ఆత్మకూరులో రాజకీయ చదరంగం..

నెల్లూరు ముచ్చట్లు:
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం తరువాత నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ చదరంగం మొదలైనట్లే కనిపిస్తోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో ఇప్పుడు ఎవరుంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి ఉప ఎన్నికల బరిలో ఉంటారని కొందరు.. లేదు.. గౌతమ్ రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి పోటీలో ఉంటారని మరికొందరు.. పుకార్లు షికార్లు చేస్తున్నారు. కాగా.. జగన్ మనసులో ఏముందో మామా.. కోడలి మధ్య ఏం జరుగుతుందో అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.మేకపాటి రాజమోహన్ రెడ్డి తన మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ రాజీపడిందే లేదు. రాజమోహన్ రెడ్డి, ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తన కొడుకు మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక్కొక్కరిగా రాజకీయ అరంగేట్రం చేశారు. అవకాశాలు వచ్చినా మేకపాటి కుటుంబంలోని మహిళలు ఎవ్వ రనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాజమోహన్ రెడ్డి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగిందనే వార్తలు వస్తున్నాయి. గౌతమ్ మరణం తరువాత ఎమ్మెల్యే రేసులో ఆయన సతీమణి కీర్తిరెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రచారంతో రాజమోహన్ రెడ్డికి మింగుడు పడటంలేదట.దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో మేకపాటి కుటుంబంలో చాలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది.రాజకీయాలంటే ఏమాత్రమూ తెలియని కీర్తిరెడ్డికి కొత్తగా ఎమ్మెల్యే కావాలనే కోరిక ఎందుకు కలిగింది? అనే ప్రశ్నకు సమాధానం లేకపోలేదు. గౌతమ్ మరణంతో ఉప ఎన్నికల్లో పెద్దాయన రాజమోహన్ రెడ్డి పోటీ తథ్యమని ఆయన కార్యకర్తలు ఊహల్లో ఉన్నారు. అంతలోనే బిగ్ షాక్ ఇచ్చారు జగన్. గౌతమ్ రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి బరిలో ఉంటారనే సంకేతాలు స్పష్టంగా ఇచ్చారాయన.గత ఎన్నికల నుండి పదవి లేక అసహనంలో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ మరో సారి చెక్ పెట్టనుండటంతో పెద్దాయనకు ఏమీ పాలుపోవడం లేదట.తన కోడలు కీర్తిరెడ్డికి లేని ఆలోచన జగన్, ఆయన సతీమణి కల్పించారని జగన్ పై రాజమోహన్ రెడ్డి రగిలిపోతున్నారట. వాస్తవానికి గౌతమ్ మరణానంతరం ‘పెద్దాయనా నీ ఇష్టం’ అని జగన్ వదిలేసి ఉంటే.. కుటుంబ సభ్యులు కుర్చొని.. రాజమోహన్ రెడ్డి కానీ, ఆయన కుమారులు విక్రమ్, ప్రుథ్వి కానీ ఎన్నికల బరిలో ఉండేవారు. కానీ గౌతమ్ సతీమణిని జగన్ తెర మీదకు తీసుకురావడంతో కుటుంబంలో కాస్త చిచ్చు రాజేసినట్టైంది. కోడలు కాబట్టి వ్యతిరేకిస్తే రాజమోహన్ రెడ్డికి పదిమందిలో పరువు సమస్య.. ఒక వేళ వద్దని చెప్పినా ఇప్పుడు కోడలు వినే పరిస్థితిలో లేరు.. కాబట్టి రాజమోహన్ రెడ్డి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారని అంటున్నారు.వాస్తవానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి పోటీ చేస్తేనే ప్రస్తుత పరిస్థితులలో ఆ కుటుంబం నిలదొక్కుకోగలదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కార్యకర్తలు పటిష్ఠంగా ఉండాలంటే ఉప ఎన్నికలలో రాజమోహన్ రెడ్డి పోటీచేయడమే ఉత్తమమని..పైగా ఆయనైతే మంత్రి పదవి కూడా వస్తుందనేది కార్యకర్తల అభిప్రాయమట.ఒకవేళ ఎలాంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని కోడలు కీర్తిరెడ్డి బరిలోకి వస్తే అందరిలో కలిసిపోయి, నియోజకవర్గం మీద పట్టు సాధించాలంటే అంత ఈజీ ఏమీ కాదని అంటున్నారు.. ఊ..ఆ.. అనే లోపే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి. మరి.. కోడలు కీర్తిరెడ్డి నిలదొక్కుకోగలుగుతారా? అనే సందేహమూ లేకపోలేదు. మొత్తానికి గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా జగన్మోహన్ రెడ్డి తెచ్చారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. మామా.. కోడళ్ల మధ్యలో జగన్ తలదూర్చడమే దీనంతటికీ కారణమని స్థానికులు అనుకుంటున్నారు.
 
Tags:Political chess in Atmakur

Natyam ad