Santa Sinha, the arrow on the child labor system

బాల కార్మిక వ్యవస్థపై బాణం ఎక్కుపెట్టిన శాంతా సిన్హా

Date: 06/01/2018

నెల్లూరు ముచ్చట్లు:

ఆచార్యిణి శాంతా సిన్హా… సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త. బాల కార్మికులపై చేసిన కృషికి రామన్‌ మెగస్సే అవార్డు గ్రహీత. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌కు చైర్‌ పర్సన్‌. పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్‌ స్థాపకురాలు. శాంతాసిన్హా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. జనవరి 7వ తేదీ 1950 సంవత్సరంలో పుట్టారు. బాల్యంలో సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ హైస్కూలులోనూ, కీస్‌ హైస్కూల్లోనూ విద్యాభ్యాసం చేశారు. 1972 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో పీజీ చేసారు. 1976లో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరారు. 1981 సంవత్సరంలో ఎంవీ ఫౌండేషన్‌ (మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్‌) స్థాపించారు. మొదట్లో సామాజిక మార్పుకోసం, పేదలకు విద్యనందించే దృక్ఫథంతో ఆరంభించిన ఈ ఫౌండేషన్‌ 1991 తర్వాత బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం వీధిబాలలకు విద్యాబుద్ధులు చెప్పించింది. ఈ సంస్థలో 80 వేలకు పైగా స్వచ్ఛందసేవకులు ఉన్నారు. శాంతా సిన్హా విద్యావంతులైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె పితామహుడు మామిడిపూడి వెంకటరంగయ్య గొప్ప విద్యావేత్త, సమాజవాది, చరిత్ర ఆచార్యుడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో వినూత్న విద్యావిధానానికి కృషిచేసిన సంస్కర్త. తండ్రి మామిడిపూడి ఆనందం చార్టెడ్‌ ఎకౌంటెంట్‌. ఆయన రెండుసార్లు రాజ్యసభ సభ్యుడుగా ఎంపికయ్యారు. శాంత సోదరుడు నాగార్జున ఐఎయస్‌ ఆధికారిగా పదవిలో ఉండగానే 47వ ఏట మృతి చెందాడు. శాంతా సిన్హా 60 దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో తనకు కాబోయే భర్త అజొయ్‌ కుమార్‌ను కలిసింది. ఆ తరువాత శాంతా సిన్హా ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి చేసే రోజుల్లో ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అజొయ్‌ కుమార్‌ తీవ్రవాద భావజాలం వల్ల జైలుకు వెళతాడన్న భయం, ఆయన కుటుంబం అతివాద ఉద్యమ నేపథ్యం కలదన్న భావనతో శాంతా సిన్హా కుటుంబం అందుకు అంగీకరించలేదు. అజొయ్‌ కుమార్‌ తండ్రి బిజయ్‌ కుమార్‌ సిన్హా భగత్‌ సింగ్‌ అనుయాయి, బ్రిటీషు వారిపై బాంబు విసిరాడన్న అభియోగంపై జీవతకాల శిక్ష అనుభవించాడు. ఆయన తల్లి రాజ్యం సిన్హా కూడా జాతీయవాది. 1972 డిసెంబరు 3న, పెద్దలను వ్యతిరేకించి రహస్యంగా పెళ్ళి చేసుకున్న దంపతులకు 1973లో పెద్ద కూతురు సుధ జన్మించడంతో పుట్టింటివారితో తిరిగి సంబంధాలు నెలకొన్నాయి. 1978లో రెండవ కూతురు దీప జన్మించింది. ఆ తరువాత సంవత్సరం అకస్మాత్తుగా అజొయ్‌ మూర్ఛ వచ్చి, మెదడులో అంతఃస్త్రావంతో మరణించాడు. కొన్నాళ్ళు కూతుళ్ళతో పాటు అజొయ్‌ తల్లితండ్రుల వద్ద నివసించిన శాంతా సిన్హా, చివరకు మారేడ్‌పల్లిలోని పుట్టింటికి చేరింది. 1999లో పద్మశ్రీ అవార్డు సొంతం చేసుకున్న శాంతా సిన్హా 2003లో రామన్‌ మెగసేసే అవార్డును, అంతర్జాతీయ విద్యా సంస్థ ఆల్బర్ట్‌ శంకర్‌ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

కాకలు దీరిన కవిగా ఘనతికెక్కిన ఎలకూచి…

నెల్లూరు ఎలకూచి బాల సరస్వతి జన్మతః పాలమూరు జిల్లా వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం పాలమూరు జిల్లాకు చెందిన జటప్రోలు సంస్థానములోనే. నెల్లూరు జిల్లా పొదిలి తాలుకాలోని ఎడవిల్లి అగ్రహారం వీరి జన్మస్థానం. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. వీరు కొంత కాలం విజయనగరంలో గడిపారు. తరువాత తెలంగాణలోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి దగ్గర కొంత కాలం పనిచేసి, సురభి ముమ్మడి మల్లానాయుడి కాలంలో జటప్రోలు సంస్థానానికి చేరుకోని వారి కుమారుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు. ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు ఎలకూచి వెంకటకృష్ణయ్య. బాల్యంలోనే అసమాన్యమైన ప్రతిభా పాండిత్యం చూపడం వలన వీరికి బాల సరస్వతి అను బిరుదు వచ్చింది. ఆ బిరుదునామమే వీరి వ్యవహార నామంగా స్థిరపడిపోయింది. వీరి తండ్రి కృష్ణయ్య. తెలుగు సాహిత్యంలో మహామహోపాధ్యాయగా గణతికెక్కిన తొలి సాహితీవేత్తగా బాలసరస్వతికి పేరుంది. ఆరు భాషలలో పండితుడు. షడ్భాషా వివరణము అనే వీరి గ్రంధం ఆ విషయాన్ని ఋజువుచేసేదేనని పండితుల అభిప్రాయం. రంగకౌముది అను నాటకాన్ని, కార్తికేయాభ్యుదయం, వామన పురాణం, బాహటం అనే ప్రబంధాలు రచించాడు. భ్రమరగీతాలు రాశాడు. వీరు విజయనగరంలో ఉండిన కాలంలోనే నన్నయ్య రాసిన ఆంధ్రశబ్ధచింతామణికి వ్యాఖ్యానం రాశాడు. అయితే ఈ గ్రంథం నన్నయ రాయలేదని, బాలసరస్వతే రాసి, దానికి గౌరవం కలిగించడం కొరకు నన్నయ పేరు పెట్టి ఉండవచ్చునని కొందరి వాదన. తరువాత త్య్రర్థి కావ్యంగా రాఘవ యాదవ పాండవీయం అను కావ్యాన్ని రాశాడు. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. తిరుపతి వెంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. పర్తియాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి కోరిక మేరకు భీముడు, కాశీరాజు కూతురు నాయకా, నాయికలుగా ”చంద్రికా పరిణయం” అను ప్రబంధ కావ్యాన్ని రాశాడు. ఈ గ్రంథంలో పర్తియాల సంస్థానానికి చెందిన జూపల్లి వారి వంశ చరిత్ర వివరించబడింది. అటుపిమ్మట జటప్రోలు సంస్థానానికి వచ్చి సురభి మాధవరాయల కోరిక మేరకు భరృహరి సుభాషిత త్రిశతిని తెలుగు చేయడానికి పూనుకున్నాడు. భరృహరి సుభాషితాలను అనువాదం చేసిన తొలి తెలుగువాడు కూడా ఎలకూచి బాలసరస్వతే. మాధవరాయల తండ్రి మల్లానాయుడి పేరు మీదగా మల్ల భూపాలీయంగా అనువాదం చేసి ముమ్మడి మల్లానాయుడుకు అంకితమిచ్చాడు. ఇందులో నీతి, శృంగార, వైరాగ్య శతకాలన్నిటిలోనూ మల్లనాయిని మకుటంతోనే చెప్పటం విశేషం. సురభి మల్లా! నీతి వాచస్పతీ! మకుటంతో నీతి శతకాన్ని, సురభి మల్లా! మానినీమన్మథా! మకుటంతో శృంగార శతకాన్ని, సురభి మల్లా! వైదుషీ భూషణా! మకుటంతో వైరాగ్య శతకాన్ని రాశాడు. ఎలకూచి బాలసరస్వతి రాసిన చివరి గ్రంథం కూడా ఇదేనని పండితుల అభిప్రాయం. ఈ అనువాదానికి ఆనందించిన సురభి మాధవరాయలు ఎలకూచి బాలసరస్వతికి రెండువేల దీనారాలు ఇచ్చి సత్కరించాడు ఈ విధంగా జటప్రోలు సంస్థానానికి బాలసరస్వతి గౌరవాన్ని చేకూర్చితే, బాలసరస్వతికీ జటప్రోలు సంస్థానం గౌరవాన్ని చేకూర్చింది. ఇతనికి మహోపాధ్యాయ బిరుదము కలదు. అందువల్ల ఇతడు కవిగా కాక ఎక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాడు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయమను త్య్రర్థికావ్యమున స్వవిషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు. ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు. బాల సరస్వతి రచనలలో యాదవ రాఘవ పాండవీయము తెనుగు నందలి త్య్రర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న యక్ష గానములతో నొకటియై నాటక ముల కుప లక్షణగ నున్నది. ఆయన ఆంధ్ర శబ్ద చింతామణి ని తెలుగు వివరణమును గూడా రచించెను. వీనిని బట్టి చూడ అతనీ ప్రబంధ, ద్వ్యర్థి కావ్య, కావ్యాలంకార సంగ్రహములను రచించిన భట్టుమూర్తితో సరిపోల్చ వచ్చును. ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి,సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.

Tags: Santa Sinha, the arrow on the child labor system

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *