Sagar Krishna delta

సాగర్‌ కృష్ణా డెల్టాలకు గడ్డుకాలం

Date : 21/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

రాష్ట్రం విభజన అనంతపురం లోయర్‌ కృష్ణా బేసిన్‌ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. డెల్టాలో లభించే నీరు గోరంత, అవసరాలు కొండత కావడంతో ప్రాంతాల మధ్య సిగపట్లు తప్పేలా లేవు. ఎగువ నుండి ఇన్‌ఫ్లో 50 శాతంకు పైగా పడిపోవడంతో ప్రాజెక్టుల భవిష్యత్‌ ప్రశ్నార్దకమవుతోంది. ముఖ్యంగా బేసిన్‌ చివరనున్న నాగార్జున సాగర్‌, కృష్ణా డెల్టాల మనుగడకు ప్రమాదఘరటికలు మోగుతున్నాయి. మరోవైపు ఈ బేసిన్‌ మున్ముందు ఎడారిగా మరనుందని, అభివృద్ది పధం ఎంతో కాలం కొనసాగదనే నిపుణులు హెచ్చరికలు కలవరం కలిగిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపధ్యంలో లోయర్‌ కృష్ణా బేసిన్‌ను వివాదాలు చుట్టుమడుతున్నాయి. నీటి వాటాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే జుట్టు ఉంటే ఏ కొప్పు అయినా పెట్టుకోవచ్చన్నట్లు అసలు నీటి లభ్యతే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ మనకు కేటాయించిన 800 టిఎంసిలలో రాష్ట్రంలో లభించేది 350 టిఎంసిలు మాత్రమే. ఈ నేపధ్యంలో మన జలాశయాల పరిస్థితి ఇప్పటికే ఆందోళన కలిగి స్తుంది. నిర్దిష్ట కేటాయింపులున్నప్పటికీ, ఎగువ రాష్ట్రాలలో వినియోగం పెరుగుతున్నకొద్ది మన జలాశయాలు వట్టిపోతున్నాయి. వరదలొచ్చి కిందికి నీరు వదిలేస్తేనే మన ప్రాజెక్టులు నిండి, పంటలు పండే దుస్థితి దాపురించింది. కరువు కమ్ముకొస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఊహించడానికే భయానకంగా ఉంది. వర్షాబావ పరిస్థితులెదుర్కొన్న 2001-2004 సంవత్సరాల మద్య శ్రీశైలంలోకి ఇన్‌ఫ్లో 10 బిలియన్‌ క్యూబిక్‌ విూటర్లు(బిసిఎం) కు తగ్గిపోయింది. గత మూడేళ్ళు నాగార్జున సాగర్‌ పరిధిలో క్రాప్‌ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. నాగార్జున సాగర్‌ క్యాంప్‌ ఆఫీస్‌ డేటా ప్రకారం 1999 సంవత్సరం తరువాత రెండు కాల్వల పరిధిలో ఆయుకట్టు ఆహారదాన్యాల సాగునుండి ఆరుతడి పంటలవైపు వేగంగా మార్పు చెందింది. ఈ మార్పు ప్రభావం ఎడమ కాల్వ పరిధిలో తీవ్రంగా ఉంది. 1998-2003 మధ్య కాలంలోనే ఎడమ కాల్వ పరిధిలో 36 శాతం, కుడి కాల్వ పరిధిలో 25 శాతం ఆయుకట్టు ఆరు తడి పంటలకు మారిపోయింది.ఈ రెండు కాల్వలకు ఏడాదికి 5.2 బిసిఎం చొప్పున (ట్రిబ్యునల్‌ కేటాయింపు 3.8బిసిఎం) ఉండే నీటి కేటాయింపు, 2003, 2004 సంవత్సరాలకు వచ్చేసరికి 1.2 బిసిఎంకు క్షీణించడం ఈ పరిస్థితికి దారితీసింది. గతంలో జూన్‌ రెండో వారంలో ఉండే నీటి విడుదల ఇప్పుడు ఆగష్టుకు మారింది. ఏప్రిల్‌ వరకు తెరిచి ఉండే కాల్వలు ఫిబ్రవరిలోనే మూసేయాల్సివస్తోంది. సాగర్‌ పరిస్థితే ఇలా ఉంటే, దానిపై ఆధారపడ్డ కృష్ణా డెల్టాకు ఊపిరాడటం లేదు. ప్రాజెక్టులు సంక్షోభంలో చిక్కుకోవడం, విభజన ఉద్యమాల నేపధ్యంలో 1885 నుండి ఆయుకట్టు సాగులో ఉన్న కృష్ణాడెల్టాకు అసలు నీటి విడుదలే వివాదాస్పదమవుతోంది. గతేడాది జూన్‌,జూలై నెలల్లో కృష్ణా డెల్టాకు నీరు విడుదల ఏకంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌కే తలనొప్పిగా మారింది. సాగర్‌ నీటి మట్టం 511.12 అడుగుల వద్ద నీటి విడుదలకు కిరణ్‌ సర్కారు నిర్ణయించడం పెద్ద వివాదానికి, రాజకీయ ఆందోళనలకు దారితీసింది. గత పదేళ్ళలో డెల్టాకు కొన్ని సార్లు అరకొరగా నీరు విడుదల చేయగా, మూడేళ్ళు అసలు నీటి విడుదలకే నోచుకోలేదు. వాస్తవానికి 2000 సంవత్సరం నాటికి కృష్ణా డెల్టాకు నీటి మళ్ళింపులు సరాసరి ఏడాదికి 6.5 బిసిఎం(ట్రిబ్యునల్‌ కేటాయింపు 5.1 బిసిఎం) ఉండేది. కాని 2003 వచ్చేసరికి 2.7 బిసిఎంకు దిగజారింది. ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లో ఇది 53 శాతం మాత్రమే.భవిష్యత్‌లో సాగర్‌కు, కృష్ణా డెల్టాకు నీటి లభ్యత అతి తక్కువ ఉండబోతుందని నీటిపారుదల రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థిల్లో రాష్ట్ర విభజన పరిణామాలు ఎలా ఉండబోతున్నాయోననే ఆందోళన రైతాంగాన్ని పీడిస్తోంది. సాగర్‌,డెల్టాలు బేసిన్‌ దిగువలో ఉన్నందున, రాష్ట్రం విడిపోతే మిగులు జలాల ప్రయోజనం ఏమేరకు ఉంటుందనే అంశం సైతం ఇప్పటికే వివాదాస్సదంగా మారింది. బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ననుసరించి 2,578 టిఎంసిలకు మించి వస్తేనే మనకు మిగులు జలాలు. కాని ఎగువ రాష్ట్రంలో నీటి వినియోగం పెరిగే కొద్ది మనకు మిగులు జలాలు తగ్గిపోతున్నాయి. గతంతో ప్రకాశం బరాజ్‌నుండి 500 టిఎంసిలు సముద్రంలోకి విడుదలకాగ, గతేడాది 55 టిఎంసిలు మాత్రమే విడుదల కావడం గమనార్హం. ఎగువ రాష్ట్రాల్లో వినియోగం పెరగడమే దీనికి కారణం. దీనికితోడు శ్రీశైలం ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మద్య అనుమానాలకు, అపోహలకు దారితీస్తున్నాయి. కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రం మిగులు జలాలు లేదా వరద నీరు వీటికి మళ్ళిస్తే తమ గతేం కాను అని సాగర్‌, డెల్టా రైతాంగంలో ఆందోళన చెందుతోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన లోయర్‌ కృష్ణా బేసిన్‌ మూతపడే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గత 50 ఏళ్ళ పరిణామాలు దీనికి కారణమవుతున్నాయి. లోయర్‌ బేసిన్‌ 98.5 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. జూరాల,శ్రీశైలం, నాగార్జునసాగర్‌,కృష్ణాడెల్డాలకు ఇది జీవనాదారం. వర్షాలు ఆలస్యమైనా,తగినంత కురవకపోయినా మొత్తం పరిస్థితి తల్లకిందులవుతుంది. ఎగువ రాష్ట్రాలు నీటిని బిగపడుతుండటంతో ఇన్‌ఫ్లో సగానికి పైగా పడిపోయింది. వరదలొచ్చి కిందికి నీరు వదిలేస్తేనే మనకు జలకళ. ప్రభుత్వ లెక్కల ప్రకారమే అప్పర్‌ బేసిన్‌ నుండి ఇన్‌ఫ్లో 1955-65సంవత్సరాలలో 53,971 మిలియన్‌ క్యూబిక్‌ విూటర్లు (ఎంసిఎం)ఉండగా, 1996-2000 మద్య 25,776 ఎంసిఎం, 200-2001 మద్య 10,053 ఎంసిఎంకు పడిపోయింది. కేంద్ర జలసంఘం(సిడబ్ల్యుసి) లెక్కల ప్రకారం 2004 లో డెల్టా ప్రారంభం వద్ద రికార్డు స్థాయిలో నదీ ప్రవాహం మూడోవంతుకు పడిపోయింది. 2001-2004 నాటికి మరింత క్షీణించి ఏడాదికి 57.2 బిలియన్‌ క్యూబిక్‌ విూటర్లకు(బిసిఎం) పరిమితమయ్యింది. ఇది 1955-65 మద్య లభించిన నీటిలో సగం మాత్రమే. భవిష్యత్‌లో కరువు కమ్ముకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పేందుకు నిపుణులు దీనిని ప్రామాణికంగా తీసుకున్నారు. కేంద్ర జలసంఘం ప్రకటించిన ఇంటిగ్రేటెడ్‌ హైడ్రలాజికల్‌ డేటా 2012 ప్రకారం విజయవాడ వద్ద నీటి ప్రవాహం 2001-2002 లో కేవలం 374 మిలియన్‌ క్యూబిక్‌ విూటర్లు(ఎంసిఎం), 2002-2003 లో 333 ఎంసిఎం, 2003-2004లో 658 ఎంసిఎం నమోదు అయ్యింది. కాని 2004-2005లో 36,034 ఎంసిఎం నమోదయ్యింది. మరల 2007-2008లో 9,757 ఎంసిఎంకు పడిపోయింది. అంటే వరదలొస్తే తప్ప లోయర్‌ బేసిన్‌ అతలాకుతలమవడం ఖాయమనే విషయం స్పష్టంగా తేలిపోతుంది. బేసిన్‌ మూతపడే ప్రమాదముందనడానికి నిపుణులు చూపుతున్న మరో ఆధారం ప్రకాశం బరాజ్‌ నుండి నదిలోకి విడుదల అవుతున్న నీటి పరిమాణం. గతంలో 57 బిసిఎం నీరు డిశ్చార్జికాగ 2001-2004లో 0.75బిసిఎంకు క్షీణించింది. అంటే దాదాపు నీటి డిశ్చార్జ్‌ లేనట్టే. ఈ నేపధ్యలో బేసిన్‌ దిగువ ప్రాంతాల ప్రయోజనాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags : Sagar Krishna delta 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *