Rain

వాన జోరు

Date:11/07/2018
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉరకలెత్తుతోంది. ఇక భద్రాచలం వద్ద నది వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. రిజర్వాయర్లు సైతం నిండు కుండలా మారాయి. గోదావరిలో నీటి ఉధృతి పెరగడంతో జిల్లా రైతాంగం ఆనందంలో మునిగిపోయింది. ఖరీఫ్ పంటలకు సాగునీటి సమస్యలు కొంత అదుపులో ఉంటాయని కర్షకులు భావిస్తున్నారు. ఈ వర్షాలకు భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇదిలాఉంటే గోదావరిలోకి భారీగా వరదనీరు చేరడంతో తీర ప్రాంతాలను అప్రమత్తం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు చేశారు. దిగువన ఉన్న శబరి ఎగపోటు లేకపోవడంతో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ పరీవాహక ప్రాంతంలో వర్షం పడితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తున్నారు. దీంతో పునరావాసం కల్పనపై దృష్టిసారించారు. భద్రాద్రిలో ఇప్పటి వరకు పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించలేదు. త్వరితగతిన ఈ చర్యలు ప్రారంభించాలని అంతా కోరుతున్నారు. మరోవైపు ఇద్దరే గజ ఈతగాళ్లు ఉన్నందున ఈ తరుణంలో వీరి సంఖ్యను పెంచాలని విజ్ఞప్తిచేస్తున్నారు. అంతేకాక రామాలయానికి వచ్చే భక్తుల పుణ్యస్నానాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న డిమాండ్ సైతం వినిపిస్తోంది. స్నానఘాట్‌ల వద్దకు వరద చేరింది. దీంతో దుస్తులు మార్చుకునేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తిచేస్తున్నారు. భద్రాద్రి ప్రాంతంలోనే కాక ఖమ్మం జిల్లా సైతం వానలకు తడిసి ముద్దైంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 20శాతం అధికంగా కురిసినట్లు సమాచారం. మొత్తం 18 మండలాల్లో వర్షపాతం అధికంగా ఉండడంతో స్థాన రైతులు సాగుచర్యలు ముమ్మరం చేశారు. ఇదిలాఉంటే జూన్‌లోనే 183.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. కురవాల్సిన దానికంటే 74.3శాతం అధికంగా కురిసిందని అధికారులు తెలిపారు. ఇక జులైలో 105.8మి.మీల వర్షపాతం నమోదైంది. 20.6శాతం అధికంగా కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, బావులు నిండు కుండలను తలపిస్తున్నాయి.
Tags:Rain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *