Shock for the trainers who depend on the zoological project

జూరాల ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతన్నలకు షాక్‌

Date: 03/01/2018

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:

మాది రైతు ప్రభుత్వం… రైతు సంక్షేమం మా ధ్యేయం’ అని గొప్పలు చెప్పే సర్కార్‌ పెద్దలకు అన్నదాతల కష్టాలు కనిపించడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటకు దిగబడి బడిరాక అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న రైతన్నలకు భరోసా ఇప్పటికీ దక్కడం లేదు. వ్యవసాయం తప్ప మరే పని తెలియని వారికి కష్టాలు అడుగడుగునా వెక్కిరిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు పడక రైతులు వరిని ఆలస్యంగా సాగుచేశారు. దీంతో పంట చేతికి రావడానికి మరో 10 రోజుల సమయం పడుతుంది. తగ్గిన దిగుబడి ద్వారా ఏర్పడిన లోటును పూడ్చుకోవడానికి రబీ సీజన్‌పై పెట్టుకున్న రైతుల ఆశలను అధికారులు నీరుగార్చారు. జూరాల కింద సాగవుతున్న పంటలకు మార్చి 15వ తేదీ వరకు మాత్రమే నీటిని విడుదల చేయాలని, కేవలం 42 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని కేటాయించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టు కింద వరి కాకుండా ఆరుతడి పంటలు వేసుకునే దిశగా రైతులను మల్లించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతులకు ముందస్తు అవగాహన కల్పించకుండా ప్రత్నామ్నాయ పంటల గురించి చైతన్యపర్చకుండా ఉన్నట్టుండి నీటి వీడుదల తేదీని కుదించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు జురాల ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది. వరద సమయంలో మట్టి కొట్టుకొస్తుండడం స్లూయిస్‌ రంధ్రాలు లేకపోవడం వల్ల ప్రాజెక్టులోనే మట్టి నిల్వ ఉంటోంది. ఇక కాల్వలు కూడా శిథిలావస్థకు చేరుకొని, నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. ఇప్పుడు మార్చి 15వ తేదీ వరకే నీటిని విడుదల చేస్తామని అధికారులు తీర్మానించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి చేతికి రావడానికి కనీసం 140రోజులు పడుతుందని, కానీ అధికారుల లెక్క ప్రకారం పంట వేసిన తర్వాత 75రోజులు మాత్రమే నీటి విడుదల చేస్తామనడంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రబీ సాగును దృష్టిలో ఉంచుకుని అధికారులు నీటి విడుదల నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని జూరాల ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Tags: Shock for the trainers who depend on the zoological project

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *