ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల రాజీనామా

Date:19/06/2018
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేసారు. ఈ మేరకు తనరాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన పరకాల తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. కొన్ని రోజులుగా చేస్తున్న నిందా ప్రచారంపై కలత చెందానని పరకాల తన లేఖలో పేర్కొన్నారు. తక్షణం రాజీనామా ఆమోదించాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. నవ్యాంధ్రప్రదేశ్  పునర్ నిర్మాణంలో పరకాల కీలక భూమిక నిర్వహించారు. విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారు. కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో నా ఉనికిని, మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారు.  నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు, రాజకీయ  ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ  ఆపాదించ పూనుకోవడం, వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి  ఆలోచనలకు తార్కాణమని లేఖలో పేర్కోన్నారు. నా కుటుంబం లోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి  ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోంది.   పరిణతి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్ధులై ఉండగలరనీ, వారి వారి అభిప్రాయాల పట్ల వారికున్న అంకిత భావానికి బాంధవ్యాలు అడ్డు రాలేవనే  ఇంగితం కూడా వీరికి భగవంతుడు ప్రసాదించకపోవడం దురదృష్టకరమని పరకాల లేఖలో రాసారు. నేను ప్రభుత్వంలో  కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు మీరు చేపట్టిన ధర్మపోరాట దీక్షమీదా, మీ చిత్తశుద్ధి మీదా నీలినీడలు పడకూడదని నా కోరిక.   నా వల్ల మీకూ, ప్రభుత్వ ప్రతిష్ఠకూ నలుసంతయినా నష్టం జరగరాదని నా దృఢ అభిప్రాయం.  అందుచేత నేను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నానని అన్నారు. మీ మీదా, ప్రభుత్వం మీదా బురదజల్లడానికీ, లేనిపోని ఆరోపణలు చెయ్యడానికీ నా పేరూ, నా కుటుంబ సభ్యుల పేర్లూ ఎవ్వరూ వాడుకోకూడదు.  గత నాలుగు సంవత్సరాలుగా మన రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యాన్ని కలుగ చేసినందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడనై  ఉంటానని లేఖను ముగించారు.
Tags:Resign from the post of government advisor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *