Pension to increase pension

పెన్షన్‌ పెంచుతామంటూ దగా

-80 ఏళ్ల వృద్ధురాలిని మోసగించిన మాజీ సర్పంచ్‌

-బ్యాంకు విత్‌డ్రా ఫారాలపై వేలిముద్రలు

-బ్యాంకు ఖాతా నుంచి రూ.49 వేలు విత్‌డ్రా

-పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

Date: 06/01/2018

విశాఖపట్నం, అచ్యుతాపురం ముచ్చట్లు:

ప్రతి నెల వచ్చే వెయ్యి రూపాయల పెన్షన్‌ని రూ.1500లకు పెంచుతానని నమ్మించి, 80 ఏళ్ల వృద్ధురాలి నుంచి రూ.49 వేలు కాజేసిన మాజీ సర్పంచ్‌ ఉదంతం ఇది. ఈ సంఘటన అచ్యుతాపురం మండలం గురజాపాలెంలో జరిగింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ దీనబందు అందించిన వివరాలిలా ఉన్నాయి.
గురజాపాలెంకి చెందిన రాజాన చిన్నమ్మి(80) ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) నిర్వాసితురాలు.
వీరి కుటుంబానికి రావలసిన పరిహారం గతంలో ఇచ్చేశారు. అంతేకాకుండా ఆమె భర్త మృతి చెందడంతో వెయ్యి రూపాయల వితంతు పింఛన్‌ వస్తున్నది. అయితే వితంతువులు, మేజర్లకు ఇళ్లస్థలాలతోపాటు పరిహారం కూడా ఇవ్వాలని నిర్వాసితులు ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు చొరవతో వారికి గృహనిర్మాణానికి ఐదు సెంట్ల భూమి, గృహనిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పరిహారాన్ని ఏపీఐఐసీ అధికారులు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోనే వేస్తున్నారు. ఈనేపథ్యంలో చిన్మమ్మి బ్యాంక్‌ ఖాతాకు గత నెల 28న రూ.74,200 ఏపీఐఐసీ నుంచి బదిలీ అయ్యాయి. నిరక్షరాస్యులు, వృద్ధురాలైన చిన్నమ్మికి ఈ విషయం తెలియదు. కానీ మాజీ సర్పంచ్‌ లాలం ప్రసాద్‌ ఈ వివరాలను ముందుగానే సేకరించాడు. ఇదిలాఉండగా వికలాంగులకు పరీక్షలు నిర్వహించి, పెన్షన్‌లు మంజూరు చేద్దామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు గురువారం అచ్యుతాపురంలోని ప్రశాంతి పాలిటెక్నిక్‌లో సదరం క్యాంపుని ఏర్పాటు చేశారు. దీనిని గురజాపాలెం మాజీ సర్పంచ్‌ లాలం ప్రసాద్‌ చక్కగా వినియోగించుకున్నాడు. ఇంతవరకు వెయ్యి రూపాయల పెన్షన్‌ వస్తున్న చిన్నమ్మికి రూ.1500 చేయడానికి అచ్యుతాపురంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మెడికల్‌ శిబిరం ఏర్పాటు చేశారని, నీకు బాగా వయసు అయిపోయిందున వైద్య పరీక్షలు చేస్తే నెలకు రూ.500 అదనంగా పెన్షన్‌ వస్తుందని నమ్మబలికాడు. తన బంధువు కూడా కావడంతో చిన్నమ్మి మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌ను నమ్మి ఆటోలో అచ్యుతాపురం వచ్చింది. వైద్యపరీక్షలు నిర్వహించాలంటే వేలిముద్రలు కావాలని కొన్ని కాగితాలపై వేలిముద్రలు వేయించుకున్నారు. దీంతోపాటు బ్యాంక్‌ విత్‌డ్రా ఫారాలపై కూడా వేలిముద్రలు వేయించుకొన్నాడు. తర్వాత బ్యాంక్‌కి వెళ్లి రూ.49 వేలు డ్రా చేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కొడుకు చిన్నోడు, మనవడు రమేష్‌ కలిసి ఎక్కడికి వెళ్లావంటూ చిన్నమ్మిని అడిగారు. దీంతో జరిగిన విషయం వారికి చెప్పింది. ఎన్నడూ లేనిది ప్రసాద్‌ తీసుకువెళ్లడమేమిటని వారికి అనుమానం వచ్చి ఆరా తీశారు.
ఎందుకైన మంచిదని బ్యాంక్‌కి వెళ్లి విచారణ జరిపారు. రూ.74 వేలు ఇమ్మని మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌ వృద్ధురాలికి తీసుకు వచ్చాడని, అయితే రూ.50 వేలు దాటితే పాన్‌కార్డు కావాలని చెప్పడంతో రూ.49 వేలు మాత్రమే ఇచ్చామని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో మాజీ సర్పంచ్‌ ప్రసాద్‌ తమను మోసం చేశాడని తెలుసుకొని శుక్రవారం ఫిర్యాదు చేశారని ఎస్‌ఐ దీనబందు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.

Tags: Pension to increase pension

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *