PrajaSankalpaYatra ys jagan mohan reddy ys jaganpadayatra Praja Sankalpa Yatra nellore

‘మన ఖర్మకు చంద్రబాబు సీఎం అయ్యారు’

సాక్షి

Date :24/01/2018

సాక్షి, నాయుడుపేట : ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరుగుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు 22సార్లు విదేశీ పర్యటనలు చేశారని, అయినప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా తీసుకురాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా సాధారణ విమానాల్లో కాకుండా ఖరీదైన ప్రైవేట్‌ విమానాల్లో చంద్రబాబు తిరిగారని, ఓ పక్క రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తన విదేశీ  పర్యటనలకోసం కనీసం రూ.200 కోట్లు ప్రజాధనం వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా, సుళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. నేటి రాజకీయ వ్యవస్థను మార్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ పేదవారు బతకాలంటే భయపడాల్సిన పరిస్థితి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

‘నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి వేలమంది నా అడుగులో అడుగు వేశారు. ఓ పక్క సమస్యలు చెబుతూనే నా భుజాన్ని తట్టి అంతా నాకు తోడుగా ఉన్నామంటూ అడుగులు వేస్తున్నారు. మీ ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు ముందుగా నా కృతజ్ఞతలు. మీరంతా నా వెంటే ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ప్రతిచోట క్రమం తప్పకుండా ప్రతి గ్రామంలో వినిపిస్తున్న సమస్య తాగునీటి సమస్య. అన్నా తాగడానికి కూడా నీళ్లు లేవని అంతా చెబుతుంటే చాలా బాధేస్తుంది. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఏం చేశారో అర్థం కావడంలేదు. రాష్ట్రంలో అత్యధికంగా వరి పంట పండే జిల్లా ఇది. ఇక్కడే సోమశిల ప్రాజెక్టు ఉంది. ఇదే జిల్లాలో లక్ష హెక్టార్లు వరి వేయాల్సి ఉండగా ఈసారి మాత్రం కేవలం 39 వేల ఎకరాలు మాత్రమే వేశారు. మన ఖర్మకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. దేవుడు కరుణించాడు కాబట్టి సోమశిలలో అంతంతమాత్రం నీళ్లున్నాయి.

నెల్లూరు సస్యశ్యామలం అయ్యేది
దివంగత నేత వైఎస్‌ఆర్‌ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించి 80శాతం పనులు పూర్తిచేసినా మిగిలిన 20శాతం పనులు కూడా చంద్రబాబు నాలుగేళ్లలో చేయలేదు. సోమశిల స్వర్ణముఖి కాలువకు దివంగత నేత వైఎస్‌ఆర్‌ రూ.120కోట్లు ఖర్చు చేసి దాదాపు పూర్తి చేశారు. మిగిలిన ఆ కాస్త పనులు చంద్రబాబు చేయడం లేదు. అది పూర్తయితే నెల్లూరు జిల్లాలో 316 చెరువులకు నీరొచ్చి నెల్లూరు సస్యశ్యామలం అయ్యేది. పులికాట్‌ ఉప్పునీటి సరస్సుపై 30వేల మంది మత్స్యకార్మికులు బతుకుతున్నారు. కానీ, నేడు సరస్సుకు ఉన్న రెండు ముఖద్వారాలు ఇసుకతో మూసుకుపోయాయి. చేపలు దొరకని పరిస్థితి. కానీ, చంద్రబాబు ఒక్కసారి కూడా వీటి గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ప్రజలను మోసం చేసేందుకు ఆయనకు గుర్తొస్తారు. లంచాలు, కమీషన్లకు కక్కుర్తిపడతారు కాబట్టే చంద్రబాబు పనులు పూర్తి చేయడం లేదు.

టెంకాయలు కొడతారు.. పనులు చేయరు?
ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు టెంకాయలు కొడతారు కానీ, పనులు మాత్రం చేయరు. దానికి ఉదాహరణ కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టు. ఇదే నెల్లూరు జిల్లాలో ఆర్థిక మండలి(సెజ్‌) వస్తే అందులోని పరిశ్రమలన్నింటిలోనూ ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. మన పిల్లలకు మాత్రం సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్‌లువంటి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు దావోస్‌లో ఉన్నారు. నాలుగేళ్లలో 22సార్లు విదేశాలకు వెళ్లారు. అది కూడా భారీ వ్యయంతో కూడిన ఫ్లైట్లలో వెళ్లారు. ఇందుకోసం దాదాపు రూ.200కోట్లు ప్రజాధనం ఖర్చు చేశారు. ఏ దేశం వెళితే ఆ దేశం మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌ను చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతుంటారు.

అలాచేస్తే ఇప్పటికే ఏపీ ఎన్ని సింగపూర్‌లు కావాలి? ఎన్ని జపాన్‌లు కావాలి? ఎంత అద్వాన్న ముఖ్యమంత్రయినా కళ్లు మూసుకొని ఈపాటికే కనీసం మూడు, నాలుగు భవనాలైనా కడతారు. కానీ, చంద్రబాబు మాత్రం ప్రతిసారి డిజిటల్‌ షోలో రాజధానిని చూపిస్తారు. సినిమా డైరెక్టర్‌ రాజమౌళిని తీసుకొచ్చి రాజధాని నిర్మాణం అంటారు. సినిమా వాళ్లు ఏంది? రాజధాని కట్టడం ఏంది? సినిమా వాళ్ల పని సినిమా తీయడం. ఆర్కిటెక్ట్‌ చేసే పని ఆర్కిటెక్టే చేయాలి’ అని చంద్రబాబు తప్పిదాలను వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

నాలుగేళ్లలో ఏం చూశాం?
అధికారంలోకి రాగానే కరెంట్‌ బిల్లులు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నాలుగేళ్లలలో కరెంటు బిల్లులు ప్రతి నెలా రూ.500 నుంచి రూ.1000వరకు వసూలు చేస్తున్నారు. కరెంట్‌ బిల్లు వాళ్లు ఇళ్లల్లో దూరి రెండు ఫ్యాన్‌లు రెండు లైట్‌లు ఉంటే పెండింగ్‌ బిల్లు అని చెబుతూ రూ.5వేలు రూ.6వేలు వేస్తున్నారు. నాలుగేళ్లలో మూడుసార్లు కరెంట్‌ బిల్లులు పెంచారు. మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఉగాది, సంక్రాంతినాడు బస్సు ఎక్కాలంటే భయపడే పరిస్థితి. ఇంటి పన్నులు కూడా షాక్‌ కొట్టే పరిస్థితి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకుంటే కనీసం రూ.7 తక్కువ వసూలు చేస్తుంటే ఏపీలో మాత్రం బాదుడే బాదుడు అన్నట్లు వసూలు చేస్తున్నారు. గతంలో రేషన్‌ షాపునకు బియ్యానికి వెళితే బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్‌, గోధుమలు, గోధుమ పిండి, పసుపు, కారం, చింతపండు, కిరోసిన్‌ ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్‌ షాపులకు వెళితే.. కేవలం బియ్యం తప్ప ఏమీ దొరకని పరిస్థితి. ఆ బియ్యం కూడా ఇంట్లో ఆరుగురుంటే నలుగురికి ఇస్తారు ఇద్దరికి ఇవ్వరు.

పదివేల పెన్షన్‌ ఇస్తాం

చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నాన్న హయాంలో 104, 108కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో వచ్చేవి. ఇప్పుడు ఆ నంబర్లకు ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదనే సమాధానం వస్తోంది. మూగ, చెవుడు పిల్లలకు ఆపరేషన్లు చేయడం లేదు. కేన్సర్‌ పేషెంట్లకు కేవలం రెండే రెండుసార్లు కీమోథెరపీ చేస్తున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు ఇవ్వడం లేదు. పేదల కోసం నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తా. రూ.1000 బిల్లు దాటిన ఏ ఆపరేషన్‌ అయినా ఆరోగ్యశ్రీ కింద డబ్బులు చెల్లిస్తాం. ఆపరేషన్‌ సమయంలో కుటుంబ యజమానికి డబ్బులిచ్చి ఆదుకుంటాం. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఎక్కడ ఆపరేషన్‌ చేయించుకున్నా ఇబ్బంది లేదు. తలసేమియాలాంటి దీర్ఘకాలిక వ్యాధి బాధితులకు రూ.10వేల పెన్షన్‌ ఇస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *