Silent fight lover wife husband escape Vizianagaram

పోరాటం..

సాక్షి

Date :26/01/2018

రెండు రోజులుగా బాధిత యువతి నిరసన

పరారైన ప్రియుడు, కుటుంబ సభ్యులు

ఒకరిది ప్రేమ పోరాటం…మరొకరిది భర్త కోసం ఆరాటం…కానీ వారిద్దరికీ న్యాయం చేయాల్సిన ప్రియుడు, భర్తతో పాటు ఆ రెండు కుటుంబాల వారు ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. దీంతో ఆ యువతి, మరో వివాహిత ప్రియుడు, భర్త ఇళ్ల ముందు పోరాటానికి దిగారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసుల రంగ ప్రవేశంతో వివాహిత పోరాటం తాత్కాలికంగా ఆగినా…ప్రియుడు కోసం ప్రియురాలు చేస్తున్న పోరాటం మాత్రం కొనసాగుతుంది.

విజయనగరం, కొమరాడ:  ప్రేమించానన్నాడు…పెళ్లి చేసుకుంటానన్నాడు…చివరి వరకు తోడు ఉంటానని నమ్మబలికాడు… నువ్వంటే నాకు ప్రాణమని నమ్మించాడు.. మాయమాటలు చెప్పి యువతిని లొంగదీసుకున్నాడు.  చివరకు పెళ్లి అనేసరికి ముఖం చాటేశాడు. పది రోజులుగా కన్పించకుండా పోయాడు. దీంతో ఆ యువతి తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడు ఇంటి ముందు రెండు రోజులుగా న్యాయపోరాటం చేస్తుంది. అన్న పానీయాలు మానివేసి న్యాయం చేయాలని నిరసన తెలియజేస్తుంది. వివరాల్లోకి వెళ్తే…

మండలంలోని తులసివలస గ్రామానికి చెందిన కుట్రిక పుణ్యవతి, అదే గ్రామానికి చెందిన బొడ్డు శేఖర్‌ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శారీరకంగా ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఐదేళ్లుగా తనను నమ్మి తిరిగితే చివరకు కనిపించకుండా పోయాడని పుణ్యవతి తెలిపింది. ఎప్పటిలాగే పండగ ముందు తనను రాత్రి సమయంలో బయటకు తీసుకువెళ్లి మార్గమధ్యంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడని బాధితురాలు తెలిపింది. ఆ రాత్రి అష్టకష్టాలు పడి భయపడుతూ ఇంటికి చేరుకున్నానని పుణ్యవతి చెప్పింది.

దీంతో విషయాన్ని గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టగా ఏ విషయం రెండు రోజుల్లో చెబుతానని శేఖర్‌ గడువు పెడుతూ వస్తున్నాడు. ఇలా పది రోజులు అవుతున్నా శేఖర్‌ ఏ విషయం చెప్పకపోవడంతో కొమరాడ పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పింది. దీంతో ఎస్‌ఐ ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే పుణ్యవతి తనకు న్యాయం చేయాలని శేఖర్‌తో తన వివాహం జరిపించాలని బుధవారం ఉదయం నుంచి తులసివలసలోని శేఖర్‌ ఇంటి ముందు నిరసనకు దిగింది. కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోయినా ఆరుబయటే అన్న పానీయాలు మాని రెండు రోజులుగా నిరసన తెలియజేస్తూ న్యాయపోరాటం చేస్తుంది. అయినా శేఖర్‌గాని కుటుంబ సభ్యులుగాని ఇంతవరకు రాలేదు. రాత్రిపూట చలికి వణుకుతూ ఇంటి ముందు మెట్లపై పుణ్యవతి నిరసన తెలుపుతూ పోరాటం చేస్తుంది. తనకు న్యాయం జరగాలని శేఖర్‌కు ఉద్యోగం వచ్చే వరకు ఆగమన్నా ఆగుతానని ఐదేళ్లైనా, పదేళ్లైనా అతని కోసం వేచి చూస్తానని పేర్కొంది. గ్రామస్తులు, పోలీసులు అక్కడకు చేరుకొని చూస్తున్నారే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

మహిళ మౌన పోరాటం
ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారి వేధింపులు   
బొబ్బిలి: ఓ వివాహిత తన ఆరేళ్ల కుమార్తెతో భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. కట్నకానుకలు, ఖర్చుల కింద రూ.ఏడు లక్షలు ఖర్చు చేసినా తనను వదిలించుకునేందుకు అత్తమామలు, భర్త ప్రయత్నిస్తున్నారని ఇంటి ముందు కుమార్తెతో పాటు కూర్చుంది. న్యాయం చేయాలని వేడుకుంటున్నది. వివరాల్లోకి వెళ్తే…తెర్లాం మండలం నందబలగకు చెందిన దోర దుర్గా భవానికి బొబ్బిలికి చెందిన కళ్యాణరావుతో 2011 అక్టోబర్‌ 12న వివాహమైంది. వీరికి తనూజ అనే ఆరేళ్ల కుమార్తె ఉంది.

వీరు విశాఖలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవల తనకు పనుంది పుట్టింటికి వెళ్లమని భర్త చెప్పాడని, ఆ తరువాత సెల్‌ స్విచ్‌ఆఫ్‌ చేసి అద్దె ఇంటిని మార్చేసి వేరే చోటకు అద్దెకు దిగాడని దుర్గా భవాని, ఆమె తండ్రి ఆరోపించారు. ఆడపిల్ల పుట్టిందని, ఆ తరువాత మాకు జరగడం లేదని మీరు దురదృష్టవంతులని వేధిస్తున్నారని విలేకర్ల వద్ద ఆమె వాపోయింది. మరొకరిని పెళ్లి చేసుకునేందుకు తన భర్త అత్తమామలతో తనను వేధిస్తున్నాడని ఆవేదన చెందింది. తమకు న్యాయం చేయాలంటూ విలేకర్ల ఎదుట వాపోయింది. అనంతరం ఎస్‌ఐ బి.రవీంద్రరాజు తన సిబ్బందితో వచ్చి మీ భర్తతో మీకు మీ ఇంటికి పంపించేలా శనివారం ఏర్పాట్లు చేస్తానని మీ భర్తను రమ్మని పిలిచామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా దీక్ష విరమించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *