Sankranthi is the Vice-President

సొంతూరిలో సంక్రాంతి జరుపుకోనున్న ఉపరాష్ట్రపతి

Date: 10/01/2018

నెల్లూరు ముచ్చట్లు:

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంతూరులో సంక్రాంతి పండుగ చేసుకోబోతున్నారు. బుధవారం నుంచి ఆరు రోజులపాటు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. సంక్రాంతికు స్పెషల్ అతిధిగా క్రికెటర్ ధోనీ కూడా రానున్నారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో భద్రత ఏర్పాట్లు చేపడుతున్నారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తరువాత రెండవ సారి వెంకయ్యనాయుడు నెల్లూరుకి రానున్నారు. ఉపరాష్ట్రపతి హోదాలో మొదటిసారి సంక్రాంతి పండుగని సొంత ఊరిలోనే జరుపుకోనున్నారు. గతంలోనూ సంక్రాంతి పండుగకి సొంతూరు రావడం ఆయనకి ఆనవాయితీ.
వెంకయ్యనాయుడు వస్తున్నారని తెలిసి బంధువులు, గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నెల్లూరు నగరవాసులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకి ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకి రేణిగుంటకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకి చేరుకుని, పద్మావతి గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ఈ నెల 11వ తేది తెల్లవారుజామున 5 గంటలకి శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. అదే రోజు 12 గంటలకి తిరుపతికి చేరుకుని… హెలికాఫ్టర్‌లో నెల్లూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌కి వెళ్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టుకి చేరుకుని అక్కడే బస చేస్తారు. ఈ నెల 12న ఉదయం 8 గంటలకి స్వర్ణభారత్ ట్రస్టు నుంచి బయలుదేరి నెల్లూరు సర్ధార్ పటేల్ నగర్ లోని జపాన్ హౌస్‌కి చేరుకుంటారు. అక్కడ డెలిగేట్స్‌తో సమావేశం అవుతారు. తర్వాత వెంకటాచలంలోని అక్షర విద్యాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 2.45గంటలకి స్వర్ణభారత్ ట్రస్టులో జరిగే సంక్రాంతి సంబరంలో పాల్గొంటారు. ఈ సంబరాలకు క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోని, గవర్నర్ నరసింహన్ తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈ నెల 13వ తేదిన స్వర్ణభారత్ ట్రస్టులో జరిగే మెడికల్ క్యాంపు, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం కార్యక్రమాల్లో వెంకయ్య పాల్గొంటారు. అనంతరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో సమావేశం అవుతారు. 14, 15 తేదీల్లో వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు, సొంతూరైన చవటపాళెం, శ్రీరామపురంలలో సంక్రాంతి పండుగ జరుపుకోవడంతోపాటు బంధువులు, గ్రామస్థులతో సమావేశవుతారు. ఈ నెల 16వ తేది ఉదయం 9.20 గంటలకి స్వర్ణభారత్ ట్రస్టు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి కనపర్తిపాడుకి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో చెన్నై ఎయిర్ పోర్టుకి వెళుతారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర భద్రత విభాగాలు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టాయి.

Tags: Sankranthi is the Vice-President

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *