రామనామమే సంజీవని : ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజులు
-భక్తిభావం పంచిన 6వ విడత బాలకాండ అఖండ పారాయణం
తిరుమల ముచ్చట్లు:
రామనామ స్మరణతో సకల శుభాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం సమకూరుతాయని, రామనామం సంజీవని లాంటిదని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య ప్రవా రామకృష్ణ సోమయాజులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు 6వ విడత బాలకాండ అఖండ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఇందులో 23 నుండి 26 సర్గల వరకు గల 134 శ్లోకాలను పారాయణం చేశారు. వేద పండితుల అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు భక్తిభావంతో వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు.ఈ సందర్భంగా ఆచార్య రామకృష్ణ సోమయాజులు మాట్లాడుతూ పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అన్నట్టు శ్రీరాముడు పుట్టినప్పటి నుండి రామరాజ్యంలో శాంతి వెల్లివిరిసిందన్నారు. కారణజన్ముడైన శ్రీరాముడు తన ప్రభావంతో లోకానికి యోగక్షేమాలను అందించారని చెప్పారు. బాల్యంలో శ్రీరాముని మహిహలను బాలకాండలో తెలుసుకోవచ్చన్నారు. కరోనా మూడవ వేవ్ నుండి పిల్లలు, పెద్దలు అన్ని వర్గాలవారు బయటపడాలని స్వామివారిని కోరుకుంటూ బాలకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలకాండలోని శ్లోకాలను, విషూచికా మహమ్మారి నివారణ మంత్రాలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోట్లాది మంది ప్రజలు పారాయణం చేయడం వల్ల అనంతమైన ఫలితం దక్కుతుందన్నారు.
రామానుజాచార్యులు శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు. ముందుగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పారుపల్లి రంగనాథ్ బృందం ఇతడే పరబ్రహ్మమిదియే రామకథ… అనే కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరామ రామ జయ జయ రామ… శ్రీరామనామం మనసా స్మరామి… అనే కీర్తనతో కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో టిటిడి వైఖానస ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags: Ramanamame Sanjeevani: Acharya Prava Ramakrishna Somayajulu