ర‌ష్యా దాడిలో భార‌తీయ విద్యార్థి మృతిపై రష్యా విచారణ‌.

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
ర‌ష్యా చేసిన దాడిలో ఖార్కీవ్‌లో చ‌దువుకుంటున్న భార‌తీయ మెడిక‌ల్ విద్యార్థి న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ర‌ష్యా తెలిపింది. ర‌ష్యా దౌత్య‌వేత్త డెన్నిస్ అలిపోవ్ ఈ విష‌యాన్ని చెప్పారు. ఖార్కివ్ నేష‌న‌ల్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీలో న‌వీన్ నాలుగో సంవ‌త్సరం వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. బంక‌ర్ల‌లో త‌ల‌దాచుకున్న న‌వీన్ ఆహారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో మిస్సైల్ దాడి జ‌ర‌గ‌డంతో న‌వీన్ మృతిచెందాడు. షాపు బ‌య‌ట క్యూలైన్‌లో నిలుచుకున్న స‌మ‌యంలో అటాక్ జ‌రిగింది. స‌మీపంలో ఉన్న ప్ర‌భుత్వ బిల్డింగ్‌ను పేల్చిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. న‌వీన్ శేఖ‌ర‌ప్ప కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి చెబుతున్నాని, ఈ విషాదం ప‌ట్ల భార‌త ప్ర‌జ‌ల‌కు కూడా సానుభూతి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు అలిపోవ్ తెలిపారు. భార‌త ప్ర‌జ‌ల క్షేమం కోసం ఏదైనా చేయ‌డానికి ర‌ష్యా సిద్దంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఖార్కివ్‌తో పాటు యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భార‌తీయులను సుర‌క్షితంగా త‌ర‌లించాల‌ని ర‌ష్యా, ఉక్రెయిన్ రాయ‌బారుల్ని ఇండియా కోరింది.
 
Tags:Russia inquires into Indian student’s death in Russian attack

Natyam ad