Radio jacilla ... maja?

రేడియో జాకీలా… మజాకా?

Date: 04/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 దేశంలో ఎఫ్‌.ఎం రేడియోల వాడకం పెరిగిన తర్వాత రేడియో జాకీలకు డిమాండ్‌ బాగా పెరిగింది. అమెరికా, తదితర పాశ్చాత్య దేశాల్లో 15 సంత్సరాల క్రితమే ఎఫ్‌.ఎం.రేడియోల ద్వారా రేడియో జాకీలు పాపులర్‌ అయ్యారు. ఇండియాలో ఇంచుమించు 2002 నుండి ఎఫ్‌.ఎం.రేడియోలు ప్రజాదరణ పొందడం మొదలయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో ఎఫ్‌.ఎం. రేడియో ప్రేక్షకుల సంఖ్య కోట్లలో ఉంది ఎఫ్‌.ఎం. రేడియోల్లో ఒకటైన రేడియో మిర్చి అత్యంత ప్రజాదరణ పొందింది. ఎఫ్‌.ఎం. రేడియోల్లో కీలకమైన ఉద్యోగం రేడియో జాకీ. రేడియోజాకీ అంటే కొత్తగా ఏర్పడ్డ ఉద్యోగం కాదు. గతంలో ఆకాశవాణిలో (ఆలిండియా రేడియో ) అనౌంన్సర్లు ఉండేవారు. అలాగే యాంకర్లు ఉండేవారు. ఈ ఉద్యోగాల్లోంచి కొత్తగా రూపాంతరం చెందిందే రేడియో జాకీ. ఎఫ్‌.ఎం. రేడియో అంటే కేవలం ఆడియో కార్యక్రమాలను వినడే తప్ప చూసే పద్దతి కాదు. టీ.వీ ఛానల్స్‌లను ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడుతున్నప్పటికీ, ఇంకా రేడియో కార్యక్రమాలు వినే శ్రోతలు రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో ఇది మరీ ఎక్కువ. అలాగే తాజాగా ఎఫ్‌.ఎం. రేడియోలు నగరాలలో కూడా బాగా పాపులర్‌ అయ్యాయి. ఏ ఎఫ్‌.ఎం. రేడియో అయినా నిరంతరం శ్రోతలను అలరించాలంటే రేడియో జాకీ అవసరం. రేడియో జాకీ లేని ఎఫ్‌.ఎం. రేడియో ఉండనే ఉండదు. ప్రతి ఎఫ్‌.ఎం. రేడియోలోను ఎప్పటికప్పుడు కొత్తగా రేడియో జాకీలను తీసుకుంటూనే ఉంటారు. రేడియో జాకీకి డిగ్రీ ప్రధాన అర్హత. అయితే దీనికంటే ముందు చక్కగా మాట్లడటమే అసలైన అర్హత. చకచకా మాట్లాడాలి. సందర్భాన్నిబట్టి సందర్భోచితంగా మాట్లాడాలి. హాస్యం, విషాదం ఇలా ఏదైనా అప్పటికప్పుడు గొంతులో పలికించ గలగాలి. చక్కటి సాంఘిక, రాజకీయ, సామాజిక, ఆర్ధిక అవగాహన కలిగుండాలి. వర్తమాన అంశాల్లో ప్రతి దాంట్లో కొద్దిగానైనా అవగాహన కలిగి ఉండాలి. శ్రోతలతో ముఖాముఖి సంభాషణల్లో వారి వయస్సునుబట్టి, వారి అభిరుచులను గ్రహించి మాట్లాడాలి. ఇంటర్‌ వరకు చదివినా, పైన పేర్కొన్న లక్షణాలుంటే, రేడియో జాకీగా అవకాశం లభిస్తుంది. నిరంతరం శ్రోతలను ఆకట్టుకోవడమే రేడియో జాకీ బాధ్యత. ప్రోగ్రామ్స్‌ ఇన్‌ ఛార్జి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వివిధ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఉండాలి. ప్రతి రేడియో జాకీ ఖచ్చితంగా 8 గంటల షిప్ట్‌ పనిచేయాల్సి ఉంటుంది. అవసరాన్నిబట్టి రేడియో జాకీ స్క్రిప్టును కూడా రాసుకోవాల్సి ఉంటుంది. వివిధ రాకాల లైవ్‌ ప్రోగ్రాముల్లో ధారాళంగా మాట్లాడాల్సి ఉంటుంది. తనకంటూ సొంత బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పరచుకోవడం రేడియో జాకీ బాధ్యత. ఇతరులను అనుకరించకుండా సొంత స్టైల్లో మాట్లాడాలి. ఎప్పటికప్పుడు స్పీచ్‌ మాడ్యులేషన్‌ లో మార్పులు చేసుకోవాలి. అలాగే ఎప్పుడూ ఒకే విధంగా మాట్లాడితే శ్రోతలు బోర్‌ గా ఫీలయ్యే అవకాశం ఉంది. కాబట్టి గొంతులో మాధుర్యాన్ని పెంపొందించుకోవాలి. నిరంతరం శ్రోతలను అలరించే రేడియోజాకీలకు మంచి జీత భత్యాలుంటాయి. ఎలాంటి ఎఫ్‌.ఎం.రేడియో స్టేషన్‌ లోనైనా ప్రారంభజీతం రూ.10,000/- ఉంటుంది. దశల వారీగా ఇది పెరుగుంతుంది. నాలుగైదేళ్ళు అనుభవం సాధించిన రేడియో జాకీలకు నెలకు రూ.30,000/- దాకా జీతం ఇస్తారు. పని సామర్ధ్యాన్ని బట్టి రెండేళ్ళలోనే నెలకు రూ.25,000/- జీతం ఆర్జించే జాకీలున్నారు. ఈ రంగంలో ప్రమోషన్లంటూ పెద్దగా ఉండవు. అయితే రేడియో జాకీగా రాణించిన అభ్యర్థులు తర్వాత దశల్లో టీ.వీ ఛానళ్లలో యాంకర్లుగా స్థిరపడుతున్నారు. రేడియో జాకీలకు మంచి డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో కొత్తగా మరో ఐదు ఎఫ్‌.ఎం. స్టేషన్లు (2010 ఆఖరు నాటికి) రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని ఆలిండియా రేడియోలో కూడా అవకాశాలున్నాయి. మరోపక్క రేడియో జాకీగా ఏడాది పనిచే?స్తే టీ.వీ.ఛానల్స్‌లో అవకాశాలుంటాయి.

సరళీకృత ఆర్ధిక విధానాల నేపథ్యంలో సరికొత్త ఉద్యోగాలు:

సరళీకృత ఆర్ధిక విధానాలు వేగంగా అమలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో అనేక కొత్తకొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, టెలీ కమ్యూనికేషన్‌, ఇన్సూరెన్స్‌ లాంటివి ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి విస్తరించాయి. అలాగే సేవల రంగంలో టెలికాలర్స్‌ కూడా వివిధ ప్రైవేట్‌ కంపెనీలలో ఎక్కువ సంఖ్యలో వున్నారు. ఇప్పటివరకూ హిందీ, ఇంగ్లీష్‌ లకే పరిమితమైన టెలీకాలర్స్‌ ఇప్పుడు ప్రాంతీయ భాషల్లోకి కూడా వస్తున్నారు. తెలుగులో లేడీ టెలికాలర్స్‌ కు ఇప్పుడు రాష్ట్రంలో మంచి డిమాండ్‌ వుంది. తెలుగులో లేడీ టెలికాలర్స్‌ అవసరం ఇప్పుడు బాగా ఏర్పడింది. రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో వివిధ వ్యాపారాలు బాగా విస్తరించాయి. బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, టెలికమ్యూనికేషన్స్‌, వైద్యం, టెక్స్‌ టైల్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ప్రైవేట్‌ కంపెనీలు కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాధిస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో తమ ఉత్పత్తులకు మించి డిమాండ్‌ వుండాలంటే తెలుగులో లేడీ టెలికాలర్స్‌ అవసరమని గుర్తించాయి. ఇన్సూరెన్స్‌ కంపెనీ పాలసీలు, బ్యాంకులు అందించే వివిధ డిపాజిట్‌ పథకాలు, హోమియోపతి, ఆయుర్వేదం కంపెనీల మందుల టెలికమ్యూనికేషన్‌ కంపెనీల సెల్‌ ఫోన్‌ సర్వీసులు, వివిధ ఎలక్ట్రానిక్‌ కంపెనీల ఉత్పత్తులు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలంటే లేడి టెలికాలర్స్‌ అవసరం. లేడి టెలికాలర్స్కు ప్రత్యేక అర్హతలంటూ లేవు. కనీసం ఇంటర్‌ పాసై ఉండాలి. దీనికంటే ముందు తెలుగు బాగా మాట్లాడగలిగి వుండాలి. ఉచ్ఛారణ బాగుండాలి. కస్టమర్‌ చెప్పే విషయాలను ఓపికగా వినగలిగే లక్షణాలుండాలి. లేడీ టెలికాలర్స్‌ కు కీలకమైన బాధ్యతలంటూ వుండవు, కానీ కస్టమర్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఖచ్చితంగా కంపెనీకి తెలియజేయాలి. ప్రతిరోజూ కంపెనీకి సంబంధించిన ఉత్పత్తుల గురించి కస్టమర్లకు ప్రచారం చేయాలి. తాను ప్రచారం చేసిన ఉత్పత్తుల గురించి కస్టమర్లు ఎలా ఫీలయ్యారో, ఎలాంటి అభిప్రాయాలు చెప్పారో నమోదు చేసుకోవాలి. ప్రతిరోజూ డైలీ షెడ్యూల్‌, డైలీ రిపోర్ట్‌ తయారు చేసుకోవాలి. టీం లీడర్‌ ఆదేశాల ప్రకారం మార్కెటింగ్‌ టెక్నిక్స్‌ ఫాలో కావాలి. లేడీ తెలుగు టెలీకాలర్స్‌ కు మంచి జీతభత్యాలుంటాయి. ఓ మోస్తరు కంపెనీలలో ప్రారంభజీతం నెలకు రూ.8,000 లు ఉంటుంది. పెద్దపెద్ద కంపెనీలలో అయితే ప్రారంభజీతం రూ.12,000 లు ఉంటుంది. దశలవారీగా పెరుగుతుంది. లేడీ టెలికాలర్స్‌ (తెలుగు)కు ఇప్పుడు మంచి డిమాండ్‌ వుంది. గత ఆరునెలల నుంచి హెచ్‌.ఎస్‌.బి.సి, ఐసిఐసిఐ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌, జి.ఇ లాంటి సంస్థలు తరచుగా తెలుగు లేడీ టెలికాలర్స్‌ పోస్టులు భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ లోనే ఎక్కువ డిమాండ్‌ వుంది. విజయవాడు, విశాఖపట్నంలలో ఇప్పుడిప్పుడే వివిధ కంపెనీలు బ్రాంచీలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాయి. 2010 ఆఖరునాటికి వివిధ బహుళజాతి కంపెనీలకు 10,000 తెలుగు లేడీ టెలికాలర్స్‌ అవసరమని ఓ అంచనా. తెలుగులో చక్కగా మాట్లాడగలిగి, సహనం, ఓపిక వున్న అమ్మాయిలకు ఇదొక మంచి కెరీర్‌ గా నిలుస్తుంది.

టెలికాం రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన:

దేశీయంగా ఐటి, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి ఉంటే దేశీయ టెలికాం రంగంలో మాత్రం భారీ సంఖ్యలో లక్ష ఉద్యోగాలకు అవకాశముంటోంది. పలు కొత్త కంపెనీలు టెలికాం రంగంలోకి ప్రవేశిస్తూ ఉండటం, ప్రస్తుతం ఉన్న కంపెనీలు పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలకు పూనుకోవడం, టెలికాం 3జి సర్వీసులు కూడా అందుబాటులోకి రానుండటంతో ఈ సంవత్సరంలో టెలికాం రంగంలో లక్షా 50వేల మందిని కొత్త ఉద్యోగాల్లోకి నియమించు కోవలస్సిన అవసరముంటుందని అంచనా. కేంద్రప్రభుత్వం కొత్తగా 120 టెలికాం లైసెన్స్‌లను ఇవ్వనుంది. దీంతో ఈ రంగంలో నిపుణుల కొరత ఏర్పడవచ్చునని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఫలితంగా అనుభవం ఉన్న వారి జీతాల్లో 30నుంచి 40 శాతం పెరిగినా ఆశ్చర్యపడనవసరం లేదని వీరు చెబుతున్నారు. దేశీయ టెలికాం రంగం మొత్తం మీద నేరుగా 50 వేలమందికి ఉద్యోగాలు కల్పించినుంది. ఇక పరోక్షంగా రిటైల్‌ ఔట్‌లెట్స్‌, ప్రిపెయిడ్‌ కార్డుల విక్రయం, టెలికాం టవర్ల నిర్మాణం వంటి కార్యకలాపాలు దాదాపు 15 లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పైగా, టెలికాం సంస్థలు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల వైపు దృష్టి సారిస్తుండటంతో మానవ వనరులకు డిమాండ్‌ మరింతగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రేడియోకు ప్రాధాన్యత పెరుగుతోంది!

రేడియోకు మళ్లీ ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రోతలు పెరుగుతున్నారు. టివి రాకముందు ఆ స్థానంలో రేడియో ఉండేది. తాజా వార్తలు, విజ్ఞాన, వినోద కార్యక్రమాలు రేడియోనే అందించేది. ఒకప్పుడు ఆకాశవాణిగా మాత్రమే తెలిసిన రేడియో ఇప్పుడు ఎఫ్‌ఎం రూపంలో వినండి వినండి ఉత్సాహంగా.. ఉల్లాసంగా అంటూ ఉరకలు వేస్తోంది. కార్యక్రమాల రూపకల్పనలో ఎఫ్‌ఎం రేడియో కొత్తపుంతలు తొక్కుతోంది. చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తోంది. 20, 22 సంవత్సరాల క్రితం టివి విస్తృతంగా వాడుకలోకి వచ్చే సమయంలో రేడియోకి ప్రాధాన్యత తగ్గిపోతోందని అందరూ అనుకున్నారు. రేడియోకి కాలం చెల్లిపోతోందన్నారు. అయితే ఆ సమయంలోనే విజయవాడ రేడియోస్టేషన్‌లో ఉద్యోగి ఒకరు రేడియోకి ఎప్పటికీ కాలం చెల్లదని చెప్పారు. రేడియోకి శ్రోతలు ఎప్పుడూ ఉంటారన్నారు. పొలం దున్నుతూ, నేత నేస్తూ, బుట్టలు అల్లుతూ, కుండలు చేస్తూ… కూడా రేడియో వినవచ్చునని ఆయన వివరించి చెప్పారు. టివికి ఆ అవకాశం లేదన్నారు. అందువల్ల రేడియో ఎప్పటికీ ఉంటుందన్నారు. ఇప్పుడు ఎఫ్‌ఎం రేడియో వినేవారిని చూస్తే ఆ మాటలు అక్షరాల నిజం అని స్పష్టమైంది. ఇంకా మరికొంతమంది శ్రోతలను కూడా కలుపుకోవచ్చు. వంట చేస్తూ, బస్సులో ప్రయాణిస్తూ కూడా రేడియో వినవచ్చు. వాహనాలలో ప్రయాణం చేస్తూ ఎఫ్‌ఎం రేడియో వినడం ఇప్పుడు చాలా మందికి ఒక అలావాటుగా మారింది. ఇష్టమైన పాటలతో పాటు బ్రేకింగ్‌ బాబూరావు, నవ్వుల డాన్‌, మమ్మీ-బేబీ లాంటి కార్యక్రమాలను శ్రోతలు ఆస్వాదిస్తున్నారు. కొత్తకొత్త కార్యక్రమాలతో ఎఫ్‌ఎం రేడియో శ్రోతలను అలరిస్తోంది. ఎఫ్‌ఎం రేడియో నగరాలకు విస్తరిస్తుంటే, కమ్యూనిటీ రేడియోలు మారుమూల గ్రామాలలో విస్తరిస్తున్నాయి. కమ్యూనిటీ రేడియో కేంద్రాల ద్వారా మాండలిక భాషలకు విస్తృత ప్రచారం లభిస్తోంది. గ్రామీణులకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ మార్కెట్‌ బాగా విస్తరించడంతో ఎఫ్‌ఎం రేడియోకు కలిసి వస్తోంది. మొబైల్‌ ఫోన్‌ ద్వారా రేడియో వినే వారి సంఖ్య 25 శాతంగా ఉంది. సెల్‌ఫోన్‌లో రేడియో ఫీచర్‌ పెట్టడం తప్పనిసరయింది. అంటే సెల్‌ రేడియోకున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. దీనికితోడు పోర్టబుల్‌ రేడియో రాబోతుంది. రేడియో పరికరాల ఉత్పాదక సంస్ధ ‘సిరియస్‌ ఎక్స్‌ఎం’ సరికొత్త పోర్టబుల్‌ రేడియోను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆధునిక సాంకేతిక పరిజా&ఙనంతో రూపొందించిన ఈ పోర్టబుల్‌ రేడియో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమవుతున్న రేడియో ఛానళ్ల కార్యక్రమాలను వినే అవకాశం ఏర్పడుతుంది. ఇంటర్నెట్‌, శాటలైట్‌ వ్యవస్థల ద్వారా ప్రసారాలను ఈ రేడియో స్వీకరిస్తుంది. దీంతో రేడియో శ్రోతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేడియో మార్కెట్‌ వాటా కూడా పెరుగుతుంది. 1993లో ప్రైవేటు రంగంలో ఎఫ్‌ఎం రేడియో శకం ప్రారంభమైంది. ఇండోర్‌ నగరంలో తొలి ప్రైవేటు రేడియో చానెల్‌ ప్రారంభమైంది. అంతకు ముందు వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలిండియా రేడియో మాత్రమే ఉండేది. 2000లో దేశవ్యాప్తంగా ప్రభుత్వం 108 ఎఫ్‌ఎం ఫ్రీక్వెన్సీలను వేలం వేసింది. ఆ తరువాత 2006లో రెండవ విడత మరికొన్ని ఫ్రీక్వెన్సీలను వేలం వేసింది. మూడవ విడత ఎఫ్‌ఎం వేలంలో 839 లైసెన్సులు ఇవ్వాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వచ్చే మూడేళ్లలో ఎఫ్‌ఎం రేడియో మార్కెట్‌ 2,300 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని భారత పరిశ్రమల సమాఖ్య(కాన్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ-సిఐఐ) అంచనా వేసింది. ప్రస్తుతం ఎఫ్‌ఎం రేడియో మెట్రో, ఇతర పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైంది. మూడో విడత ఎఫ్‌ఎం వేలంలో భాగంగా కొత్త లైసెన్సులు ఇవ్వడం పూర్తయితే ఎఫ్‌ఎం రేడియో మొత్తం 294 నగరాలకు, పట్టణాలకు విస్తరిస్తుంది. ప్రస్తుతం 245 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ఆదాయం మార్చితో ముగిసే 2013 ఆర్థిక సంవత్సరానికి 1,400 కోట్ల రూపాయలుగా ఉంటుందని సిఐఐ, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ అనే రీసెర్చ్‌ సంస్థలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ సంస్థల అంచనా ప్రకారం వచ్చే మూడేళ్లో ఎఫ్‌ఎం రేడియో మార్కెట్‌ 2,300 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. కొత్తగా స్టేషన్లకు లైసెన్సులు ఇస్తే ఇప్పటికే ఉన్న ఎఫ్‌ఎం రేడియో ఛానళ్లకు ఆదాయం కొంత తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే ఇది తాత్కాలికమేనని, భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందని సిఐఐ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం మన దేశ ప్రకటనల రంగంలో 4 శాతం ఎఫ్‌ఎం రేడియోకు వెళుతోంది. అంతర్జాతీయంగా చూస్తే ప్రకటనల్లో రేడియో వాటా 5 నుంచి 10 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో మున్ముందు ఎఫ్‌ఎం రేడియోకు ప్రకటనల దాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Tags: Radio jacilla … maja?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *