మహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి ముచ్చట్లు:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మరియు ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శివరాత్రి సంగీత మహోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ముందుగా కళాశాల, పాఠశాల విద్యార్థుల ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ నటరాజస్వామివారికి పూజలు చేశారు. మొదటగా ఎస్వీ నాదస్వరం డోలు పాఠశాల విద్యార్థులు మంగళకరంగా నాదస్వరం, డోలు వాయిద్యసంగీత కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత మోహనకృష్ణ, పవన్‌కుమార్, రూపేష్ అనే విద్యార్థులు పలు భక్తిగీతాలను బృందగానం చేశారు. అనంతరం కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డా. వైవిఎస్.పద్మావతి, వారి శిష్యులు లక్ష్మి, కె.పి.రాధిక బృందం వీనులవిందుగా భక్తి సంగీత కార్యక్రమం చేపట్టారు.
ఆ తరువాత వయోలిన్ – మృదంగం వాద్య సంగీతం, గాత్ర సంగీతం, వేణువు – వీణ వాద్య సంగీతం, మృదంగ లయ విన్యాసం, నాదస్వరం – డోలు వాద్య సంగీతం నిర్వహించారు. అదేవిధంగా, అధ్యాపకులు పూర్ణా వైద్యనాథన్ – వయోలిన్, ఎల్.జయరాం – వయోలిన్, జి.జ్ఞానప్రసూన-వీణ, ఎ.చెన్నయ్య – వేణువు, బి.రఘురాం – మృదంగం వాద్య సమ్మేళనం ఆకట్టుంది.వీటితోపాటు అధ్యాపకులు ఎ.శబరి గిరీష్ గాత్ర సంగీతం, శ్రీ సి.హరనాథ్ శిష్య బృందం – భరతనాట్య ప్రదర్శన, ఎస్.మునిరత్నం – నాదస్వర వాద్యం, రావిపాటి సత్యనారాయణ, ఎం.నాగేశ్వరరావు, జి.చంద్రశేఖర్, సంపత్, సంకీర్త్, నరేంద్ర, లోకేష్ లయవిన్యాసం కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, అన్ని విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags; Shivratri Music Festival begins in Mahathir