సీతక్క ట్రావెల్స్….

వరంగల్ ముచ్చట్లు:
సీతక్క ట్రావెల్స్‌. సొంత నియోజకవర్గంలో కన్నా మిన్నగా.. మరో సెగ్మెంట్‌లో ఈ పేరు మార్మోగుతోంది. ములుగులోకంటే అక్కడ ఎక్కువగా పర్యటించడం సర్వత్రా చర్చగా మారింది. రకరకాల ఊహాగానాలు షికారు చేసేస్తున్నాయి. ఇంతకీ సీతక్క ఫోకస్‌ పెట్టిన కొత్త నియోజకవర్గం ఏంటి?ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ అలజడి రేపుతున్నారు. ఈ మధ్య పినపాక నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తున్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. ములుగు, పినపాకలు ఇరుగుపొరుగు నియోజకవర్గాలే. పక్క నియోజకవర్గం కావడంతో అక్కడికి వెళ్తున్నారని కొత్తలో అనుకున్నా.. పదే పదే పర్యటనలకు రావడం.. పెళ్లిళ్లు పేరంటాలకు హాజరు కావడం.. ఎవరైనా చనిపోతే పరామర్శించడం ఇలా ఒక్కటేంటి ములుగులోకంటే పినపాకలోనే సీతక్క ఎక్కువగా కనిపిస్తున్నారనేంతగా ప్రచారం జరుగుతోంది.పినపాకకు వెళ్తున్నా.. ఏరికోరి కొన్ని ప్రాంతాల్లోనే సీతక్క పర్యటించడం కూడా చర్చగా మారింది. ములుగు జిల్లాలో భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని వాజేడు, వెంకటాపురం ఉన్నాయి. అక్కడికి వెళ్లడం లేదు. గుండాల, కరకగూడెం, మణుగూర్, అశ్వాపురం, బూర్గంపహాడ్ లలో విస్తృతంగా పర్యటిస్తూ పినపాక కాంగ్రెస్‌ శిబిరంలో హాట్ టాపిక్‌గా మారారు సీతక్క. గత అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ప్రభుత్వ విప్‌గా ఉన్నారు.. ఇప్పుడు టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడు. రేగా వెళ్లిపోయాక పినపాకలో కాంగ్రెస్‌ను లీడ్‌ చేసేవాళ్లు లేరు. అక్కడ నాయకత్వం ఖాళీగా ఉండటంతో ఆ లోటును భర్తీ చేస్తున్నారా? లేక వచ్చే ఎన్నికల్లో కుమారుడు సూర్య కోసం ప్లాట్‌ఫామ్‌ సిద్ధం చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఎక్కువయ్యాయి.సీతక్క కాంగ్రెస్‌లో చేరాక ములుగు టికెట్‌ ఇచ్చి.. అక్కడ ఎమ్మెల్యేగా చేసిన పొదెం వీరయ్యను భద్రాచలం పంపారు. ఇద్దరూ గెలిచారు. ఈ మార్పు సీతక్క, వీరయ్యల మధ్య పొలిటికల్‌ గ్యాప్‌ తీసుకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో సీతక్కకు మరోసారి ములుగు టికెట్‌ ఇచ్చినా.. ఆమె కుమారుడి కోసం రెండో టికెట్‌ ఇస్తారా అన్నది పార్టీ వర్గాల సందేహం. పినపాక ఒకప్పుడు బూర్గంపహాడ్‌ నియోజకవర్గంగా ఉండేది. అప్పట్లో చందా లింగయ్య కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలంగా పార్టీలు మారడంతో ఇమేజ్‌ దెబ్బతిందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ప్రస్తుతం లింగయ్య కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయన కుమారుడు సంతోష యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్న తరుణంలో సీతక్క పాచికలు పార్టీలో సెగలు రేపుతున్నాయి.ఒక్క సీతక్కే కాదు.. ఆమె కుమారుడు సూర్య కూడా పినపాకలో అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. దీంతో కొడుక్కోసం ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారనే ప్రచారం బలపడుతోంది. రేగా కాంతారావు టీఆర్ఎస్‌లో చేరినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌ కోసం సీతక్క ఇక్కడ ఉద్యమాలు చేశారు. అప్పట్లో పార్టీ కోసం కొట్లాడారని అంతా అనుకున్నారు. కానీ.. తాజా టూర్స్‌ కలర్‌ వేరనేది కాంగ్రెస్‌ వర్గాలు గట్టిగానే చెవులు కొరుక్కుంటున్నాయి. పార్టీలో పెద్దల సంకేతాలతోనే పినపాకలో తిరుగుతున్నారో.. లేక వేదిక సిద్ధం చేసుకుని కుమారుడి తీర్చిదిద్దే పనిలో ఉన్నారో కానీ.. సీతక్క ప్లాన్స్‌ ఎంత వర్కవుట్‌ అవుతాయో చూడాలి.
 
Tags:Sitakka Travels ….

Natyam ad