కార్మికులను బలిచేసి అవార్డులు అందుకుంటున్న సింగరేణి యాజమాన్యం..

-సిఎం కేసీఆర్ మించి సిఎండి గడీల పాలన సాగుతోంది.
-కార్మికులు మృత్యువాత పడుతుంటే సిఎండి స్పందించరా..?
– మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలి.
-విలేకర్ల సమావేశంలో వర్కర్స్ యూనియన్ నేత కూనంనేని సాంబశివరావు.
భద్రాద్రి కొత్తగూడెంముచ్చట్లు:
సింగరేణి గని కార్మికులకు బలిచేస్తూ యాజమాన్యం అవార్డులు, రివార్డులు అందుకుంటోందని, కార్మికుల సంక్షేమం, రక్షణను విస్మరించి ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాలే ద్యేయంగా సింగరేణి అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యమాలకు పూనుకుంటామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యాలయం శేషగిరిభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కూనంనేని మాట్లాడారు. సింగరేణిలో ప్రమాదాలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని, గడిచిన ఆరు నెలలకాలంలో పది మందికిపైగా కార్మికులు మృత్యువాత పడ్డారని, వంద మందికిపైగా క్షతగాత్రులుగా మిగిలారన్నారు. శ్రీరాంపూర్-3 ఇంక్లైన్, మణుగూరు, రామగుండం ఆండ్రియాలా ప్రాజెక్టు ప్రమాదం కేవలం యాజమాన్యం నిర్లక్ష్యమేనని, ప్రమాదాలకు కారకులైన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. రక్షణలో నిర్లక్ష్యం వహించిన ఫలితంగానే తరచూ ప్రమాదాలు చోటుచేసుకొని కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. కార్మికులతోపాటు మైన్ స్థాయి అధికారులు సైతం మృత్యువాతపడే పరిస్థితులు సింగరేణి సంస్థలో నెలకొన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా సంస్థ
స్పందించకపోవడం దుర్మార్గమైందన్నారు. గడిచిన ఎనిమిదేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించి సిఎండి గడీల పాలన సాగిస్తున్నాడని, ఇంద్రభవనం లాంటి సింగరేణి భవనానికే పరిమితమవుతున్నాడని విమర్శించారు. కార్మికులు, కార్మిక సంఘాలను ఇప్పటివరకు సిఎండి కలిసిన పాపాన పోలేదని, కార్మికులు తమ కష్టాలను ఉన్నతాధికారులకు చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అనాగరికంగా, అమానవీయంగా సింగరేణి స్థలాల్లో దశాబ్దాలుగా జీవిస్తున్న మాజీ కార్మికులు,
సంస్థపై ఆదారపడిన పేదల ఇండ్లను కూల్చివేస్తూ నిరాశ్రయులను చేస్తున్నారన్నారు. సిఎండి తీరుతో సింగరేణి సంస్థ అప్రతిష్టపాలవుతోందని, సుధీర్గ చర్రిత మసకబారుతోందని విమర్శించారు. యాజమాన్యం వచ్చిన హామీ మేరకు మణుగూరు మృతుల కుటుంబాలకు, ఆండ్రియాలా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రక్షణపై యాజమాన్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 10న సింగరేణి ప్రధాన కార్యాయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో యూనియన్ సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి గనిగళ్ళ
వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Singareni ownership that sacrifices workers and receives awards

Natyam ad