అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ప్రారంభం

శ్రీకాకుళం ముచ్చట్లు:
 
ప్రత్యక్ష దైవం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సూర్య జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలు సోమవారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామికి తొలి పూజ చేసే అవకాశం రావడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, రథసప్తమి రోజు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ప్రజలంతా సుఖసంతోషాలు,  ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నానన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కర్ఫ్యూ, కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలతో వారిని అనుమతిస్తున్నారు. రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుండే క్యూలో నిలబడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
 
Tags: Rathsaptami celebrations begin in Arasavalli

Natyam ad