొరత దృష్ట్యా ఆయా ప్రాంతాలలో 1 ప్లస్ 3 గృహ సముదాయాలకు మొగ్గు చూపాలని సూచించారు. ‘‘సమస్యల పరిష్కారం ఎంత ముఖ్యమో, ప్రజల్లో సంతృప్తి తీసుకురావడం అంతే ముఖ్యం. ఏ శాఖకు ఆ శాఖ బాధ్యతగా వ్యవహరించాలి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. రాజకీయ యంత్రాంగం, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తేనే ప్రజల్లో సంతృప్తి సాధ్యం’’ అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయబడ్డారు. పశువైద్య శిబిరాల నిర్వహణపై ప్రజల్లో సంతృప్తి 50% లోపే ఉందంటూ, ఆ శాఖాధికారులు, సిబ్బంది మరింత చురుకుగా పాల్గొనాలని, ప్రజల్లో సానుకూలత సాధించాలని అన్నారు. ఈ సందర్భంగా రెండవ రోజు వ్యక్తం అయిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. జన్మభూమిలో మీరు పాల్గొన్నారా అంటే 47% అవునని, 32% లేదని, 21% జరగలేదని తెలిపారు. జన్మభూమికి అధికారులు హాజరయ్యారా అంటే 90% అవునని, 10% లేదని తెలిపారు. వివిధ అంశాలపై అధికారులు అవగాహన కల్పించారా అన్న ప్రశ్నకు 72% అవునని, 22% లేదని, 6% తెలియదని చెప్పారు. అధికారుల స్పందన బాగుందా అని అడిగితే 54% అవునని, 36% లేదని,10% తెలియదని పేర్కొన్నారు. సాధికార మిత్రలు పాల్గొన్నారా అన్న ప్రశ్నకు 48% అవునని, 52% లేదని తెలిపారు. జన్మభూమిలో జరిగిన డిబేట్ అంశం అర్ధమైందా అని అడిగితే 88% అవునని, 12% లేదని జవాబిచ్చారు. పింఛన్లు అందరికీ అందుతున్నాయా అన్న ప్రశ్నకు 64% అవునని, 36% లేదని తెలిపారు. రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయా అన్న ప్రశ్నకు 65% అవునని, 35% లేదని చెప్పారు. చంద్రన్న బీమా ఎలా జరుగుతోందన్న ప్రశ్నకు 63% బాగుందని, 37% లేదని చెప్పారు. దీనిని బట్టి పింఛన్లు, రేషన్ కార్డులు ఇంకా ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. అర్జీల పరిష్కారం బాగుందా అన్న ప్రశ్నకు 48% అవునని, 52% లేదని జవాబిచ్చారు. దీనిని బట్టి ఫిర్యాదుల పరిష్కార వేగం మరింత పుంజుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘గ్రామాభివృద్ధికి ప్రజలను సమాయత్తం చేయండి,వారిలో సానుకూలత పెంచండి ’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకం చేశారు. గ్రామసభల వద్ద ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ ఊళ్లో నిర్మించిన సిమెంట్ రోడ్లు,తవ్విన పంటకుంటలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలు ప్రదర్శించాలని కోరారు. దీనివల్ల ఆ ఊళ్లో గత మూడున్నరేళ్లలో ఏం చేశామో, ఇంకా ఏం చేయాలనేదానిపై ప్రజల్లో విజిబిలిటి వస్తుందన్నారు. వ్యక్తిగతంగా, సామాజికంగా గ్రామానికి, నియోజకవర్గానికి, రాష్ట్రానికి, దేశానికి మేలు జరిగేందుకు చేస్తున్న జన్మభూమి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.గత మూడున్నరేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించామని, మిగిలిన వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 24గంటలు విద్యుత్ సరఫరా, గ్రామగ్రామానా సిమెంట్ రోడ్లు, పచ్చదనం-పరిశుభ్రత, గ్రామాలలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు తదితర అంశాలను వివరించాలన్నారు. కర్నూలు జిల్లాలో కేవలం 6 మీటర్లలోపే భూగర్భజలాలు ఉన్నాయని, గోదావరి జిల్లాల కంటే ఎగువన గ్రవుండ్ వాటర్ కర్నూలులో ఉండటం ఊహాతీత అంశం అంటూ ఇది జలసంరక్షణ చర్యల ఫలితం, ‘నీరు-ప్రగతి’ సాధించిన విజయంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 7వ తేదీన అన్ని పట్టణాలు, మేజర్ పంచాయితీలలో 5కె రన్ నిర్వహించాలని, జన్మభూమి-మావూరు కార్యక్రమాలలో యువతను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలనీ, శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ప్రతిరోజూ వ్యాయామం కూడా అంతే ముఖ్యమనేది ప్రజల్లోకి దీనిద్వారా పెద్దఎత్తున తీసుకువెళ్లాలన్నారు. 5కె, 10కె రన్ కార్యక్రమాలను ఉత్సాహంగా ఆయా పట్టణాలలో స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా నిర్వహించి ప్రజలను స్వచ్ఛాంధ్రపై చైతన్యపరచాలని కోరారు. గ్రామసభలకు హాజరయ్యే సిబ్బందికి వర్కింగ్ లంచ్ ఇవ్వాలని, ప్రజలకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, జవహర్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, వ్యవసాయ, గ్రామీణ, పట్టణాభివృద్ధి, ప్రణాళిక, ఆర్ధిక శాఖ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు రాజశేఖర్, జవహర్ రెడ్డి, సంజయ్ గుప్తా, సునీత, అహ్మద్ బాబు పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో కృష్ణమోహన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags : Participate in public conscious culture:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *