వసతుల లేమి.. సమస్యలతోనే చెలిమి..

Date:13/02/2018
మహబూబ్‌నగర్ ముచ్చట్లు:
ప్రజా ఆరోగ్యం కోసం తెలంగాణ సర్కార్‌ పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరచి వైద్యం అందరికీ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు నిధులు వెచ్చిస్తోంది. అయితే ఇదో పార్శ్వం అన్నట్లుగా పలు ప్రభుత్వాసుపత్రుల్లో సమస్యలు ఎక్కడివక్కడే ఉంటున్న ఉందంతాలు వెలుగులోకి వస్తున్నాయి. భారీగా నిధులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోందని మహబూబ్‌నగర్ ప్రాంతవాసులు వాపోతున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రుల్లో సమస్యలు తిష్ఠవేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొన్నింటిలో కనీసం అవసరాలు తీర్చుకునేందుకు మూత్రశాలలు సైతం సరిగ్గా లేని పరిస్థితి ఉందని అంటున్నారు. స్థానిక రాజకీయాల నేపథ్యంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు కూడా వైద్యాధికారులు వెనుకడుగు వేస్తున్నారని చెప్తున్నారు. దీంతో ప్రభుత్వ నిధులు బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.ఆసుపత్రుల్లో సమస్యలు ఎక్కడివక్కడ ఉన్నట్లు నీతిఆయోగ్‌ ఆరోగ్య నివేదిక వివరాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా చొరవ తీసుకొని అధికారులు  సమావేశాలు ఏర్పాటు చేసి అభివృద్ధి నిధులు ఖర్చు చేయకపోతే ఇబ్బందులు తొలగిపోవని నివేదిక తేల్చి చెప్తోంది.  వాస్తవానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆస్పత్రుల అభివృద్ధికి ఏటా నిధులు ఇస్తోంది సర్కార్. ప్రతి ఏడాది రూ.1.75 లక్షలు అందిస్తోంది. గత ఏడాది విడుదల చేసిన నిధుల్లో రూ.1,60,89,504 ఇంకా మిగులు ఉండడం అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయనడానికి నిదర్శనం. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతే నడుస్తోంది. నిధులు ఖర్చు చేయకుండా బ్యాంకుల్లో నిల్వ ఉంచుతున్నారు. ఈ ఏడాది మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అభివృద్ధి నిధులను విడుదల చేశారు. వనపర్తి జిల్లాకు సంబంధించి ఇంకా విడుదల చేయాల్సి ఉంది. వైద్యాధికారులు స్పందించి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించకపోతే మాత్రం నిధులు మంజూరై బ్యాంకుల్లో చూసుకోవడానికే ఉండిపోయే ప్రమాదం ఉందని అంతా అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచేందుకు కృషి చేయాలని అంతా కోరుతున్నారు.
Tags: Property deprivation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *