ఎవ్వరికి పట్టని ఆర్టీసీ

విజయవాడ ముచ్చట్లు:

ఎపిఎస్‌ఆర్టీసిని నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం పావులు కదుపుతోంది. ఆర్టీసి బస్సులను, సిబ్బందిని క్రమక్రమంగా తగ్గిస్తూ ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే అద్దె బస్సులను పెంచుతూ రెగ్యులర్‌ నియామకాలకు మంగళం పాడుతోంది. గత పదేళ్ల నుంచి ఒక్క రెగ్యులర్‌ నియామకాన్ని కూడా సంస్థ చేపట్టలేదు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో 12,800 బస్సులు, 64వేల మంది రెగ్యులర్‌ సిబ్బంది ఆర్టీసిలో ఉన్నారు. ప్రస్తుతం బస్సుల సంఖ్య 11,359, సిబ్బంది సంఖ్య 51వేలకు పడిపోయాయి. ఈ ఎనిమిదేళ్లల్లో సుమారు 1400 బస్సులు తగ్గగా అదే సమయంలో సుమారు 13వేల మంది సిబ్బంది పదవి విరమణ పొందారు. పదవి విరమణ పొందిన సిబ్బంది స్థానంలో గత పదేళ్లల్లో ఒక్క రెగ్యులర్‌ నియామకం కూడా జరపలేదు. 13వేల మంది సిబ్బంది స్థానంలో కేవలం 5వేల మందిని ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఆర్టీసి నియమించింది. దీంతో ఉన్న సిబ్బందిపైనే భారం పడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కండక్టర్లను తీసేసి టీమ్‌ మిషన్లతో డ్రైవర్లపై అదనపు భారం వేసింది. నిబంధనల ప్రకారం ప్రతి బస్సుకు 6 గురు సిబ్బంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 4.6శాతం మందే చేస్తున్నారు. మరోవైపు అద్దె బస్సుల శాతాన్ని క్రమక్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం అద్దె బస్సుల శాతం 20గా ఉంది. ఇటీవల 998 అద్దె బస్సులకు ఆర్టీసి టెండర్లు పిలిచింది. కొత్తగా తీసుకునే ఈ బస్సులతో కలుపుకుని అద్దె బస్సులు శాతం ఆర్టీసిలో 29శాతానికి పైగా పెరగనుంది. అద్దె బస్సులను కాకుండా సొంత బస్సులను తీసుకుంటే సుమారు 6వేల మంది సిబ్బంది సంస్థకు అదనంగా పెరిగే అవకాశం ఉండేది. రాష్ట్రప్రభుత్వం అద్దె బస్సులు పెంచుతూ, సిబ్బంది నియమకాలు చేయకపోతే ఆర్టీసి ప్రైవేటీకరణ అవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కారుణ్య.నియామకాలో కూడా అనేక షరతులను ఆర్టీసి విధిస్తోందని, దీనివల్ల కార్మికుల కుటుంబ సభ్యులు ఉద్యోగం పొందలేని పరిస్థితి ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 

Tags: RTC that does not belong to anyone

Post Midle
Post Midle
Natyam ad