Pavanikyan message for immigrants!

ప్రవాసులకు పవన్‌కల్యాణ్‌ సందేశం!

ఈనాడు

Date:04/01/2018

హైదరాబాద్‌: ప్రవాస తెలుగు వారు చూపిస్తున్న అభిమానానికి శిరస్సు వంచి హృదయ పూర్వక ధన్యవాదాలని అన్నారు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ దర్శకుడు. కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పవన్‌ ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి మాట్లాడారు.‘‘ప్రవాస తెలుగువారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉన్న వూరిని వదిలి పక్క వూరికి వెళ్లి పనిచేయటం ఎంతో కష్టం. అలాంటిది రాష్ట్రాన్ని వదిలి, దేశాన్ని వదిలి.. దేశం కాని దేశంలో చదువు కోవటం, అక్కడ పనిచేయటం ఇంకా కష్టం. దాంతో పాటు ఆత్మ గౌరవం దెబ్బతినకుండా అక్కడ ఓ జీవితాన్ని ఏర్పరచుకోవడం, అక్కడ స్థానికతను సంపాదించటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. అందుకే మీరంటే నాకు చాలా గౌరవం. మీరెక్కడున్నా మీ వెనుక మీతో పాటే నేను. అక్కడ మీకో చిన్న సమస్య ఎదురైతే ఇక్కడ కోట్ల గొంతులు మీకు అండగా నిలుస్తాయి. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ‘బద్రి’ సినిమా అమెరికాలోని కొద్ది సెంటర్లలో విడుదలవగానే ఏదో పెద్ద విజయంగా చెప్పారు. అలాంటిది ఈరోజు ‘అజ్ఞాతవాసి’ ఏ భారతీయ చలనచిత్రానికి ఇవ్వనంత భారీ విడుదల ఇస్తున్నందుకు నాకు నిజంగా ఆశ్చర్యంగా, ఆనందంగానూ ఉంది. మీరు చూపించే ఈ ప్రేమకు, గౌరవానికి శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.’’ అని అన్నారు.‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకం ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గీతాలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పవన్‌ పాడిన పాట విశేషంగా అలరిస్తోంది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో త్రివిక్రమ్‌ సినిమాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో ఏ తెలుగు చిత్రమూ విడుదల కాని రీతిలో అమెరికాలోని 209 ప్రాంతాల్లో ‘అజ్ఞాతవాసి’ విడుదల చేయటానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. గతంలో ‘బాహుబలి’ 126 ప్రాంతాల్లో, ‘ఖైదీ నంబర్‌ 150’ 74 లొకేషన్లలో, రజనీ ‘కబాలి’ 73 లొకేషన్లలో విడుదల కాగా, ఆమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ 69 లొకేషన్లలో విడుదల చేశారు. ఇప్పుడు ఆ రికార్డులను పవన్‌ చిత్రం తిరగరాసింది. ఏకంగా డబుల్‌ సెంచరీని దాటేసింది.

Tags :Pavanikyan message for immigrants!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *