తగ్గిన విత్తన భారం

Date:12/03/2018
నాగర్ కర్నూలు ముచ్చట్లు:
ఖరీఫ్ సీజన్ లో పత్తిని అధికంగా సాగు చేస్తుంటారు నాగర్ కర్నూలు రైతులు. కేవలం నాగర్ కర్నూలులోనే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్ పంటగా పత్తికి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో పత్తి విత్తనాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. డిమాండ్ తో పాటూ స్థానికంగా క్రయవిక్రయాలు జోరుగా సాగుతుంటాయి. ఈ ప్రాంతం నుంచి విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులు కూడా వస్తుంటారు. ప్రస్తుతం బీటీ-2 పత్తి విత్తనాల 450గ్రా. ప్యాకెట్ ధరను రూ.60 మేరకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పత్తి రైతులకు ఆర్ధిక భారం కొంత తగ్గినట్లైంది. ఇదిలాఉంటే పత్తి విత్తనాల ధర తగ్గడంతో దాదాపు 4 లక్షమంది రైతులకు లబ్ధి చేకూరినట్లైంది. గతేడాది పత్తి విత్తనాల అమ్మకాల ద్వారా ఉమ్మడి జిల్లాలో రమారమి రూ.102 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది కూడా పత్తి సాగు విస్తీర్ణం గతేడాదిలానే ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. దీంతో విత్తనాల రేటు తగ్గింపు రైతులకు కొంత ఊరటనిచ్చే అంశమే అని అంటున్నారు. మరోవైపు తగ్గిన ధరల వల్ల రూ.95 కోట్ల మేర కంపెనీలకు వ్యాపారం జరిగినా సుమారు రూ.8 కోట్ల వరకు రైతులకు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు.సాధారణంగా పత్తిసాగు చేసే రైతులు ఎకరాకు ఒక ప్యాకెటు విత్తనాలు (450 గ్రాములు) వాడాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తారు. రైతులు మాత్రం రెండు ప్యాకెట్ల వరకు వినియోగిస్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పదమూడు లక్షల ప్యాకెట్లు అవసరమవుతుందని అంచనా. ఇప్పటికే చిన్న, సన్నకారు, కౌలు రైతులు అప్పులు చేసి విత్తనాల ప్యాకెట్లు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. విత్తనాల ధర తగ్గడం ద్వారా ఇలాంటివారికి కొంత ఊరట కలిగినట్లే అని రైతు సంఘం నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం పత్తి విత్తనాలపై ధర తగ్గించడం రైతులకు ఊరట కలిగించే అంశమే అయినా.. ఇదే సమయంలో మార్కెట్లలోకి నకిలీ విత్తనాలు కూడా చెలామణిలోకి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అధికారులు నాసిరకం విత్తనాలను అరికట్టి, అంతటా తగ్గించిన ధరలకు విత్తనాలను విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
Tags: Reduced seed burden

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *