Central point of cultivation of red crop

ఆర్మూర్ డివిజన్‌లో ఎర్ర జొన్న పంట సాగు

Date:01/01/2019
నిజామాబాద్ ముచ్చట్లు:
ఎర్రజొన్న పంట సాగుకు కేంద్ర బిందువుగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌లో ఆ పంట సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గిట్టుబాటు ధర విషయంలో విత్తన వ్యాపారులకు, పంట సాగు చేసే రైతులకు మధ్య దశాబ్ద కాలంగా వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో రైతులు ఆ పంట సాగు చేయాలంటేనే పక్కకు తప్పుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక సమయంలో ఈ డివిజన్‌లో యాభై వేల పైచిలుకు ఎకరాల్లో సాగయ్యే ఎర్రజొన్న పంట, ఈసారి సగానికి పైగా తగ్గిపోయింది. రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో 90దశకంలో ఎర్రజొన్న పంట సాగుకు నోచుకుంది. ఉత్తర భారతదేశంలోని హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పశుగ్రాసంగా పండించే పంటకు ఎర్రజొన్న విత్తనాలే వాడతారు. దీంతో ఈ ప్రాంత వ్యాపారులు రైతులకు ఎర్రజొన్న విత్తనాలు పంపిణీ చేస్తూ, చేతికంది వచ్చే పంట ఉత్పత్తులను ఢిల్లీ కేంద్రంగా జరిగే విత్తన వ్యాపారులకు పంపించేవారు. ఆరుతడి పంట కావడం, తక్కువ సమయంలోనే డబ్బులు చేతికందడంతో పాటు ప్రధానంగా ఖరీప్ పెట్టుబడులకు ఎంతో ఉపయుక్తంగా అవి ఉండటంతో ఆర్మూర్ డివిజన్ రైతాంగం ఎర్రజొన్న సాగుకు అధిక ప్రాధాన్యతనిచ్చింది.
అంకాపూర్ లాంటి గ్రామంలో దాదాపు పదికి పైగా విత్తన కేంద్రాలు ఏర్పాటు చేశారంటే ఎర్రజొన్న పంట ఏమేర సాగయ్యేదో అర్థం చేసుకోవచ్చు. అయితే గిట్టుబాటు ధర విషయంలో మొదటి నుండి కూడా పరిస్థితి కొంత వివాదాస్పదంగానే ఉండేది. నిబంధనల ప్రకారంగా విత్తనాలు పంపిణీ చేసే ముందు వ్యాపారులు రైతులతో ఒప్పందం కుదుర్చుకునేవారు. పంట చేతికందగానే విత్తనం ఇచ్చిన వ్యాపారులే రైతుల నుండి పంట ఉత్పత్తులను సేకరించేవారు. డబ్బులు కూడా త్వరగానే రైతులకందేవి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం సజావుగానే సాగేది. కొన్ని సందర్భాల్లో ఆ సమయంలో ఉన్న మావోయిస్టులు గిట్టుబాటు ధర విషయంలో కల్పించుకుని వ్యాపారులను హెచ్చరించిన సంఘటనలు కూడా జరిగాయి. క్వింటాలుకు మూడు వేల రూపాయల వరకు ధర పలికిన ఎర్రజొన్న బలహీనపడుతూ వచ్చింది. ఎనిమిది సంవత్సరాల క్రితం ఆర్మూర్‌లో ఎర్రజొన్న రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయడం, లాఠీచార్జ్, పోలీస్ కాల్పులకు కూడా దారి తీసింది.
ఆ సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుల నుండి ఎర్రజొన్నలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత విత్తన వ్యాపారులకు, రైతులకు మధ్య గిట్టుబాటు ధరపై ఒప్పందాలు కుదుర్చుకోవడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల వివాదాలు ప్రారంభమయ్యాయి. ఆ నేపథ్యంలోనే గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎర్రజొన్న సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గత సంవత్సరం కూడా విత్తన వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ప్రభుత్వమే క్వింటాలుకు 2300ల చొప్పున ధర చెల్లించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. అప్పటికే పంట విస్తీర్ణ శాతం పడిపోయింది.ఈసారి విత్తన వ్యాపారులు ఎవరు కూడా విత్తనాలను అందించేందుకు ముందుకు రాలేదు. పైగా గత సంవత్సరం మార్క్‌ఫెడ్ అధికారులు సేకరించిన ఎర్రజొన్నల నిల్వలే భారీగా ఉన్నాయని ఆ శాఖ అధికారులు ప్రకటించారు.
దీంతో పాటుగా వాటిని విక్రయిద్దామన్నా వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదని దానివల్ల మార్క్‌ఫెడ్‌కు 50కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆ సంస్థ చైర్మన్ లోక బాపురెడ్డి ఇటీవలే విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈసారి కూడా కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి అనుమతుల కోసం వేచిచూస్తున్నామని, అయితే ఎర్రజొన్న పంట సాగు చేసే ముందు వ్యాపారులతో గిట్టుబాటు ధరపై ఒప్పందం కుదుర్చుకున్నాకే రైతులు ఈ పంట సాగు దిశగా ఆలోచన చేయాలని ఆయన హితవు పలకడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఎటుచూసినా కనిపించే ఎర్రజొన్న పంట ప్రస్తుతం అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది. బాల్కొండ నియోజకవర్గంలో కేవలం 16వేల పైచిలుకు ఎకరాల్లోనే ఈ పంటను సాగు చేశారు. అది కూడా రైతుల వ్యక్తిగత నిర్ణయంపైనే ఆ మేరకైనా పంట సాగు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో ఎర్రజొన్న పంట సాగు గత వైభవంగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:Red sorghum cultivation in the Armor division

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *