22న వరంగల్ కు సింగపూర్ అధికారులు…

Date:13/02/2018
వరంగల్  ముచ్చట్లు:
ఓరుగల్లు మరో కొత్త శోభను సంతరించుకోనుంది. నగరంలో మోనోరైలు ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 22న వరంగల్‌కు ప్రతినిధుల బృందం రానుంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కోసం గత నెలలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చేసిన విదేశీ పర్యటనల తొలి ఫలితం వరంగల్‌కు దక్కనుంది. గత నెల 20న ఆయన స్విట్జర్లాండ్‌లో జరిపిన చర్చల ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటమిన్ ట్రాన్స్‌ఫోర్టేషన్ కంపెనీ వరంగల్, హైదరాబాద్‌లో మోనోరైల్ నడిపేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన కంపెనీ బృందం ఈ నెల 22న నగరంలో పర్యటించనుంది. కాజీపేట, హన్మకొండ, వరంగల్‌లో 12 కిలోమీటర్ల దూరంలో ఈ మోనోరైల్ నడిపేందుకు వీలుంది. ఈనెల 24న మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఏకశిలాపురిలో మోనోరైల్ పరుగులు పెట్టబోతుందా? చారిత్రక, వారసత్వనగరిలో చరితార్థపు అడుగులు పడబోతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ప్రపంచశ్రేణి నగరాల సరసన వరంగల్‌ను నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రిశాఖ కేటీఆర్ చొరవకు ఈ నిర్ణయం ప్రత్యక్ష నిదర్శనంగా నిలవబోతున్నది. వరంగల్ మహానగరంలో మోనోరైల్ పరుగులు పెట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో వరంగల్‌ను అభివృద్ధిపథాన నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టింది. విద్యాకేంద్రంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వరంగల్ రూరల్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమకు అంకుర్పాణ జరిగింది. వీటన్నింటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వరంగల్ మహానగర భవిష్యత్ పురోభివృద్ధ్దిని పరిగణనలోకి తీసుకున్న పలు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.  వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు పట్టణాల సమాహారంగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటమిన్ ట్రాన్స్‌పోర్టేషన్ అనే కంపెనీ మోనోరైల్ ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  గత నెల విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ పర్యటనలో ఇంటమిన్ ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులతో దాదాపు ఆరు గంటలపాటు చేసిన చర్చలు ఫలవంతం అయ్యాయి. గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ స్పందన, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం వంటి పరిణాలు వేగంగా జరిగిపోవడంతో మోనోరైల్ బృందం ఈనెల 22న నగరంలో పర్యటించబోతున్నది. వరంగల్ మహానగరాన్ని చారిత్రక, వారసత్వ, పర్యాటక రంగంలోనే కాకుండా హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో అద్వితీయ సుందర ప్రగతి నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక అభివృద్ధి నమూనాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీ జాబితాలో చోటుదక్కిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అనేక యురోపియన్ దేశాలు తమ పెట్టుబడులకు భారత్‌లో అనువైన రాష్ట్రం తెలంగాణగా భావించింది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ఐపాస్ విధానం పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇటువంటి సానుకూల వాతావరణంలో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఇంటమిన్ ట్రాన్స్‌ఫోర్టేషన్ సంస్థ హైదరాబాద్‌తోపాటు వరంగల్‌లోనూ తమ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపుతోంది. చైనా, రష్యా, ఇజ్రాయిల్, జర్మనీ, వియత్నాం వంటి 30 దేశాల్లో విజయవంతంగా నడుపుతోన్న మోనోరైల్ ప్రాజెక్ట్‌ను ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చింది. బెంగుళూర్ కేంద్రంగా పనిచేస్తోన్న గ్లోబర్ స్పెక్ట్రమ్ సంస్థ, ఇంటమిన్ ట్రాన్స్‌ఫోర్టేషన్ బిసినెస్ అడ్వజర్ ఏఎన్‌ఎన్ సామ్రాట్ తన ప్రతినిధి బృందంతో కలిసి మూడు నెలల క్రితం వరంగల్ మహానగరంలో పర్యటించి ప్రతిపాదనలు రూపొందించింది. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ట్రైసిటీలో 12 కిమీ దూరంలో ఈ మోనోరైల్ నడిపేందుకు వీలుందని సంస్థ ప్రతినిధులు అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన తొలి దశ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కిలోమీటర్‌కు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయని అంచనాలు రూపొందించారు. అత్యాధునిక ఫ్యాబ్రికేటెడ్ సాంకేతిక విధానంలో సింగిల్‌బీమ్‌లో ఎటువంటి భూసేకరణ అవసరం లేకుండా ఈ మోనోరైల్ నడిపేందుకు అనువైన ట్రాక్ నిర్మించవచ్చని తొలి దశ అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం వరంగల్ మహానగరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టిన సానుకూల పరిస్థితుల వల్ల, ప్రస్తుతం ఉన్న రోడ్ డివైడర్ల స్థలంలోనే సింగిల్ పిల్లర్ వేసి అత్యాధునిక మోనోరైల్‌ను నడిపేందుకు అనువైన పరిస్థితులున్నాయని సదరు కంపెనీ భావించింది. ఫ్రీ ఫ్యాబికేటెడ్ టెక్నాలజీతో తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనాలు వచ్చే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించినట్టు తెలుస్తోంది. అన్ని రకాల లాంఛనాలు పూర్తిచేసిన తర్వాత పనులు మొదలుపెట్టినా 10 నుంచి 12 నెలల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టు సిద్ధం చేసే అవకాశాలున్నాయని గ్లోబల్ స్పెక్ట్రమ్ అనే కన్సల్టెంట్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లో ఇంటమిన్ ట్రాన్స్‌పోర్టేషన్ కం పెనీ ప్రతినిధులకు ఇచ్చిన ప్రజంటేషన్‌తో ఆ సంస్థ ప్రతినిధులు మోనోరైల్ నడపవలసిందే అన్న నిర్ధ్దారణకు వచ్చిందని తెలుస్తోంది. వరంగల్ మహానగర పాలక సంస్థ మధ్య ఎంవోయూ కుదిరితే ఈ వరంగల్ మోనోరైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీని అధిగమించడంతోపాటు వరంగల్ ద్వితీయ శ్రేణి అభివృద్ధి చెందుతున్న నగరాల సరసన నిలబెట్టేందుకు తద్వారా దేశంలో ఇటువంటి ప్రాజెక్టును సొంతం చేసుకొని దూసుకుపోతున్న నగరంగా వరంగల్‌ను నిలబెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ కల సాకారమై ఓరుగల్లు చారిత్రక, ఘనవారసత్వానికి మరింత శోభ సంతరించుకునే కల నెరవేరబోతుందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మూడు రోజుల పర్యటన ముగింపు రోజు  మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదుర్చుకునే ఎంవోయూ తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వరంగల్‌కు వచ్చే అవకాశాలున్నాయి.
Tags: Singapore Officials to Warangal on 22nd ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *