ఇంకా ఆగని జిల్లాల సెగ..

విజయవాడ ముచ్చట్లు:
జిల్లాల విభజన ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు తెచ్చిపెట్టింది. జిల్లా కేంద్రం కోసం జరుగుతున్న ఉద్యమాలు… ఇంకెక్కడో ప్రకంపనలు తీసుకొస్తున్నాయి. సరికొత్త వివాదాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అంచనా వేయలేకపోతున్నారట స్థానిక నేతలు.జిల్లాల విభజన ప్రక్రియ కడప జిల్లా రాజంపేటలోని రాజకీయప‌క్షాల మ‌ధ్య చిచ్చుపెట్టింది. ఇప్పటి దాకా రెవిన్యూ డివిజ‌న్‌గా ఉన్న రాజంపేటను జిల్లాగా కాకుండా అన్నమయ్య జిల్లా పేరుతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప్రతిపాదించారు. కొత్త జిల్లాకు రాయచోటి జిల్లా కేంద్రం. ఈ ప్రతిపాదనలు తెలియగానే రాజంపేటలో రాజకీయం వేడెక్కింది. అందులో ముందుగా గొంతెత్తింది వైసీపీ నేతలే. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబావుటా ఎగరేశారు వైసీపీ నాయకులు. కొందరు తమ ఆవేదనను సెల్ఫీల రూపంలో విడుదల చేశారు. ఇంకొందరు రాజీనామా చేస్తామని ప్రతిజ్ఞలు చేశారు. తగ్గితే వెనకబడిపోతాం అనుకున్నారో ఏమో.. వైసీపీ నియోజకవర్గ నేతలు పోటాపోటీగా రంగంలోకి దిగి జిల్లా కేంద్రం కోసం ఉద్యమం చేపట్టారు.జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వర్గీయులు పోటాపోటీగా మొదట ఉద్యమం చేపట్టారు. ఇతర పార్టీలతో కలిసి జాయింట్ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి చిన్నాన్న కుమారుడు మేడా విజయశేఖర్‌రెడ్డి ఆధిపత్యం కనిపించడంతో అమర్‌నాథ్‌రెడ్డి వర్గం మెల్లగా జారుకుందట. ఉద్యమం పీక్‌లో ఉన్న సమయంలో జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే తన సోదరుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు పెరిగాయి. ఇంతలో రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని అమర్‌నాథ్‌రెడ్డి వర్గం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న ఉద్యమానికి ఎమ్మెల్యే మేడా వర్గీయులు దూరంగా ఉంటున్నారట. కలెక్టర్‌ను కలిసి రాజంపేట జిల్లా ఏర్పాటును పరిశీలించాలని కోరినట్టు సమాచారం. ఈ డిమాండ్‌పై అమర్‌నాథ్‌రెడ్డి పెదవి విప్పడం లేదు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై పార్టీ అధిష్ఠానం నిర్ణయానికే జడ్పీ ఛైర్మన్‌ కట్టుబడినట్టుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీలో జరుగుతున్న ఈ ఆధిపత్య రాజకీయాలను గమనించిన JAC.. అధికారపార్టీని తప్పించి మిగిలిన పక్షాలతో కలిసి ఉద్యమాలు చేస్తోంది.ఈ సమస్య వేడిమీద ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు మేడా రఘునాథరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ అమరనాథ్‌రెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఏం అంశాలపై చర్చ జరిగిందో ఏమో కానీ జిల్లా కేంద్రం కోసం చేపట్టిన ఆందోళనలను పోలీసుల సాయంతో కంట్రోల్‌ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. జిల్లా ఇవ్వలేదన్న రాజంపేట వాసుల నిరసనలపై నాయకులు లోకల్‌ నేతలు ఏం చెప్పారో ఏమో భవిష్యత్‌లో ఏం అవుతుందో అనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేత చంగలరాయుడు సారథ్యంలో ప్రస్తుతం రాజంపేట జిల్లా కోసం ఉద్యమం కొనసాగుతోంది. మరి.. అధికారపార్టీ నేతల మధ్య అంతరం తీసుకొచ్చిన ఈ ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డు ఎలా పడుతుందో చూడాలి.
 
Tags:Sega of non-stop districts

Natyam ad